Share News

ఈ మందులు మానడం మన చేతుల్లో లేదు

ABN , Publish Date - Jul 14 , 2026 | 04:53 AM

మానసిక కుంగుబాటు, ఆందోళనలకు మందులు వాడుకోవడం తప్పనిసరి. అయితే ఉపసంహరణ లక్షణాలు, సమస్య తిరగబెట్టే ముప్పుల నుంచి తప్పించుకోవాలంటే, ఈ మందుల వాడకం...

ఈ మందులు మానడం మన చేతుల్లో లేదు

మానసిక కుంగుబాటు, ఆందోళనలకు మందులు వాడుకోవడం తప్పనిసరి. అయితే ఉపసంహరణ లక్షణాలు, సమస్య తిరగబెట్టే ముప్పుల నుంచి తప్పించుకోవాలంటే, ఈ మందుల వాడకం, ఉపసంహరణ విషయాల్లో వైద్యుల సూచనలను తప్పక పాటించాలి.

మానసిక సమస్యలు, చికిత్సల అవసరం పట్ల అవగాహన సర్వత్రా పెరిగింది. కానీ ఆ మందుల ప్రభావం, పనితీరు, ఉపసంహరణ విధానాల గురించి మనకు తెలిసింది తక్కువే! సాధారణ రుగ్మతలకు వైద్యులు సూచించే మందులను సూచించినంత కాలం వాడుకునే వాళ్లను వేళ్ల మీద లెక్కపెట్టవచ్చు. సమస్య అదుపులోకి వస్తున్నట్టు గ్రహించిన వెంటనే మందుల వాడకాన్ని ఆపేస్తూ ఉంటారు. సమస్య తిరగబెడితే, అవే మందులను కొని వాడేసుకుంటూ ఉంటారు. ఇరుగుపొరుగు సలహాలు, సామాజిక మాధ్యమాల ప్రభావాలకు లోనవుతూ, అదే సమస్యతో బాధపడుతున్న ఇతరుల చికిత్సా విధానాలతో సరిపోల్చుకుంటూ సొంత నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. కానీ డిప్రెషన్‌, యాంగ్జయిటీ డిజార్డర్‌ లాంటి మానసిక సమస్యల చికిత్సల మందుల విషయంలో ఇలాంటి పొరపాట్లు సమస్యను మరింత జటిలం చేస్తాయి.

అపోహలు వీడాలి

సాధారణంగా మానసిక చికిత్సల మందుల పట్ల పలు అపోహలు నెలకొని ఉంటాయి. నిద్ర మాత్రలకు అలవాటు పడినట్టే, ఈ మందులకు కూడా అలవాటు పడిపోతామన్నది అపోహ మాత్రమే! యాంటీ డిప్రెసెంట్స్‌ అలాంటి మాత్రలు కానే కావు. ఈ మందుల్లో రకాలు ఉంటాయి. వీటిలో సాధారణంగా సెలెక్టివ్‌ సెరటోనిన్‌ రిఅ్‌పటేక్‌ ఇన్హిబిటర్స్‌ మందులనే వైద్యులు ఎక్కువగా సూచిస్తూ ఉంటారు. మెదడులో హెచ్చుతగ్గులకు గురయ్యే రసాయనాల మోతాదులను సమం చేయడం ద్వారా కుంగుబాటును అరికట్టే చికిత్స ఇది. ఈ మందులు, సెరటోనిన్‌ హార్మోన్‌ కణాల్లోకి పునఃశోషణ చెందకుండా నిరోధిస్తాయి. దాంతో మెదడులో సెరటోనిన్‌ సరిపడా ఉండిపోయి, లో మూడ్‌, కుంగుబాటు, యాంగ్జయిటీ సమస్యలు తొలగిపోతాయి. వైద్యులు, సదరు మందులు వాడుకోకపోవడం వల్ల కలిగే నష్టంతో పాటు వాడుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలను విశ్లేషించి మందులను సూచిస్తారు. ఈ సూత్రం మానసిక చికిత్సల మందులకూ వర్తిస్తుంది. వైద్యులు, లాభనష్టాల విశ్లేషణ ఆధారంగా మందుల డోసు, కాల పరిమితులను అంచనా వేస్తారనే విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి.


