బాధితులకు ‘పెద్దక్క’
ABN , Publish Date - Feb 25 , 2026 | 05:50 AM
దళిత, ఆదివాసీ మహిళలు, బాలికల సమస్యలపై గడ్డం ఝాన్సీది రెండు దశాబ్దాల పోరాటం. దళిత మహిళలపై హింస రూపం మారిందంటున్న ఝాన్సీ... ‘దళిత స్త్రీ శక్తి’ వ్యవస్థాపకురాలుగా వేల మంది బాధితులకు న్యాయం...
దళిత, ఆదివాసీ మహిళలు, బాలికల సమస్యలపై గడ్డం ఝాన్సీది రెండు దశాబ్దాల పోరాటం. దళిత మహిళలపై హింస రూపం మారిందంటున్న ఝాన్సీ... ‘దళిత స్త్రీ శక్తి’ వ్యవస్థాపకురాలుగా వేల మంది బాధితులకు న్యాయం దక్కేలా పాటుపడుతున్నారు. ఈ ఏడాది ఇరవయ్యేళ్లు పూర్తి చేసుకున్న తమ సంస్థ ప్రస్థానం, లక్ష్యాల గురించి ‘నవ్య’కు వివరించారు.
‘‘ప్రేమించేటప్పుడు అమ్మాయి కులం గుర్తుకురాదు కానీ పెళ్లిచేసుకోవాల్సి వచ్చినప్పుడు మాత్రం అబ్బాయిలు ముఖం చాటేస్తున్నారు. ఒకరు, ఇద్దరు కాదు... ప్రేమపేరుతో మోసపోయిన కొన్ని వందలమంది దళిత బాధితురాళ్ల పక్షాన ‘దళిత స్త్రీ శక్తి’ పోరాడుతోంది. ఈ ఇరవై ఏళ్లలో కనీసం నాలుగు వేల కేసులైనా ఇలాంటివి మా దగ్గరకు వచ్చి ఉంటాయి. ‘ప్రేమిస్తున్నా’మంటారు! మాయమాటలు చెప్పి దగ్గరవుతారు. అమ్మాయి నెల తప్పిందని తెలియగానే పారిపోతారు. ‘‘కడుపులో బిడ్డ సంగతేమిటి?’’ అని నిలదీస్తే... ‘‘మాకు సంబంధం లేదు’ అని తిరిగి ఆ అమ్మాయి వ్యక్తిత్వం మీద బురద జల్లుతారు. ఈ మధ్య కాలంలో ఇలాంటి కేసులు బాగా పెరిగాయి. ‘‘పోనీ ‘వద్దు’ అనుకున్నవాడిని మరచిపోయి హాయిగా కొత్త జీవితాన్ని ప్రారంభించండి’’ అని అమ్మాయిలకు ఎంత నచ్చజెప్పినా... వాళ్లు ససేమిరా ఒప్పుకోరు. ‘‘చచ్చినా బతికినా ప్రేమించినవాడితోనే’’ అంటూ మొండికేస్తారు. ప్రేమ పేరుతో మోసపోయిన ఒక అమ్మాయి తనకు బిడ్డ పుట్టినప్పుడు న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. ఇప్పుడు ఆ పిల్లాడు ఇంజనీరింగ్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. డీఎన్‌ఏ రిపోర్టుల్లాంటివి అన్నీ ఉన్నా... ఆ అమ్మాయికి ఇంతవరకు న్యాయం దక్కలేదు. మోసగాడు మాత్రం మరొక పెళ్లిచేసుకొని సుఖంగా జీవిస్తున్నాడు. తన బిడ్డకు తండ్రి ఉన్నాడని లోకానికి చాటాలన్నది ఆ తల్లి తాపత్రయం. ఇంకొందరు అబ్బాయిలు కుటుంబాన్ని ఎదిరించి కులాంతర వివాహం చేసుకుంటారు. కొన్నాళ్ల తర్వాత భార్యను కులం పేరుతో తిడుతూ నానా హింసలు పెట్టి ఇంటి నుంచి వెళ్లగొడతారు. సాధారణ మహిళలు లింగ వివక్షను మాత్రమే ఎదుర్కొంటూ ఉంటే... కుల, లింగ వివక్షలను నిత్యం ఇంట, బయట పంటిబిగువున భరిస్తూ బతుకెళ్లదీస్తున్న దళిత, ఆదివాసీ మహిళలు ఎంతో మంది. అలాంటి వారికి మేము అండగా నిలుస్తున్నాం.
