యాపిల్‌తో సరికొత్తగా
ABN , Publish Date - Apr 18 , 2026 | 04:49 AM
యాపిల్స్‌ను మనం ఇష్టంగా తింటూ ఉంటాం. వీటితో కేక్‌లు, స్మూతీలు, మిల్క్‌షేక్‌లు తయారుచేసి పిల్లలకు తినిపిస్తుంటాం. ఇవికాక యాపిల్స్‌ను విభిన్నంగా...
యాపిల్స్‌ను మనం ఇష్టంగా తింటూ ఉంటాం. వీటితో కేక్‌లు, స్మూతీలు, మిల్క్‌షేక్‌లు తయారుచేసి పిల్లలకు తినిపిస్తుంటాం. ఇవికాక యాపిల్స్‌ను విభిన్నంగా ఆస్వాదించాలనుకునేవారి కోసం రకరకాల రుచులు అందుబాటులో ఉంటున్నాయి. వాటిలో సులువుగా తయారుచేసుకోగలిగే కొన్నింటిని మీకోసం అందిస్తున్నాం...
యాపిల్ సినామన్ స్కోన్స్
కావాల్సిన పదార్థాలు
యాపిల్- ఒకటి, వెన్న- చెంచా, దాల్చినచెక్క పొడి- అర చెంచా, గోధుమపిండి- రెండు కప్పులు, చక్కెర పొడి- రెండు చెంచాలు, ఉప్పు- పావు చెంచా, చల్లటి వెన్న- పావు కప్పు, మజ్జిగ- అర కప్పు, పాలు- రెండు చెంచాలు, బ్రౌన్ షుగర్- రెండు చెంచాలు, చాక్లెట్ సిరప్- అరకప్పు
తయారీ విధానం
యాపిల్‌కు తొక్క తీసి చిన్న ముక్కలుగా కోయాలి. స్టవ్‌మీద గిన్నె పెట్టి అందులో వెన్న వేసి కరిగించాలి. ఆపైన యాపిల్ ముక్కలు వేసి అయిదునిమిషాలు వేయించాలి. తరువాత దాల్చిన చెక్క పొడి వేసి కలిపి గిన్నెను స్టవ్ మీద నుంచి దించాలి. వెడల్పాటి గిన్నెలో గోధుమ పిండి, చక్కెర పొడి, ఉప్పు వేసి బాగా కలపాలి. తరువాత చల్లటి వెన్న వేసి చేత్తో కలపాలి. ఆపైన చల్లారిన యాపిల్ మిశ్రమం, మజ్జిగ వేసి గరిటెతో మెత్తగా కలపాలి. దీనిపై కొద్దిగా గోధుమ పిండి చల్లి చేత్తో పెద్ద బిళ్ల మాదిరి చేయాలి. దీన్ని బేకింగ్ షీట్‌మీద ఉంచి పైన బ్రష్‌తో పాలు రాసి బ్రౌన్ షుగర్ చల్లాలి. దీనిపై చాకుతో ఎనిమిది భాగాలుగా సన్నని గీతలు గీయాలి. ఈ బేకింగ్ షీట్‌ను ఓవెన్‌లో ఉంచి 220 డిగ్రీల సెంటీగ్రేడ్ వద్ద 25 నిమిషాలపాటు బేక్ చేయాలి. తరువాత దీన్ని బయటికి తీసి పావుగంటసేపు చల్లారనిచ్చి ముక్కలుగా కోసి పైన చాక్లెట్ సిరప్ చిలకరించి సర్వ్ చేయాలి. ఈ స్కోన్స్‌ను గాలి చొరబడని డబ్బాలో ఉంచితే మూడు రోజులు నిల్వ ఉంటాయి. అదే ఫ్రిజ్‌లో ఉంచితే మూడు నెలల వరకు తాజాగా ఉంటాయి.
