Share News

క్రికెట్‌ మైదానంలో ‘రాయల్‌’ లుక్‌

ABN , Publish Date - Mar 29 , 2026 | 01:58 AM

ఐపీఎల్‌ ఫ్రాంచైజీ ఆర్సీబీ రికార్డు మొత్తానికి అమ్ముడైన వేళ... ఓ పేరు తెగ వినపడుతోంది. అది ఎవరో కాదు... అనన్యా బిర్లా....

క్రికెట్‌ మైదానంలో ‘రాయల్‌’ లుక్‌

న్యూస్‌మేకర్‌

ఐపీఎల్‌ ఫ్రాంచైజీ ఆర్సీబీ రికార్డు మొత్తానికి అమ్ముడైన వేళ... ఓ పేరు తెగ వినపడుతోంది. అది ఎవరో కాదు... అనన్యా బిర్లా. ‘ఆదిత్య బిర్లా గ్రూప్‌’ చైర్మన్‌ కుమార్‌ మంగళం బిర్లా కుమార్తెగానే కాకుండా... తిరుగులేని పారిశ్రామికవేత్తగా తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నారు.

కళాకారిణిగానూ రాణిస్తూ... అభిమానులను సంపాదించుకున్నారు. ఇప్పుడు ఐపీఎల్‌ స్టేడియంలలో మెరిసి... మురిపించడానికి సిద్ధమైన అనన్య అసాధారణ ప్రయాణం ఇది.

‘ఒక వారసురాలిగా వంశం పేరు నిలబెట్టడం ఎంత ముఖ్యమో... నేను నేనుగా ఉండడం కూడా అంతే ముఖ్యం. లేకపోతే మనం చేసే పనికి అర్థం ఉండదు’... ఇది అనన్య మాట. అందుకు తగినట్టే కుటుంబ వ్యాపారాలు చూసుకొంటూ వారసురాలిగానే మిగిలిపోకుండా... అభిరుచికి తగినట్టు సంగీత ప్రపంచంలోనూ అడుగుపెట్టి తనను తాను నిరూపించుకున్నారు. అవకాశం ఉంది కదా అని వ్యాపార రంగంలో... ఒక్కసారిగా అందలం అందుకోవాలని కోరుకోలేదు. ఒక్కో మెట్టు ఎక్కుతూ, అన్నింటా పట్టు సాధించారు. అదే ఆమె విజయానికి బలమైన పునాదులు వేసింది.

మనసుకు నచ్చినట్టు...

కుటుంబం కోసమో, వారసత్వం నిలబెట్టడం కోసమో ఇష్టాయిష్టాలను కాదనుకోవాల్సిన అవసరం లేదనేది అనన్య ఆలోచన. మనసుకు నచ్చింది చేసుకుపోతున్నారు. అదేసమయంలో వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరిస్తూ కటుంబ గౌరవాన్ని కూడా నిలబెడుతున్నారు. 31 ఏళ్ల అనన్య... కుమార్‌ మంగళం పెద్ద కుమార్తె. ఆమె తల్లి నీరజ. బిర్లా వంశంలో ఐదో తరానికి చెందిన అనన్య చిన్నప్పుడే సంగీతంతో ప్రేమలో పడ్డారు. పదకొండేళ్లకు సంతూర్‌ వాయిద్యంపై సాధన మొదలుపెట్టారు. గాత్ర సంగీతంతో పాటు గిటార్‌, పియానో అభ్యసించారు. ముంబై ‘అమెరికన్‌ స్కూల్‌ ఆఫ్‌ బాంబే’లో పాఠశాల విద్యాభ్యాసం పూర్తి చేసి బ్రిటన్‌ వెళ్లి ‘ఆక్స్‌ఫర్డ్‌ విశ్వవిద్యాలయం’ నుంచి ఎకనామిక్స్‌ అండ్‌ మేనేజిమెంట్‌లో డిగ్రీ పట్టా పొందారు.