దీర్ఘకాల చికిత్స

అన్ని మందుల్లాగే యాంటీ డిప్రెసెంట్స్‌కు కూడా స్వల్ప దుష్ప్రభావాలు ఉంటాయి. పెయిన్‌ కిల్లర్స్‌తో అసిడిటీ, జీర్ణసంబంధ సమస్యలు తలెత్తినట్టే, ఈ మందులతో 20 నుంచి 30 శాతం మందిలో గ్యాస్ట్రిక్‌ లక్షణాలు ఇబ్బంది పెట్టవచ్చు. కానీ ఈ లక్షణాలన్నీ సాధారణంగా వారం రోజుల్లో సర్దుకుంటాయి. తాజాగా ఇలాంటి దుష్ప్రభావాలు తక్కువగా కలిగి ఉండే యాంటీ డిప్రెసెంట్స్‌ కూడా ఇప్పుడు అందుబాటులోకొచ్చాయి. అయితే మానసిక చికిత్సల మందులను సాధారణ మందుల్లా పరిగణించకూడదు. తీసుకున్న వెంటనే ప్రభావం కనబరిచి, సమస్య సర్దుకుంటుందని ఆశించకూడదు. ఈ మందులు ప్రభావాన్ని కనబరచడానికి కనీసం రెండు వారాల సమయం పడుతుంది. అలాగే ఈ మందులను కనీసం 16 నుంచి 20 వారాల పాటు వాడుకోవాలి. తర్వాత పరిస్థితి మెరుగు పడిందా, లేదా అన్నది వైద్యులు పరిశీలిస్తారు. పరిస్థితి మెరుగుపడినప్పటికీ, మందులు అకస్మాత్తుగా ఆపడానికి వీల్లేదు. కనీసం మూడు నెలల పాటు గమనించి, కుంగుబాటు లక్షణాలు అదుపులోకొచ్చినట్టు నిర్థారించుకున్న తర్వాత, రిలాక్సింగ్‌ వ్యాయామాలు, జీవనశైలి మార్పులను కూడా అనుసరించడం మొదలుపెట్టాలి. అదే సమయంలో మందుల మోతాదు, డోసులను కూడా క్రమేపీ తగ్గించుకుంటూ కొంత కాలానికి పూర్తిగా ఉపసంహరించుకోవచ్చు. ఉపసంహరణ లక్షణాలు తలెత్తకుండా ఉండడం కోసం వైద్యులు ఈ క్రమాన్ని పాటిస్తారు.

ఉపసంహరణ లక్షణాలు ఇవే!

శరీరానికి నిర్దిష్ట న్యూరోకెమికల్స్‌ అలవాటు అయినప్పుడు, వాటిని హఠాత్తుగా తొలగించినప్పుడు కొన్ని లక్షణాలు మొదలవుతాయి. మానసిక రుగ్మతల మందులను హఠాత్తుగా ఆపేయడం వల్ల, సమస్య తిరగబెట్టడంతో పాటు, ఉపసంహరణ లక్షణాలు కూడా వేధిస్తాయి. కాబట్టి వైద్యుల పర్యవేక్షణ లేకుండా ఈ మందులను ఆపేయడం ప్రమాదకరం. ఉపసంహరణ లక్షణాలు ఏవంటే...

  • అశాంతి, ఆందోళన

  • తలనొప్పులు

  • తల తిరుగుడు

  • చమటలు పట్టడం

  • నిద్రలేమి

  • వికారం, వాంతులు


ఒత్తిళ్లు, ఆందోళనలకు దూరంగా...

కుంగుబాటు స్వభావం కలిగిన వ్యక్తులు ఈ సమస్యకు చికిత్స తీసుకుని పూర్తిగా కోలుకున్నప్పటికీ, సమస్య తిరగబెట్టడానికి తోడ్పడే అంశాలకు బహిర్గతం కాకుండా చూసుకోవాలి. వ్యక్తిగత, వృత్తి జీవితంలో ఎలాంటి ఒత్తిళ్లూ లేకుండా చూసుకోవాలి. ఆందోళనను పెంచే అంశాలకు దూరంగా ఉండాలి. మనసును ఆహ్లాదంగా ఉంచుకోవాలి. మనసు ప్రశాంతతను పొందే బ్రీతింగ్‌ వ్యాయామాలు, శరీరాన్ని చురుగ్గా ఉంచే శారీరక వ్యాయామాలు చేస్తూ ఉండాలి.

