భవిష్యత్తుకు బాట వేస్తున్నారు
ABN , Publish Date - Aug 06 , 2026 | 03:24 AM
ఇంటి ఖర్చుల కోసం చదువుకొంటూనే వ్యవసాయ కూలీగా పని చేశారు. చదువుకోవాలన్న తన ఆకాంక్షను పెళ్లి పేరుతో పెద్దలు మొగ్గలోనే తుంచేసినా... అవరోధాలు ఎన్ని ఎదురైనా..
స్ఫూర్తి
ఇంటి ఖర్చుల కోసం చదువుకొంటూనే వ్యవసాయ కూలీగా పని చేశారు. చదువుకోవాలన్న తన ఆకాంక్షను పెళ్లి పేరుతో పెద్దలు మొగ్గలోనే తుంచేసినా... అవరోధాలు ఎన్ని ఎదురైనా... ఆమె ఎన్నడూ ఆత్మనిబ్బరాన్ని కోల్పోలేదు. దూర విద్యలో పలు డిగ్రీలు చదివి... నేడు తనలాంటివారికి అండగా నిలబడ్డారు. కోచింగ్ సెంటర్ పెట్టి... సమాజోద్ధరణకు సంకల్పించిన 29 ఏళ్ల ప్రియా నటరాజన్ జర్నీ ఇది.
‘‘ఒక వ్యక్తి భవిష్యత్తును పరిస్థితులు ఎన్నడూ నిర్ణయించకూడదు. నా అకాడమీ ద్వారా దీన్ని నిరూపించాలని అనుకొంటున్నా. విద్యకు జీవితాలను మార్చే శక్తి ఉంది. దాన్ని అందరికీ అందుబాటులోకి తీసుకురావడమే ధ్యేయంగా పని చేస్తున్నాను. ఎందుకంటే చదువు దూరం అయినప్పుడు బాధ ఎలా ఉంటుందో నాకు తెలుసు. ఆ బాధ మరే విద్యార్థి అనుభవించకూడదనేదే నా తాపత్రయం. ఆ ఉద్దేశంతోనే ‘అవ్వయ్యార్ ఐఏఎస్ అకాడమీ’ నెలకొల్పాను. దీని ద్వారా రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ పోటీ పరీక్షలకు శిక్షణ ఇస్తున్నాను.
వ్యవసాయ కుటుంబం...
తమిళనాడు రాష్ట్రం పడలూర్‌లో వ్యవసాయ కుటుంబం మాది. ఊళ్లో మాకు రెండెకరాల పొలం ఉండేది. దానిపై వచ్చే ఆదాయం ఇంటి ఖర్చులకు సరిపోయేది కాదు. అమ్మానాన్నలకు సాయంగా ఉంటుందని బడి సెలవుల్లో వ్యవసాయ కూలీగా పని చేసేదాన్ని. ఎన్ని ఇబ్బందులున్నా ఏ రోజూ బడి మానలేదు. బాగా చదువుకోవాలి. స్వశక్తితో ఎదగాలి. నచ్చిన రంగంలో స్థిరపడాలి... చిన్నప్పుడు ఇదే నా ఆకాంక్ష. కానీ విధి మరోలా తలచింది. పదో తరగతిలోకి వచ్చేసరికి ఇంట్లోవాళ్లు చదువు మానేయమన్నారు. అప్పుడే పెళ్లి వద్దని ఎంత చెప్పినా వినలేదు. ఎలాగా వారిని ఒప్పించి ఒక ఏడాది వాయిదా వేశాను.
వద్దనుకున్నా తప్పలేదు...
ఇల్లు వదిలేసి పెరంబలూరు ప్రభుత్వ పాఠశాలలో పదకొండో తరగతిలో చేరాను. హాస్టల్‌లో ఉంటూ చదువు కొనసాగించాను. ఏడాది అయిందో లేదో... ఇంటి నుంచి పిలుపు. ‘నీకు పెళ్లి చేయాలి. తిరిగి వచ్చేసేయ్’ అని. మరికొంత కాలం వాయిదా వేయమని వేడుకున్నాను. ఈసారి నా అభ్యర్థనను అమ్మానాన్నలు అస్సలు పట్టించుకోలేదు. బలవంతంగా పెళ్లి చేశారు. అత్తింటికి వెళ్లాను. వారిని ఒప్పించి చదువు కొనసాగించాలని ప్రయత్నించాను. అక్కడా నిరాశే ఎదురైంది. విషయం నా భర్తకు చెప్పాను. ఆయన నన్ను అర్థం చేసుకున్నారు. కానీ బయటకు పంపడానికి ఇష్టపడలేదు. ఇంటి పనులు చేసుకొంటూనే, దూర విద్య ద్వారా పలు డిగ్రీలు పూర్తి చేశాను.
ప్రభుత్వ ఉద్యోగం కాదునుకొని...