పెద్ద యుద్ధమే చేయాల్సివస్తోంది
దళిత మహిళలను వ్యక్తులుగా, శక్తులుగా తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో ‘దళిత స్త్రీశక్తి’ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని 11 జిల్లాల్లో చాలా చురుగ్గా పనిచేస్తోంది. ‘గ్రామాల్లో మహిళా కలయిక నాయికల సంఘాలు’ ఏర్పాటు చేసి చట్టాలు, హక్కులతో పాటు విద్య, ఆరోగ్యాభివృద్ధి వంటి ప్రాథమిక విషయాలమీద అవగాహన కల్పిస్తున్నాం. కృష్ణా జిల్లాలో ఏడేళ్ల బాలికపై లైంగిక దాడి ఘటనలో ‘దళిత స్త్రీశక్తి’ జోక్యం చేసుకొనే వరకు పోలీసులు ఎఫ్‌ఐఆర్ కూడా దాఖలు చేయని దుస్థితి. కొన్ని కేసుల్లో అయితే పోలీసులతో మేము పెద్ద యుద్ధమే చేయాల్సి వస్తోంది. అత్యాచారాలు, హత్యలు లాంటి 1,300కుపైగా మేజర్ కేసుల్లో బాధితురాళ్ల పక్షాన న్యాయస్థానాల్లో పోరాడుతున్నాం. అందులో పోక్సో కేసులు కూడా వందకుపైగా ఉంటాయి. ప్రేమ పేరుతో మోసాలు, కులోన్మాద దాడులు, గృహహింస, ఇతర వేధింపులకు సంబంధించి 13,909 కేసుల పరిష్కారం నిమిత్తం బాధితుల పక్షాన ‘దళితస్త్రీ శకి’్త పెద్దక్కగా ఉద్యమిస్తోంది. అలాగే ప్రతి సంవత్సరం రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వాధికారులు, న్యాయనిపుణుల సమక్షంలో కొన్ని కేసులపై లీగల్ క్లినిక్ నిర్వహిస్తున్నాం. బాధితురాళ్ల కోసం ప్రత్యేకంగా మానసిక ఆరోగ్య శిబిరాలు, కౌన్సెలింగ్ తరగతులు ఏర్పాటు చేస్తున్నాం. అత్యాచార బాధితురాళ్లకు పునరావాస కల్పన, ఆర్థిక పరిహారం అందించడం లాంటి విషయాల్లో ముందుండి పని చేస్తున్నాం. ఇప్పటివరకు అయిదు కోట్ల రూపాలయకు పైగా పరిహారాన్ని బాధితులు లేదా బాధితుల కుటుంబ సభ్యులకు ఇప్పించగలిగాం.
బెదిరింపులు సాధారణమే
పోరాటంలోకి దిగిన తర్వాత కొన్ని సందర్భాల్లో ప్రాణాలను కూడా లక్ష్యపెట్టలేం. గుంటూరులో ఒక హత్య కేసులో బాధిత కుటుంబం పక్షాన పోరాడుతున్న సమయంలో నాకు వరుసగా వారం- పది రోజులు ‘చంపేస్తాం, నరికేస్తాం’ అంటూ బెదిరింపు ఫోన్లు వచ్చాయి. అయినా వెనక్కి తగ్గలేదు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని ఓ గ్రామంలో భూమి తగాదా కారణంగా ఆధిపత్య కులానికి చెందిన కొందరు... దళితులను కర్రలతో కొట్టారు. ఆ పక్కనే మరొక గ్రామంలో దళితులు గణేష్ నవరాత్రుల్లో వేలంపాట ద్వారా లడ్డూర పసాదం దక్కించుకున్నారన్న అక్కసుతో ఆధిపత్య వర్గాలు దాడికి తెగబడ్డాయి. పోలీసులు నిందితులపై కనీసం ఎఫ్‌ఐఆర్ కూడా నమోదు చేయకుండా శాంతి చర్చల (శాంతి కమిటీ ఏర్పాటు)కు పిలిచారు. నేనూ వెళ్లాను. ‘‘రాజీ కుదుర్చుకుందాం! అయితే దెబ్బలు తిన్న నా దళిత బిడ్డలు కూడా కర్రలతో అవతలివాళ్లను కొడతారు. చెల్లుకు చెల్లు. అప్పుడు పీస్ కమిటీ ఏర్పాటు చేద్దాం’’ అన్నాను. అప్పుడు నిందితులపై పోలీసులు కేసు నమోదు చేశారు. తర్వాత ‘దళిత స్త్రీ శక్తి’ ఆ రెండు గ్రామాల్లో సామాజిక సమానత్వం, అంబేడ్కర్ ఆలోచనలపై సమావేశాలు నిర్వహించింది. ఇప్పుడు రెండు గ్రామాల్లోని ఇరువర్గాలు కలిసిమెలిసి జీవిస్తున్నారు. ఊరి నడిబొడ్డున అంబేడ్కర్ విగ్రహాన్ని ఏర్పాటుచేసి ఆవిష్కర్తగా ఇరు గ్రామస్తులు నన్ను ఆహ్వానించినప్పుడు చాలా సంతోషం కలిగింది.
