Share News

అమ్మ తోడుగా... ఆధ్యాత్మిక దీక్ష

ABN , Publish Date - Nov 21 , 2026 | 04:57 AM

ఐఐఎం బెగళూరులో ఎంబీయే... ఫోక్స్‌వాగన్‌లాంటి అంతర్జాతీయ కంపెనీలో ఉద్యోగం... యాభై లక్షల జీతం... దేనికీ లోటు లేని జీవితం...

అమ్మ తోడుగా... ఆధ్యాత్మిక దీక్ష

ఐఐఎం బెగళూరులో ఎంబీయే... ఫోక్స్‌వాగన్‌లాంటి అంతర్జాతీయ కంపెనీలో ఉద్యోగం... యాభై లక్షల జీతం... దేనికీ లోటు లేని జీవితం. ఇవేవీ తృప్తినివ్వలేదు 37 ఏళ్ల అక్షిత జైన్‌కు. అందుకే ఐహిక సుఖాలను పరిత్యజించి... కఠోర నియమాలతో కూడిన ఆధ్యాత్మిక బాటలో అడుగులు వేయాలని సంకల్పించుకున్నారు ఈ సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌. తల్లితో కలిసి జైన సాధ్విగా సరికొత్త ప్రయాణం ప్రారంభించనున్న అక్షిత ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు..?

కలలు అందరూ కంటారు. కానీ వాటిని నెరవరేర్చుకొనేవారు కొందరే ఉంటారు. అలాంటివారిలో ముందుంటారు అక్షిత జైన్‌. హరియాణా రాష్ట్రం గురుగ్రామ్‌కు చెందిన ఈ సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌... ఉన్నత చదువులు చదివి, కెరీర్‌లో బాగా స్థిరపడాలని కోరుకున్నారు. దానికి అనుగుణంగానే బెంగళూరు ఐఐఎంలో ఎంబీయే చదివారు. ప్రపంచంలోనే పేరుమోసిన ఆటోమొబైల్‌ సంస్థలు ఫియట్‌, మెర్సిడెస్‌ బెంజ్‌ లాంటి అంతర్జాతీయ కంపెనీల్లో పని చేశారు. ఇటీవలే ఫోక్స్‌వాగన్‌లో ఉద్యోగానికి రాజీనామా చేశారు. చివరగా అక్కడ ఆమె అందుకున్న జీతం ఏడాదికి అక్షరాలా యాభై లక్షల రూపాయలు. అనుకున్నది అనుకున్నట్టు సాగిపోతోంది అక్షిత జీవితంలో. కానీ ఆమెకు అది సంతృప్తిని ఇవ్వలేదు.


పర్యావరణ హితం...

కంపెనీలో ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (ఏఐ)పై పని చేస్తుండగా అక్షిత ఆలోచనలు ఆధ్యాత్మికత వైపు మళ్లాయి. డేటా సెంటర్ల నిర్మాణం కోసం భూమిని తవ్వడం, దానివల్ల మట్టిలో జీవించే సూక్ష్మజీవులకు కలిగే హాని, పర్యావరణ విధ్వంసం ఆమెను ఆందోళనకు గురి చేసింది. సకల జీవుల పట్ల అహింస అనే జైన సూత్రం ఆధ్యాత్మిక జీవితాన్ని అనుసరించాలనే నిర్ణయానికి దారి తీసింది. అందుకే ఉద్యోగంతోపాటు సంపదను, సకల సౌఖ్యాలనూ ఆమె తృణప్రాయంగా భావించారు. జైన సాధ్విగా సరికొత్త ప్రయాణానికి శ్రీకారం చుట్టేందుకు ముహూర్తం ఖరారు చేసుకున్నారు.

2-navya.jpg

అమ్మ తోడుగా...

విశేషమేమిటంటే... అక్షితతో పాటు ఆమె తల్లి శిరోమణి కూడా సన్యాసం బాట పట్టడం. ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ (ఐఓసీఎల్‌)లో 37 ఏళ్లపాటు సుదీర్ఘ సేవలు అందించిన శిరోమణి... గత ఏడాది అక్టోబర్‌లో చీఫ్‌ మేనేజర్‌గా పదవీ విరమణ పొందారు. భర్త చనిపోవడం, కుటుంబ బాధ్యతలన్నీ నెరవేర్చడంతో ఆమె ఆధ్యాత్మిక కార్యక్రమాలకు సమయం కేటాయిస్తూ వచ్చారు. తరచూ జైన సాధ్విలతో సాంగత్యం 61 ఏళ్ల శిరోమణిని సన్యాస దీక్ష వైపు ఆకర్షించింది. ఇందుకు సన్నాహకంగా కఠోర నియమాలతో కూడిన మతపరమైన ఆచారాలను వంటబట్టించుకున్నారు. ఆమెతోపాటు అక్షిత కూడా అదే మార్గాన్ని ఎన్నుకున్నారు. జైన ఆధ్యాత్మిక గురువు సాధ్వి పూర్ణప్రగ్ఞాశ్రీ బోధలకు ప్రభావితమైన తల్లీకూతుళ్లు ఐహిక సుఖాలను త్యజించాలని నిర్ణయించుకున్నారు. లౌకికమైన బంధాలు, ఆస్తిపాస్తులను త్యజించి, సన్యాస మార్గాన్ని అనుసరించడం ద్వారా జైన మతంలో దీక్ష ఒక ప్రధాన పరివర్తనను సూచిస్తుంది. అక్షిత, శిరోమణి దీక్షా వేడుకలో భాగంగా జోధ్‌పూర్‌లో సంప్రదాయ జైన ఊరేగింపు వర్ఘోడా, వచ్చే ఏడాది ఫిబ్రవరి 25న చెన్నైలో దీక్షా కార్యక్రమం జరుగుతాయి. అదే అమ్మ తోడుగా అక్షిత ఆధ్యాత్మిక యాత్రలో తొలి అడుగు.

ఈ వార్తలనూ చదవండి:

వీసా, మాస్టర్ కార్డ్, జేపీ మోర్గాన్‌పై సైబర్ దాడి.. కస్టమర్ల సమాచారం లీక్!

ఆపరేషన్ మిడ్‌నైట్ హ్యామర్.. 37 గంటల మిషన్‌లో ఏం జరిగిందంటే..

Updated Date - Nov 21 , 2026 | 04:57 AM