సైకో థెరపీ కీలకం

పరిస్థితులకు స్పందించే తీరు వ్యక్తుల్లో వేర్వేరుగా ఉంటుంది. కొందరు ఎంతటి క్లిష్ట పరిస్థితి ఎదురైనా అదరక, బెదరక నడుచుకుంటే, ఇంకొందరు స్వల్ప సమస్యకే ఒత్తిడికీ, ఆందోళనకూ లోనవుతూ ఉంటారు. ఇలాంటి వారికి చికిత్సలో భాగంగా సైకో థెరపీ కూడా అవసరమవుతుంది. ఈ థెరపీతో ఆలోచనలను పాజిటివ్‌గా మార్చుకునే విధానాన్ని నేర్చుకోవచ్చు. దాంతో ఒత్తిడి, ఆందోళనలకు లోనయ్యే సందర్భాల్లో ప్రవర్తననూ, స్పందించే విధానాన్నీ నియంత్రించుకోగలుగుతారు. ఇలా మెదడును ట్రెయిన్‌ చేసుకోవడం వల్ల, కుంగుబాటుకు గురయ్యే అవకాశాలు సన్నగిల్లుతాయి. సైకో థెరపీలో కండరాలను రిలాక్స్‌ చేసే వ్యాయామాలు కూడా ఉంటాయి. కాబట్టి సైకో థెరపీ తీసుకోవడం వల్ల, మందులను ఉపసంహరించిన తర్వాత సమస్య తిరగబెట్టే అవకాశాలు తగ్గుతాయి. అలాగే ఉపసంహరణ లక్షణాలు కూడా అదుపులోకొస్తాయి.


ఈ జాగ్రత్తలు తప్పనిసరి

కుంగుబాటు చికిత్స నుంచి పూర్తిగా కోలుకున్నప్పటికీ, సమస్య తిరగబెట్టకుండా ఉండడం కోసం కొన్ని నియమాలను పాటిస్తూ ఉండాలి. అవేంటంటే...

  • పోషకాహారం తీసుకోవాలి

  • నీళ్లు ఎక్కువగా తాగాలి

  • ధూమపానం, మద్యపానం, మాదకద్రవ్యాలు మొదలైన అలవాట్లకు దూరంగా ఉండాలి

  • ఒత్తిడి, ఆందోళనలను పెంచే పరిస్థితులకు దూరంగా ఉండాలి

  • మనసుకు స్వాంతన కలిగే వ్యాయామాలను సాఽధన చేయాలి

రికరెంట్‌ డిప్రెసివ్‌ డిజార్డర్‌

కొందర్లో మందులు వాడినంత కాలం కుంగుబాటు తగ్గిపోయి, మందులు ఆపిన ఒకట్రెండు సంవత్సరాల తర్వాత తిరగబెడుతూ ఉంటుంది. ఇలాంటి రికరెంట్‌ డిప్రెసివ్‌ డిజార్డర్‌ సమస్యలో మొదటి ఎపిసోడ్‌లో వాడుకున్న మందుల ఆధారంగా వైద్యులు చికిత్సను నిర్ణయిస్తారు. ఇలాంటి సమస్య ఉన్నవారు ఏకంగా ఏడాది పాటు కుంగుబాటు మందులు వాడుకోవాల్సి ఉంటుంది.

డాక్టర్‌ జ్యోతిర్మయి

సీనియర్‌ కన్సల్టెంట్‌

సైకియాట్రిస్ట్‌,

మనహ క్లినిక్‌, హైదరాబాద్‌

ఈ వార్తలనూ చదవండి:

హెలికాప్టర్ మెషిన్‌గన్‌ను నేలపై కాల్చే ప్రయత్నం.. చివరికి ఏమైందంటే..

ఇరాన్ హిట్‌లిస్ట్‌లో 13 మంది ప్రపంచ నేతలు.. ట్రంప్, నెతన్యాహు, మెలోనీ..

Updated Date - Jul 14 , 2026 | 04:54 AM