సంగీతాభిరుచి...

ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీలో చదివే రోజుల్లోనే అనన్య తన సంగీతాభిరుచికి పట్టం కట్టారు. అక్కడి క్లబ్‌లు, పబ్బుల్లో పాటలు పాడేవారు. గిటార్‌ వాయించేవారు. కొంతకాలానికి సొంతంగా లిరిక్స్‌ రాయడం మొదలుపెట్టారు. అమెరికా పాప్‌ గాయకుడు, నిర్మాత జిమ్‌ బీన్జ్‌తో కలిసి తొలి సింగిల్‌ ‘లివిన్‌ ది లైఫ్‌’ రూపొందించారు. ‘పీఎం-ఏఎం రికార్డింగ్స్‌’ ద్వారా భారత్‌కు చెందిన గాయకుల ఆల్బమ్‌ ప్రపంచ వ్యాప్తంగా విడుదల కావడం అదే మొదటిసారి. యూట్యూబ్‌లో సూపర్‌ హిట్‌. మిలియన్ల మంది వీక్షించారు. అదే ఏడాది మరో ఇంగ్లీష్‌ సింగిల్‌ ‘మెంట్‌ టూ బీ’ వదిలారు. ఈ పాట కూడా విశేషంగా ఆకట్టుకుంది. అలా ఇప్పటికి ముప్ఫైకి పైగా ఆల్బమ్స్‌ చేశారు. అజయ్‌దేవ్‌గణ్‌ ‘రుద్ర’ వెబ్‌సిరీ్‌సలో తొలిసారి తెరపై మెరిసిన అనన్య... ‘ష్లోక్‌: ది దేశీ షెర్లాక్‌’లో పూర్తి నిడివి గల పాత్ర పోషించారు. ప్రముఖ పాప్‌ గాయకులతో కలిసి ఎన్నో స్టేజ్‌ షోలు ఇచ్చారు. టోక్యో ఒలింపిక్స్‌ కోసం భారత అథ్లెట్లను ఉత్సాహపరిచేందుకు రూపొందించిన అధికారిక పాట ‘హిందుస్థానీ వే’ను ప్రసిద్ధ సంగీత దర్శకుడు ఏఆర్‌ రహమాన్‌తో కలిసి ఆలపించారు.


44-Navya.jpg

ఘనతలెన్నో...

పాటల ప్రపంచంలో తనను తాను నిరూపించుకున్న అనన్య... 17 ఏళ్లకే పారిశ్రామికవేత్తగా తన ప్రస్థానం ప్రారంభించారు. 2012లో ‘స్వతంత్ర మైక్రోఫిన్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌’ పేరుతో కంపెనీ ప్రారంభించారు. గ్రామీణ మహిళలకు చిన్నమొత్తాల్లో రుణాలు ఇచ్చే సంస్థ అది. దీనికి ఉత్తమ అంకుర సంస్థగా అవార్డు అందుకున్నారు అనన్య. అనతికాలంలో దేశంలోనే రెండో అతిపెద్ద నాన్‌ బ్యాంకింగ్‌ మైక్రోఫైనాన్స్‌ కంపెనీ స్థాయికి తీసుకువెళ్లారు. గతంలో ‘ఫార్చూన్‌ ఇండియా’ ప్రకటించిన ‘40 అండర్‌ 40’లో, ‘ఫోర్బ్స్‌’ మ్యాగజైన్‌ జాబితాలో ఆమె చోటు దక్కించు కున్నారు.

సమాజం కోసం...

