రాత్రికి రాత్రే అందం
ABN , Publish Date - Mar 02 , 2026 | 05:23 AM
కంటి నిండా నిద్ర చర్మ ఆరోగ్యాన్ని ఇనుమడింపచేస్తుంది. కాబట్టే అలాంటి నిద్రను ‘బ్యూటీ స్లీప్’గా పరిగణిస్తూ ఉంటారు....
బ్యూటీ
కంటి నిండా నిద్ర చర్మ ఆరోగ్యాన్ని ఇనుమడింపచేస్తుంది. కాబట్టే అలాంటి నిద్రను ‘బ్యూటీ స్లీప్’గా పరిగణిస్తూ ఉంటారు. అయితే ఈ నిద్రతో రెట్టింపు ఫలితం పొందాలంటే కొన్ని సౌందర్య చిట్కాలు కూడా ట్రై చేస్తూ ఉండాలి. అవేంటంటే...
యాంటిఆక్సిడెంట్ ఫేస్ క్రీమ్: పగలంతా కాలుష్యం, భిన్నమైన వాతావరణాలతో పోరాడి అలసిపోయిన చర్మం రాత్రి వేళ విశ్రాంతి తీసుకుంటుంది. చర్మ చికిత్సకు ఇదే సరైన సమయం. చర్మ సంరక్షణ కోసం ఉపయోగించే విటమిన్ సి, రెటినాల్ మొదలైన బ్రైటెనింగ్ ఏజెంట్స్ కలిగిన క్రీమ్స్‌తో రాత్రివేళ రెట్టింపు ఫలితం పొందవచ్చు. ఇందుకోసం యాంటిఆక్సిడెంట్స్ ఉన్న నైట్ క్రీమ్ అప్లై చేయాలి. ఇవి చర్మపు వయసుని పెంచే ఫ్రీ రాడికల్స్‌తో పోరాడతాయి. ఫలితంగా పగటివేళ ఇలాంటి వాటికి బహిర్గతమవడం వల్ల పాడైన చర్మం రాత్రివేళ జీవం పుంజుకుంటుంది
కళ్ల కింద వాపు: రాత్రి బాగానే ఉన్న కళ్లు ఉదయం లేవగానే ఉబ్బిపోతున్నాయా? కళ్ల కింద ఇలాంటి ఉబ్బు రాకుండా ఉండాలంటే రాత్రి తలకింద రెండు దిండ్లు పెట్టుకుని పడుకోవాలి. ఇలా చేయటం వల్ల కళ్ల కింద పేరుకున్న ద్రవాలు డ్రెయిన్ అయిపోతాయి. ఈ చిట్కాతో పాటు కెఫీన్ కలిగిన ఐక్రీమ్స్ అప్లై చేయాలి
హెయిర్ మాయిశ్చరైజర్: జుట్టు పట్టుకుచ్చులా తయారవ్వాలంటే రాత్రివేళ వెంట్రుకలకు లీవిన్ కండిషనర్ అప్లై చేయాలి. అలా అప్లై చేసుకుని పడుకోవటం వల్ల కండిషనర్ వెంట్రుకల కుదుళ్లలోకి చొరబడే సమయం ఉంటుంది కాబట్టి ఉదయానికల్లా వెంట్రుకలు సిల్కీగా తయారవుతాయి. రాత్రివేళ కొబ్బరినూనెతో మసాజ్ చేసుకుని ఉదయాన్నే తలస్నానం చేసినా ఇదే ఫలితం దక్కుతుంది
తడి జుట్టును టవల్‌తో చుట్టేయాలి: రాత్రివేళ తలస్నానం చేసే అలవాటుంటే జుట్టును అలాగే వదిలేసి పడుకోకూడదు. తడి వెంట్రుకలు తేలికగా తెగుతాయి. అలాగే నిద్రపోతే దిండుకు ఒరుసుకుని వెంట్రుకలు చిట్లిపోయే ప్రమాదం కూడా ఉంది. కాబట్టి రాత్రివేళ తలస్నానం చేస్తే టవల్‌తో చుట్టి పడుకోవాలి. ఇలా చేస్తే తడిని టవల్ పీల్చేసుకుంటుంది. టవల్‌లో చుట్టడం వల్ల ఉదయానికల్లా వెంట్రుకలు వంకీలు కూడా తిరుగుతాయి
చేతులు, పాదాలు మృదువుగా: పగిలిన పాదాలు, బిరుసెక్కిన చేతులను సరిచేయటానికి రాత్రివేళే అనువైన సమయం. వాజెలీన్ లేదా కొబ్బరి నూనెను చేతులకు, పాదాలకు అప్లై చేసి గ్లౌవ్స్, సాక్స్ వేసుకుని పడుకుంటే ఉదయానికల్లా మృదువుగా తయారవుతాయి. గ్లౌవ్స్, సాక్స్ వేసుకుని పడుకోవటం మొదట్లో కాస్త అసౌకర్యంగా అనిపించినా కొద్ది రోజులకు అలవాటైపోతుంది
విటమిన్ ఇ: చర్మం ముడతలు తగ్గి నునుపుగా మారడం కోసం విటమిన్ ఇ నూనె ముఖానికి అప్లై చేసుకోవచ్చు. అయితే పగటి వేళకు బదులుగా రాత్రి వేళ ఈ పని చేస్తే రెట్టింపు ఫలితం దక్కుతుంది
ఆహారం: రాత్రి భోజనంలో తినే పదార్థాలు కూడా చర్మం మీద ప్రభావాన్ని కనబరుస్తాయి. కాబట్టి రాత్రివేళ తినే ఆహారంలో నూనె, మసాలాలు తక్కువగా ఉండేలా చూసుకోవాలి. ఇన్‌ఫ్లమేషన్‌ను పెంచే తీపి పదార్థాలకు రాత్రి డిన్నర్‌లో చోటు కల్పించకూడదు. అలాగే వీలైనంత పెందలాడే డిన్నర్ ముగించాలి. నిద్రకు కనీసం రెండు నుంచి మూడు గంటల ముందే రోజులో చివరి భోజనం ముగించాలి.
ఇవి కూడా చదవండి:
టీ20 డబ్ల్యూసీ: విండీస్‌తో పదేళ్ల నాటి పగ.. తీర్చుకునేందుకు సూర్య సేన రెడీ
టీ20 డబ్ల్యూసీ: పాకిస్థాన్ ఓపెనర్ విధ్వంసం.. కోహ్లీ వరల్డ్ రికార్ట్ బ్రేక్