Share News

చెదిరిన గూళ్లను మళ్లీ సృష్టించారు

ABN , Publish Date - Mar 05 , 2026 | 04:31 AM

‘‘సూర్యోదయ వేళ... లేలేత కిరణాలు కొమ్మలను చీల్చుకొని నులివెచ్చగా తాకుతుంటే... ఆ ప్రకృతి రమణీయతకు మనసు పవరశిస్తుంది. కోకిల రాగం ఎత్తుకొంటుంది. పిచ్చుకల కిచకిచలు నన్నే పలుకరించినట్టు ఉంటుంది...

చెదిరిన గూళ్లను మళ్లీ సృష్టించారు

స్ఫూర్తి

‘‘సూర్యోదయ వేళ... లేలేత కిరణాలు కొమ్మలను చీల్చుకొని నులివెచ్చగా తాకుతుంటే... ఆ ప్రకృతి రమణీయతకు మనసు పవరశిస్తుంది. కోకిల రాగం ఎత్తుకొంటుంది. పిచ్చుకల కిచకిచలు నన్నే పలుకరించినట్టు ఉంటుంది. ఆ చెట్టు నుంచి ఈ చెట్టుకు ఎగురుతున్న గోరింకలను చూసినప్పుడు నాకూ రెక్కలు తొడిగిన అనుభూతి కలుగుతుంది. స్వతహాగా ఫొటోగ్రఫీపై ఆసక్తి ఉన్న నేను... వాటిని లెన్స్‌లో బంధించి భద్రపరుచుకోవడం అలవాటుగా మారింది. కానీ... ఆ పరవశం, ఆ ఆహ్లాదం ఒక్కసారిగా మాయమైపోయాయి. చెట్లతో పాటు పక్షుల పలుకరింపులూ కనుమరుగయ్యాయి. అది నన్ను కలవరపాటుకు గురి చేసింది. గుండె బరువెక్కింది. అసోం రాష్ట్రం... గోలాఘాట్‌ జిల్లా... బొంగావ్‌ గ్రామం మాది. సాధారణ మధ్యతరగతి కుటుంబం. ‘బొంగావ్‌ చోలా హైస్కూల్‌’లో ప్రధానోపాధ్యాయురాలిగా పని చేస్తున్నాను.

ఒకటే అలజడి...

నాలుగున్నరేళ్ల కిందట... మా గ్రామంలో హైవే ప్రాజెక్ట్‌ ప్రారంభమైంది. అడ్డం వచ్చిన చెట్లను నరికేశారు. కొన్నింటిని వేరేచోటికి తరలించారు. దాంతో ఎంతో ఆహ్లాదంగా ఉండే మా ప్రాంతం ఎడారిలా మారింది. పక్షులు ఆవాసం కోల్పోయాయి. చిన్నప్పటి నుంచీ నేను ఏ వాతావరణంలో పెరిగానో అది నాకు దూరమైంది. మిషన్ల శబ్దాలు... అవి వదిలే పొగలు... రణగొణ ధ్వనులు లేని ప్రశాంతమైన జీవితంలో అలజడి మొదలైంది. స్వచ్ఛమైన గాలి కలుషితమైంది. చాలా రోజులపాటు ఎంతో ఆలోచించాను... పచ్చదనాన్ని, పక్షులను తిరిగి ఎలా తీసుకురావాలని! ఈ ప్రశ్నలు నన్ను కుదురుగా కూర్చోనివ్వలేదు.

మొక్కలు నాటి...

ఆలోచిస్తూ కూర్చుంటే అడుగు ముందుకు పడదని అర్థమైంది. తొలి ప్రయత్నంగా రహదారి పక్కన కొన్ని మొక్కలు నాటాను. తరువాత అనిపించింది... దీన్నే ఒక ఉద్యమంగా కొనసాగిస్తే బాగుంటుందని. అయితే ఇది నా ఒక్కదానితో అయ్యే పని కాదు. ప్రాజెక్ట్‌ వల్ల వందల చెట్లు నేలకూలాయి. అంతటి పచ్చదనాన్ని మా గ్రామానికి తిరిగి తీసుకురావాలంటే మరిన్ని చేతులు కలవాలి. అందుకు రాముడికి వానర సైన్యంలా మా విద్యార్థులు తోడయ్యారు. తొలుత వారికి దీనిపై అవగాహన కల్పించి, కార్యోన్ముఖులను చేశాను. దాంతో పిల్లలు ఇందులో పాల్గొడానికి ఎంతో ఉత్సాహంగా ముందుకు వచ్చారు. అలా మొత్తం 30 మంది విద్యార్థులతో కలిసి ‘చోరాయ్‌ బంధోబ్‌’ (విహంగాల స్నేహితులు) పేరుతో పక్షుల సంరక్షణ ఉద్యమాన్ని ప్రారంభించాను.


