స్వర సంచలనం
ABN , Publish Date - Jul 09 , 2026 | 04:58 AM
పందొమ్మిదేళ్ల కిందట... ‘ఇండియన్ ఐడల్’ నుంచి ఖాళీ చేతులతో తిరిగివెళ్లింది దీపాలి సహాయ్. అప్పుడు వేదికపైనున్న హోస్ట్ మినీ మాథుర్ ఆమెను ఊరడిస్తూ... ‘దేశమంతా నీ పాటలను...
ట్రెండింగ్
పందొమ్మిదేళ్ల కిందట... ‘ఇండియన్ ఐడల్’ నుంచి ఖాళీ చేతులతో తిరిగివెళ్లింది దీపాలి సహాయ్. అప్పుడు వేదికపైనున్న హోస్ట్ మినీ మాథుర్ ఆమెను ఊరడిస్తూ... ‘దేశమంతా నీ పాటలను పాడుకొనే రోజు ఒకటి వస్తుంది’ అన్నారు. ఇప్పుడు అదే నిజమైంది. ఏఆర్ రెహమాన్ స్వరానికి గొంతు కలిపిన ‘తేరే పాస్ మై’ పాట ఆ సినిమాకు ప్రాణమైంది. సంగీతాభిమానుల హాట్ ఫేవరెట్‌గా మారింది. రాత్రికి రాత్రే స్టార్ సింగర్ అయిపోయిన దీపాలి పాట వెనుక కథ ఇది.
దర్శకుడు ఇంతియాజ్ అలీ తెరకెక్కించిన చిత్రం ‘మై వాపస్ ఆవూంగా’. దేశ విభజన కాలంనాటి వలసల నేపథ్యంలో సాగే ప్రేమ, అనుబంధాల కథ ఇది. జ్ఞాపకాలు, గతానుభవాలు, ఇల్లు, ప్రియమైనవారితో ఉండే భావోద్వేగ బంధాలను, తరతరాలుగా నిలిచిన మానవ స్ఫూర్తిని స్పృశిస్తుందీ చిత్రం. ఇందులో దీపాలి సహాయ్ ఆలపించిన ‘తేరే పాస్ మై’ పాట హైలైట్. మనసు లోతులను తడిమిన ఒక మరపురాని గీతంగా జన హృదయాల్లో నిలిచిపోతుంది. కథలోని భావోద్వేగాల సారాన్ని కీలక సన్నివేశాల్లో ప్రతిబింబిస్తుంది. ఇది సినీ విశ్లేషకుల మాట. ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ స్వరపరిచిన ఈ పాటను ఇర్షాద్ కామిల్ రాశారు. తన మధురమైన గాత్రంలో భావాలను పలికిస్తూ దీపాలి పాటకు ప్రాణం పోసింది. ఇదే ఆమెను అకస్మాత్తుగా స్టార్‌ను చేసింది. లక్షలమంది అభిమానులను తెచ్చిపెట్టింది. పట్టుదల, ఓర్పు, తన కళపై తనకున్న అచంచలమైన నమ్మకంతో కూడిన సుదీర్ఘ ప్రయాణంలో దీపాలికి దక్కిన అతి పెద్ద విజయం ఇది.
అనూహ్య అవకాశం...
‘‘నాకు ఒక విషయం మాత్రం కచ్చితంగా తెలుసు. నేను కష్టపడగలను. ఒక పని చేపట్టాక దాన్ని అంత సులభంగా వదిలేయను. ఆ పట్టుదలే ఇవాళ నన్ను ఊహించని స్థాయిలో నిలబెట్టింది’’ అంటున్న దీపాలికి ఈ పాట పాడే అవకాశం అనూహ్యంగా దక్కింది. జనవరి 6... ఆమె పుట్టినరోజు. అదేరోజు రెహమాన్ పుట్టినరోజు కూడా. ఆయన టీమ్ నుంచి ఇన్‌స్టాగ్రామ్‌లో దీపాలికి ఒక సందేశం వచ్చింది... ‘రెహమాన్ ఒక పాటను మీతో రికార్డు చేయాలనుకొంటున్నారు’ అనేది దాని సారాంశం. ‘‘యూట్యూబ్, ఇన్‌స్టాలో రీల్స్ చేయడమే కానీ... బాలీవుడ్‌లో నాకంటూ తెలిసినవారు ఎవరూ లేరు. అలాంటిది రెహమాన్ టీమ్ నుంచి నేరుగా సందేశం వచ్చిందంటే నమ్మలేకపోయాను. నా పుట్టినరోజునాడే ఇన్‌స్టాలో ఆయన నన్ను ఫాలో అవ్వడం మొదలుపెట్టారు. ఎలాగో నా రీల్స్‌లో ఒకటి ఆయనకు చేరింది. వీటన్నిటి నేపథ్యంలో తేరుకోవడానికి కొంత సమయం పట్టింది. ఇంకో విచిత్రం ఏమిటంటే... సినిమాల్లో పాటలు పాడాలని నేను ఎప్పుడూ ప్రయత్నించలేదు. ఇష్టంలేక కాదు. మార్గం తెలియక. ఇదంతా దైవ సంకల్పంలా అనిపించింది’’ అంటూ ఎంతో సంతోషంగా చెబుతుంది దీపాలి.
ఆ షో తరువాత...