యాపిల్ బ్రౌనీ
కావాల్సిన పదార్థాలు
యాపిల్స్- రెండు, కోడిగుడ్లు- రెండు, ఉప్పు- చిటికెడు, మాపుల్ సిరప్- రెండు చెంచాలు, కోకో పౌడర్- రెండు చెంచాలు, చాకో చిప్స్- అర కప్పు
తయారీ విధానం
బ్లెండర్‌లో యాపిల్ ముక్కలు, కోడిగుడ్ల సొనలు, కోకో పౌడర్, మాపుల్ సిరప్, ఉప్పు వేసి మెత్తగా బ్లెండ్ చేయాలి. ఈ మిశ్రమాన్ని బేకింగ్ ట్రేలో పోసి సమంగా సర్ది పైన చాకో చిప్స్ వేయాలి. ఈ ట్రేను ప్రీ హీట్ చేసిన ఓవెన్‌లో ఉంచి అరగంటసేపు బేక్ చేయాలి. తరువాత ట్రేను బయటికి తీసి బ్రౌనీని చల్లారనివ్వాలి. ఆపైన ముక్కలుగా కోసి సర్వ్ చేయాలి.
యాపిల్ బిర్చర్ మ్యూస్లీ
కావాల్సిన పదార్థాలు
యాపిల్స్- రెండు, ఓట్స్- రెండు కప్పులు, చిక్కటి పాలు- ఒకటిన్నర కప్పులు, క్రీమీ యోగర్ట్- ఒక కప్పు, కొబ్బరిపొడి- నాలుగు చెంచాలు, అవిసె గింజలు- రెండు చెంచాలు, దాల్చినచెక్క పొడి- అర చెంచా, వెనీలా ఎసెన్స్- పావు చెంచా, చియా సీడ్స్- రెండు చెంచాలు, మాపుల్ సిరప్- నాలుగు చెంచాలు, గుమ్మడి గింజలు- రెండు చెంచాలు, బాదం పలుకులు- రెండు చెంచాలు, ఎండు ద్రాక్ష- చెంచా, జీడిపప్పు పలుకులు- రెండు చెంచాలు, నారింజ- ఒకటి
తయారీ విధానం
యాపిల్స్‌ను గ్రేటర్ సహాయంతో లావుగా తురిమి పెట్టుకోవాలి. వెడల్పాటి గిన్నెలో ఓట్స్, యాపిల్ తురుం, యోగర్ట్, పాలు, కొబ్బరిపొడి, అవిసె గింజలు, వెనీలా ఎసెన్స్, చియా సీడ్స్, మాపుల్ సిరప్, గుమ్మడి గింజలు, నారింజ రసం వేసి బాగా కలపాలి. దీనిమీద మూతపెట్టి రాత్రంతా ఫ్రిజ్‌లో ఉంచాలి. ఉదయాన్నే గిన్నెను బయటికి తీసి దానిలోని మిశ్రమాన్ని చెంచాతో కలపాలి. ఆపైన గాజు బౌల్స్‌లోకి తీసి పైన కొద్దిగా దాల్చిన చెక్క పొడి చల్లి బాదం పలుకులు, జీడిపప్పు పలుకులు, ఎండు ద్రాక్ష వేసి ఓ పక్కగా యాపిల్ స్లయిసెస్ పెట్టి సర్వ్ చేయాలి.
యాపిల్ వాల్డోర్ఫ్ సలాడ్
కావాల్సిన పదార్థాలు
యాపిల్స్- మూడు, ద్రాక్ష- ఒక కప్పు, సెలెరీ కాడలు- రెండు, వాల్‌నట్స్- అర కప్పు, మయొనైజ్- అర కప్పు, యోగర్ట్- అర కప్పు, నిమ్మరసం- చెంచా, ఉప్పు- అర చెంచా, మిరియల పొడి- చెంచా, చక్కెర పొడి- రెండు చెంచాలు
తయారీ విధానం
ఒక గిన్నెలో మయొనైజ్, యోగర్ట్, నిమ్మరసం, ఉప్పు, మిరియాల పొడి, చక్కెర పొడి వేసి బాగా బీట్ చేయాలి. వెడల్పాటి గిన్నెను తీసుకుని అందులో యాపిల్ ముక్కలు, ద్రాక్ష పండ్ల ముక్కలు, సెలెరీ తరుగు, వాల్‌నట్స్ పలుకులు వేసి బాగా కలపాలి. తరువాత మయొనైజ్, యోగర్ట్‌ల మిశ్రమం వేసి కలపాలి. అంతే యాపిల్ వాల్డోర్ఫ్ సలాడ్ రెడీ..!
ఇవి కూడా చదవండి
ఎయిర్‌పోర్ట్ నాయిస్ జోన్ నిబంధనల్లో మార్పులు: తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
పూర్తిగా తెరుచుకున్న హోర్ముజ్.. దిగ్బంధనం విషయంలో ట్రంప్ ట్విస్ట్..