చట్టాలపై అవగాహన
కులవివక్ష కాలంతో పాటు కొత్తరూపాలు సంతరించుకుంది. అది బయటకు కానరాకుండా చాలా బలంగా సమాజం మీద ప్రభావం చూపిప్తోంది. ప్రేమ పేరుతో మోసాలు అందుకు నిదర్శనం. షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగలపై అత్యాచార నిరోధక చట్టంతో పాటు గృహహింస, వరకట్ననిషేధ చట్టం వంటివాటిపై పోలీసులకు కనీస అవగాహన ఉండడంలేదని మా అనుభవంలో గ్రహించాం. అలాంటప్పుడు ఇక బాధితులకు న్యాయం ఎలా దక్కుతుంది.? అందుకే దళిత, ఆదివాసీ మహిళలకు చట్టాలు, రాజ్యాంగంపై సరైన అవగాహన కల్పించాలన్న సంకల్పంతో తెలుగులో ‘మన చట్టాలు’, ‘సంక్షిప్తంగా రాజ్యాంగం’ తదితర పుస్తకాలు ప్రచురించి పల్లెల్లో పంచుతున్నాం. దళిత, ఆదివాసీ బాలికలు, మహిళలు సర్వతోముఖాభివృద్ధిని, ఆర్థిక స్వాతంత్రాన్ని సాధించాలి. సామాజిక అవగాహనతో అవరోధాలు దాటి ముందుకు వెళ్లాలి. అదే ‘దళిత స్త్రీ శక్తి’ ప్రధాన లక్ష్యం. అందుకోసం నా చివరి శ్వాసవరకు పని చేస్తాను.’’
సాంత్వన్
ఫొటో: జ్వాలా కోటేశ్
అందుకే ‘దళిత స్త్రీ శక్తి’
దళిత మహిళలకు కుటుంబంలో ఎదురయ్యే హింసాత్మక ఘటనలు కొన్ని కళ్లారా చూశాను. వీటిపై దళిత హక్కుల ఉద్యమకారులుసైతం నోరుమెదపకపోవడం నాకు ఆశ్చర్యం కలిగించింది. పితృస్వామ్యానికి ఎవరూ అతీతులుకాదన్నది నాకు అప్పుడు అర్థమైంది. అంతకు ముందు నుంచీ దళితుల పక్షాన పని చేస్తూ ఉమ్మడి ఏపీలోని అన్ని జిల్లాలు పర్యటించాను. కడపలో పోరాడిమరీ దళితులకు భూమి పంపిణీ చేయించగలిగాను. ఆ అనుభవంతో దళిత, ఆదివాసీ మహిళలు, బాలికల అభ్యున్నతి లక్ష్యంగా 2006లో ‘దళిత స్త్రీ శక్తి’ ప్రారంభించా. మా దగ్గరకు వచ్చే బాధితులంతా నిరుపేదలు. కులం, ధనం అండ లేనివాళ్లు. చాలా సందర్భాల్లో హింసకు పాల్పడుతున్న వారంతా ధనికులు, ఆధిపత్య కులాలకు చెందినవారే. అలాంటివారిని ఢీకొని బాధితులకు అండగా నిలవడమే మా కర్తవ్యం.
ఇవి కూడా చదవండి..
మాజీ మంత్రి మల్లారెడ్డికి సుప్రీంకోర్టులో చుక్కెదురు..
కొత్త పార్టీని ప్రకటించిన శశికళ