‘‘మా స్వరాష్ట్రం బిహార్. సినీ సంగీతమంటే ఎంతో ఇష్టం. ఎంతో ప్రయత్నించి 2007లో ‘ఇండియన్ ఐడల్’లోకి అడుగుపెట్టాను. అక్కడ విజేతను కాలేకపోయాను. కానీ అప్పటి నుంచీ ఎక్కువగా ముంబయిలోనే నివసిస్తున్నాను. చిత్ర పరిశ్రమ, దాని సంస్కృతిని గమనిస్తూ వచ్చాను. అవకాశాల కోసం ఎదురుచూడలేదు. ఎందుకంటే ఆ రేస్‌లోకి నేను దిగలేను. నా పరిధిలో నాకు నచ్చింది చేసుకొంటూ వెళ్లాను. ఆ క్రమంలోనే భోజ్‌పురీ జానపదాలను దేశమంతటికీ పరిచయం చేయాలని, తద్వారా వాటికి పూర్వ వైభవం తేవాలని ప్రయత్నిస్తున్నాను. అందులో భాగంగా యూట్యూబ్ ఛానల్‌తో పాటు ఇన్‌స్టా రీల్స్ చేస్తున్నాను’’ అంటున్న దీపాలికి లక్షకు పైగా ఫాలోవర్స్, సబ్‌స్ర్కైబర్స్ ఉన్నారు.
‘నేను నాలాగా’...
‘‘నేను చాలా సున్నిత మనస్కురాలిని. సినిమాల్లో భావోద్వేగ సన్నివేశాలు చూసి ఏడ్చేదాన్ని. అప్పుడు మా నాన్న... ‘ఏడవకు. ఇది నటన మాత్రమే’ అని చెప్పేవారు. బాల్యంలో మన స్పందన స్వచ్ఛంగా ఉంటుంది. వయసు పెరిగేకొద్దీ మనం కలుషితమై, మన భావోద్వేగాలను అణచుకోవడం ప్రారంభిస్తాం. కానీ పుణే ‘ఫిలిమ్ అండ్ టెలివిజన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా’ (ఎఫ్‌టీఐఐ)కు వెళ్లాక నాలో మార్పు వచ్చింది. ఎవరేమనుకొంటారో అనేది వదిలేసి, మనం మనలా ఉండగలగడానికి కావల్సిన ధైర్యం ఎఫ్‌టీఐఐ ఇచ్చింది. నాకు సాంకేతికత నేర్పింది. తార్కిక వాదనలు పక్కనపెట్టి సినిమాలో ఒక భాగంగా మారమని, అప్పుడే ఒక సినిమా వెనుకనున్న కష్టం, సామర్థ్యం ఏమిటో అర్థమవుతాయని చెప్పింది. సంగీతానికి సంబంధించి అక్కడ ఒక కోర్సు పూర్తి చేశా’’... నాటి రోజులు గుర్తు చేసుకుంది దీపాలి.
చెన్నై వెళ్లి...
రెహమాన్ బృందం నుంచి మెసేజ్ రాగానే దీపాలి వెంటనే చెన్నైకు వెళ్లింది. పాటను రికార్డు చేసింది. అదే ‘తేరే పాస్ మై’. తరువాత పలు రకాలు మారి చివరకు చక్కని పాటగా వెండితెరపై అలరించడానికి సిద్ధమైంది ఆ పాట. అయితే అప్పుడు రెహమాన్ విదేశాల్లో ఉండటంతో ఆయన్ను కలవలేకపోయింది. రెండు నెలల తరువాత అనుకోకుండా ముంబయిలోని ఒక కార్యక్రమంలో రెహమాన్‌ను కలిసింది దీపాలి. ‘పాట చాలా బాగా వచ్చింది’ అని రెహమాన్ చెప్పడంతో ఆమె ఆనందంతో ఉక్కిరిబిక్కిరి అయింది. ‘‘ఒకసారి ఆయన ‘ఇండియన్ ఐడల్’కు వెళ్లినప్పుడు రాబోయే చిత్రంలోని పాటపాడమన్నారు. అప్పుడు ఆయన నేను పాడిన ‘తేరే పాస్ మై’ పాడారు. ఆ క్షణం నేను భావోద్వేగాలను అదుపు చేసుకోలేకపోయాను. ఏడ్చేశాను. జీవితం ఒక పూర్తి సర్కిల్‌ను పూర్తి చేసినట్లు అనిపించింది. పందొమ్మిదేళ్ల కిందట ఎవరైనా ఇలాంటి రోజు ఒకటి వస్తుందని చెబితే నమ్మేదాన్ని కాదు. కానీ నాడు ‘ఇండియన్ ఐడల్’లో ఖాళీ చేతులతో వేదికపై నిలుచున్నప్పుడు మినీ మాథుర్ అన్నారు... ‘ఒకరోజు దేశమంతా నీ పాటలు పాడుకొంటారు’ అని. నేడు అదే నిజమైంది. చిత్రం విడుదలయ్యాక... నా పాట అద్భుత విజయాన్ని అందుకుంది. అందుకు కారణం...
నా స్వరంలో ఒక ప్రత్యేకత ఉండటమేనని భావిస్తున్నా. చాలామంది అలనాటి గాయనీమణులను నా గాత్రం జ్ఞప్తికి తెస్తుందన్నారు. ఇది నాకు పెద్ద అభినందన’’ అంటున్న దీపాలి... భవిష్యత్తులో ఇలాంటి మెగా అవకాశాలు మరిన్ని వస్తాయని ఆశిస్తోంది.
ఈ వార్తలనూ చదవండి:
కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు.. ఒక్కరోజులో రూ.8.4 లక్షల కోట్ల మదుపరుల సంపద ఆవిరి
ఈపీఎఫ్‌ఓ చందాదారులకు గుడ్‌న్యూస్..!