తిరిగొచ్చిన అతిథులు...

అయితే మొక్కలు నాటటంతోనే సరిపోదని తరువాత అర్థమైంది. వెంటనే పక్షులు రావాలంటే వాటికి గూడు కావాలి. అది సహజసిద్ధంగా ఉండాలి. దీని కోసం ఏడాదిపాటు పరిశోధన చేశాను. అందుబాటులో ఉన్న కృత్రిమ గూడులను పరిశీలించాను. సేకరించిన సమాచారం, డిజైన్ల ఆధారంగా టెర్రాకోటతో కొన్ని మోడల్స్‌ తయారు చేశాము. కానీ అవి ఆశించిన ఫలితం ఇవ్వలేదు. ఎందుకంటే ఒక్కో పక్షిజాతి గూడు ఒక్కో ఆకారంలో ఉంటుంది. అలాంటివి ఏర్పాటు చేస్తేనే అవి అనువైనవిగా భావించి ఆవాసం ఏర్పరచుకొంటాయని అర్థమైంది. మరింత లోతైన అధ్యయనం తరువాత టెర్రాకోటతోనే పలు రకాల నెస్ట్స్‌ రూపొందించాము. అలా వందకు పైగా పక్షి గూళ్లను చెట్లపై పెట్టాము. చివరకు మా ప్రయత్నం విజయవంతమైంది. క్రమంగా పక్షులు తిరిగి వచ్చాయి. ఆ దృశ్యాలు చూస్తున్నప్పుడు మా కళ్లల్లో మెరుపులు. మా హృదయాలు ఆనందంతో ఉప్పొంగాయి.


4-Navya.jpg

సంరక్షణ కూడా ముఖ్యమే...

పక్షులు రావడంతోనే మా పని అయిపోలేదు. ఇంకా చెప్పాలంటే అసలు పని అప్పుడే మొదలైంది. కొందరు ఆకతాయిలు రాళ్లతో గూడులను పగులగొట్టారు. మరికొందరు వాటిల్లో తలదాచుకున్న పక్షులను పట్టుకొనే ప్రయత్నం చేశారు. చెట్లు ఇంకా పూర్తిగా పెరగకపోవడంతో అందుబాటు ఎత్తులో గూడులు ఉండటం కూడా దీనికి ఒక కారణం. వారి నుంచి రక్షించడానికి మా బృందం తరచూ పర్యవేక్షించేది. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు, స్థానికులకు అవగాహన కల్పించి, వారిని కూడా ఈ ఉద్యమంలో భాగస్వాములను చేశాం. బృందంలో విద్యార్థుల సంఖ్యను వంద నుంచి 350కి పెంచాం. స్వచ్ఛంద సంస్థల సహకారం తీసుకున్నాం. పరోక్షంగా వేలమంది మేము నాటిన మొక్కలు, వాటిని ఆశ్రయంగా చేసుకున్న పక్షుల సంరక్షణ బాధ్యత తీసుకున్నారు. నా ఈ ప్రయాణంలో ఎన్నో అవార్డులు అందుకున్నా. వైల్డ్‌లైఫ్‌ మీద పుస్తకాలు కూడా రాశాను. ఏదిఏమైనా మా గ్రామంలో ఆ పాత రమణీయ దృశ్యాలు తిరిగి ఆవిష్కృతమయ్యాయి. నా కెమెరా లెన్స్‌కు మళ్లీ పని పడింది. అదే నాకు అన్నిటికన్నా సంతోషాన్నిస్తుంది.’’

రహదారి పనుల కోసం చెట్లను నరికేస్తుంటే... ఆమె మనసు కలవరపడింది. ఆ వృక్షాలను ఆవాసంగా చేసుకున్న పక్షులు కనుమరుగైనప్పుడు... గుండె బరువెక్కింది. మొక్కలు నాటి... కృత్రిమ గూడు అమర్చి... కిలకిలా రావాలను తిరిగి తెచ్చారు హెడ్‌మాస్టర్‌... గిరిమల్లికా సైకియా. తన శిష్య బృందంతో కలిసి దీన్ని ఒక ఉద్యమంలా చేపట్టిన ఆమె ప్రయాణం ఇది.

ఇవి కూడా చదవండి..

రాజీనామా దిశగా నితీశ్ కుమార్.. రాజ్యసభలో అడుగుపెట్టే అవకాశం

మాది పాలు.. తేనె సంబంధం

Updated Date - Mar 05 , 2026 | 04:31 AM