డిగ్రీ తరువాత ఓ కంపెనీలో ఉద్యోగంలో చేరాను. ఆ డబ్బుతో పోటీ పరీక్షలకు ఫీజులు కట్టుకున్నాను. ఉద్యోగం చేస్తూనే టీఎన్‌పీఎ్‌ససీ లాంటి పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యాను. చివరకు నా ప్రయత్నం ఫలించింది. ప్రభుత్వ ఉద్యోగం వచ్చింది. ఎందుకో తెలియదు... ఆ క్షణం నా ఆలోచన మారిపోయింది. ఇన్నేళ్లూ దేని కోసమైతే కష్టపడ్డానో, ఏదైతే కోరుకున్నానో అది నెరవేరింది. కానీ అందులో సంతృప్తి లేదనిపించింది. నాలాగా నా చుట్టూ ఎంతోమంది అమ్మాయిలు ఉన్నారు. పరిస్థితుల కారణంగా తమ కలలను మధ్యలోనే వదిలేసి, నిస్సారమైన జీవితాన్ని గడుపుతున్నారు. వారికి అండగా నిలబడాలని నిర్ణయించుకున్నాను. ఆర్థిక స్థోమత లేని పిల్లలకు చేయూతనిచ్చి, ఉపాధి మార్గం చూపాలని అనుకున్నాను. అందుకే ప్రభుత్వ ఉద్యోగం వద్దనుకుని లక్ష్యం వైపు అడుగులు వేశాను.
అకాడమీతో అవకాశాలు కల్పించి...
ఏం చేసినా వ్యవస్థీకృతంగా ఉండాలి. నిరంతరం సేవలు అందించాలి. అలా 2022లో ‘అవ్వయ్యార్ ఐఏఎస్ అకాడమీ’ ప్రారంభించాను. 73 మంది విద్యార్థులతో మొదలైంది. ఏటికేడూ పెరుగుతూ నాలుగేళ్లలో ఆ సంఖ్య అనూహ్యంగా పెరిగింది. ఇప్పటివరకు ఎనిమిది వేల మందికి పైగా పోటీ పరీక్షల కోసం మా అకాడమీలో శిక్షణ పొందారు. వారిలో దాదాపు మూడు వేల మంది వివిధ ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగాలు సంపాదించారు. వారిని చూస్తే నన్ను నేను చూసుకున్నట్టే ఉంటుంది. ఆత్మసంతృప్తి కలుగుతుంది. ఆర్థికంగా వెనుకబడినవారు, ఏ దిక్కూ లేనివారు, ఒంటరి మహిళలు, సింగిల్ పేరెంట్ ఉన్న పిల్లలకు ఉచితంగా శిక్షణ ఇస్తున్నాను. వ్యవసాయ కుటుంబాల నుంచి వచ్చినవారైతే 25 శాతం ఫీజులో రాయితీ కల్పిస్తున్నా. మిగిలినవారి నుంచి నామమాత్రంగా తీసుకొంటున్నా. అది అకాడమీ నిర్వహణ ఖర్చుల కోసం. అంతేకాకుండా... పేద కుటంబాలకు చెందిన మహిళలకు వందకు పైగా కుట్టు మిషన్లు ఉచితంగా అందించాను. జీర్ణావస్థలో ఉన్న స్థానిక గ్రంథాలయం పునర్నిర్మాణం కోసం నా సొంత భూమి కేటాయించాను.
విలువ తెలుసు...
విద్య విలువేంటో నాకు తెలుసు. దాని కోసం ఎన్నో బాధలు పడ్డాను. సవాళ్లు ఎదుర్కొన్నాను. పరిస్థితులు అనుకూలించక బడి మానేసే పిల్లల్ని చూసినప్పుడు బాధ కలుగుతుంది. అందుకే వివిధ కారణాలతో చదువుకు దూరమైన పిల్లలను తిరిగి బడి బాట పట్టించేందుకు, విద్యను అందరికీ అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నా. వంద మంది పేద కుటుంబాలకు చెందిన పిల్లలను దత్తత తీసుకున్నాను. వారి చదువుకు అయ్యే ఖర్చంతా నేనే భరిస్తున్నా. ఏదిఏమైనా బాల్య వివాహం నా కలకు ముగింపు కాకూడదని, అది ఒక అసాధారణ కథకు ఆరంభం కావాలని నాడు నిశ్చయించుకున్నా. ఆ దృఢ సంకల్పమే నేడు వేలమంది జీవితాలకు, బంగరు భవిష్యత్తుకు భరోసా అయింది. ఇంతకు మించిన ఆత్మసంతృప్తి ఎక్కడ ఉంటుంది!’’
ఇవీ చదవండి:
'నేను ఎంకే స్టాలిన్ తనయుడిని'.. ఉదయనిధి స్టాలిన్ కీలక వ్యాఖ్యలు
తమిళనాడు బడ్జెట్: పుట్టిన బిడ్డకు గోల్డ్ రింగ్.. జెన్ జీకి రూ.2 వేల కోట్లు