మానసిక ఒత్తిడికి లోనయ్యే విద్యార్థుల కోసం బ్రిటన్‌ నుంచి తిరిగి వచ్చాక ‘అనన్యా బిర్లా ఫౌండేషన్‌’ స్థాపించారు. ‘ఐకాయ్‌ అసాయ్‌’ పేరుతో డిజైనింగ్‌ కంపెనీ ఒకటి నెలకొల్పారు. మాతృ సంస్థ బిర్లా గ్రూప్‌కు చెందిన హిందాల్కో, గ్రాసిమ్‌, ఆదిత్య బిర్లా ఫ్యాషన్‌ అండ్‌ రీటైల్‌, మేనేజ్‌మెంట్‌ కార్పొరేషన్‌’లకు బోర్డ్‌ ఆఫ్‌ డైరెక్టర్లలో ఒకరుగా కొనసాగుతున్నారు. తమ కంపెనీలో ఒక ఉద్యోగిగా చేరిన ఆమె... క్రమంగా అన్ని విషయాలనూ ఆకళింపు చేసుకున్నారు. ‘‘మా నాన్నకు ముందే చెప్పాను... ‘మన గ్రూప్‌లో నాకు అధికారిక హోదా ఏదీ వద్దని. ఎందుకంటే ఆ హోదా నన్ను నియంత్రిస్తుంది. అది నాకు సంతోషాన్ని ఇవ్వదు. నేను కష్టపడి పని చేయాలని అనుకొంటున్నాను. నా పని ప్రభావవంతంగా ఉండాలి. అది చూసి నా చుట్టూ ఉన్నవారు స్ఫూర్తి పొందాలి’ అని’’. ఆమె మార్గదర్శకత్వంలోనే ‘ఆదిత్య బిర్లా గ్రూప్‌ డిజిటల్‌’ ఫిన్‌టెక్‌ యాప్‌ రూపుదిద్దుకుంది.

చేసే పనే చెబుతుంది...

‘తొలినాళ్లతో పోలిస్తే ఇప్పుడు నేను ఎంతో ఎదిగాను. నాలో ఆత్మవిశ్వాసం పెరిగింది. అయితే ఇప్పటికీ నేను అదే వ్యక్తిని. నేను ఏంటనేది నేను కాదు... నా పనితనమే చెప్పాలి’’ అంటూ ఓ సందర్భంలో వ్యాఖ్యానించిన అనన్య... ఇప్పుడు సరికొత్త బాధ్యతను భుజానికి ఎత్తుకున్నారు. బిర్లా గ్రూప్‌ ఆధ్వర్యంలోని కన్సార్షియం ఐపీఎల్‌ ఫ్రాంచైజీ ‘రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు’ (ఆర్సీబీ)ని సొంతం చేసుకోవడంలో ఆమె పాత్ర కీలకం. ఆర్సీబీకి చైర్మన్‌గా వ్యవహరించనున్న సోదరుడు ఆర్యమాన్‌ విక్రమ్‌ బిర్లాకు పూర్తి సహకారం అందిస్తానని ప్రకటించారు. అన్నిటికీ మించి... ‘సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌’ సహయజమాని కావ్యా మారన్‌లా... అనన్య కూడా స్టాండ్స్‌లో ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నారు. ఫలితంగా ఐపీఎల్‌కు డబుల్‌ గ్లామర్‌ వచ్చిందంటూ క్రికెట్‌ అభిమానులు అనన్య ఫొటోలు, వీడియోలను సామాజిక మాధ్యమాల్లో షేర్‌ చేస్తున్నారు.


అధికారిక హోదా నన్ను నియంత్రిస్తుంది. అది నాకు సంతోషాన్ని ఇవ్వదు. నేను కష్టపడి పని చేయాలనుకొంటున్నాను. నా పని ప్రభావవంతంగా ఉండాలి. అది చూసి నా చుట్టూ ఉన్నవారు స్ఫూర్తి పొందాలి.

అనన్య

ఇవీ చదవండి:

పీఎస్ఎల్2026: పాకిస్థాన్‌కు మరో ఘోర అవమానం!

గంభీర్ పేరుతో ఉన్న ఏఐ వీడియోలు 36 గంటల్లో తొలగించాలి: ఢిల్లీ హైకోర్టు ఆదేశాలు

Updated Date - Mar 29 , 2026 | 01:58 AM