ఎడారిలో ‘బహుళ’ వికాసం
ABN , Publish Date - Jun 25 , 2026 | 02:02 AM
‘‘జీవితాల్లో మార్పు తేవాలంటే స్థిరమైన ఆర్థిక పునాది వేయడమే మార్గం’’ అంటారు ఆకృతి శ్రీవాత్సవ. డాక్యుమెంటరీ మేకర్‌గా థార్ ఎడారిలో అడుగుపెట్టిన ఆమె అక్కడి ప్రజల జీవితంలో...
స్ఫూర్తి
‘‘జీవితాల్లో మార్పు తేవాలంటే స్థిరమైన ఆర్థిక పునాది వేయడమే మార్గం’’ అంటారు ఆకృతి శ్రీవాత్సవ. డాక్యుమెంటరీ మేకర్‌గా థార్ ఎడారిలో అడుగుపెట్టిన ఆమె అక్కడి ప్రజల జీవితంలో భాగమైపోయారు. స్థానిక ఉత్పత్తులను మార్కెట్‌తో అనుసంధానించి నాలుగు వేలకు పైగాకుటుంబాల్లో వెలుగు నింపారు. శ్రమపడినా ఫలితం దక్కని మహిళలకు సైతం కొత్తదారి చూపించారు. ఆ ప్రయాణం గురించి ఆమె మాటల్లోనే...
‘‘తెల్లారుజామున నాలుగున్నరకే సూర్యోదయం... దాదాపు రాత్రి తొమ్మిది తరువాతే సూర్యాస్తమయం. ఇదేకాదు... రాజస్థాన్‌లోని థార్ ఎడారి ప్రాంతంలో... దేశంలోని ఇతర ప్రాంతాలకన్నా ఇలాంటి వ్యత్యాసాలు చాలానే కనిపిస్తాయి. ప్రపంచంలోనే అత్యంత జనసాంద్రత కలిగిన ఎడారుల్లో థార్ ఒకటి. అక్కడ ప్రజల జీవన విధానం కూడా చాలా విలక్షణంగా ఉంటుంది. నేను విడిది చేసిన బజ్జూ సమితి పరిధిలోని గ్రామాల్లో సుమారు ఎనిమిది వేల కుటుంబాలు ఉన్నాయి. అవన్నీ ద్వంద్వ గృహ వ్యవ్యవ్థను అనుసరిస్తాయి. అంటే... ఏడాదిలో ఆరు నెలలు ఆ కుటుంబాలు గ్రామాల్లో ఉంటాయి. వ్యవసాయ సీజన్‌లో... తమ పంట భూముల్లో నిర్మించుకున్న థానీలు అనే ఇళ్ళలో నివసిస్తాయి. ఈ విధానం వల్ల వారికి ప్రభుత్వ సేవలను, పథకాలను ఏడాదిలో చాలాకాలం పాటు వారు పొందలేకపోతున్నారు. ఒంటెలు, పశువుల పెంపకం, వ్యవసాయం వారి ప్రధాన జీవనాధారం. పచ్చిక బయళ్ళను వెతుక్కుంటూ చాలా దూరాలకు కాలినడకన వెళుతూ ఉంటారు. ఆర్థికంగా వెనుకబాటుతో పాటు మూఢ నమ్మకాలు కూడా ఎక్కువే. సరిగ్గా తొమ్మిదేళ్ళ క్రితం... 2017 జూన్‌లో ఆ ప్రాంతాన్ని తొలిసారి సందర్శించిన నాకు ఎన్నో కఠిన వాస్తవాలు స్వాగతం పలికాయి.
వారం రోజులు ఉందామని వెళ్లి...
ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌లో పుట్టి పెరిగాను. ఢిల్లీలోని ఐపి యూనివర్సిటీలో... జర్నలిజంలో గ్రాడ్యుయేషన్ చేశాను. ఫిల్మ్‌మేకర్ కావాలనేది నా కోరిక. లండన్‌కు చెందిన ఒక స్వచ్ఛంద సంస్థ కోసం, ఢిల్లీలోని ఒక మీడియా సంస్థ కోసం పర్యావరణం మీద డాక్యుమెంటరీలు తీసేదాన్ని. ఇండియా-పాకిస్తాన్ సరిహద్దులో... రాజస్థాన్‌లో ఉన్న బజ్జూ గ్రామానికి వలసవచ్చి స్థిరపడిన కుటుంబాల గురించి విన్నాను. వాళ్ళ మీద డాక్యుమెంటరీ తీయాలనుకున్నాను. కానీ అక్కడికి వెళ్ళిన తరువాత... ఆ ప్రాంతం గురించి, ప్రజల గురించి మిగతా ప్రపంచానికి చెప్పాల్సింది ఎంతో ఉందనిపించింది. వారం రోజుల్లో ఢిల్లీ తిరిగి వెళ్దామనుకున్న నేను... నాలుగు నెలలకు పైగా అక్కడే ఉండిపోయాను. క్రమంగా స్థానిక పరిస్థితులు అర్థమయ్యాయి. నీటి సమస్య, పౌర సేవలు అందకపోవడం, మహిళలకు విద్య, హక్కులు లేకపోవడం, ప్రధానంగా ప్రజలకు స్థిరమైన జీవనోపాధి లేకపోవడం... ఇలా ఎన్నో సమస్యలు నా దృష్టికి వచ్చాయి. సానుభూతి తెలపడమో, తాత్కాలిక సాయం అందించడమో కాదు... వారి జీవితాల్లో నిలకడైన మార్పు తీసుకురావడమే ఈ సమస్యలకు పరిష్కారమని అనుకున్నాను. అదే సమయంలో వారికే ప్రత్యేకమైన సాంస్కృతిక వారసత్వానికి, కళా నైపుణ్యాలకు భంగం కలుగకూడదు. ఇలా... నా ఆలోచనలకు ఆచరణాత్మకమైన రూపం రావడానికి అయిదేళ్ళు పట్టింది. 2022లో... ‘బహుళ నేచురల్స్’’ అనే సంస్థను ఏర్పాటు చేసి, నా కార్యాచరణకు శ్రీకారం చుట్టాను.
నిర్వహణ స్థానికులదే...
థార్ ఎడారి ప్రాంత ప్రజలు ప్రధానంగా పశువుల పెంపకందారులు. వారి ఉత్పత్తుల్లో ఒంటె పాలు, గొప్ప పోషక విలువలు కలిగిన రాఠీ ఆవు పాలు, నల్ల గోధుమలు లాంటి ధాన్యాలు ప్రధానమైనవి. వారి జీవన స్థితిగతులు మెరుగుపడాలంటే... మార్కెటింగ్ కావాలి. దాని కోసం బికనీర్ కేంద్రంగా కార్యకలాపాలు ఆరంభించాను. కొందరు మిత్రుల సాయం తీసుకున్నాను. ఎడారి గ్రామాల నుంచి సేకరించిన తాజా పాలు, వాటితో తయారు చేసిన పెరుగు, ఛీజ్, పన్నీరు, అలాగే కోల్డ్ ప్రెస్ట్ ఆయిల్, నల్ల గోధుమ పిండి లాంటి వాటిని బికనీర్, ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఆర్డర్లపై... డోర్ డెలివరీ చేశాం. వాటికి మంచి ఆదరణ లభించడంతో... బికనీర్, జైపూర్ చుట్టు పక్కల గ్రామాల నుంచి ఉత్పత్తులు సేకరించడం మొదలుపెట్టాం. ఆన్‌లైన్ ద్వారా దేశవ్యాప్తంగా విక్రయాలను విస్తరించాం. ప్రస్తుతం నాలుగు వేలకు పైగా కుటుంబాలకు దీనిద్వారా ఆర్థిక భరోసా లభిస్తోంది. మా సంస్థలో వివిధ దశల్లో పని చేసే వారందరూ చుట్టుపక్కల గ్రామాలకు చెందిన యువతే. ఒక విధంగా నిర్వహణ బాధ్యతలన్నీ స్థానికులవేనని చెప్పొచ్చు.
వివక్షను తొలగించదానికి...
నాణ్యమైన విత్తనాలు, పశువుల దాణా అందించడం, ఇళ్ళకు స్వచ్ఛమైన ఇందనం కోసం బయో గ్యాస్ యూనిట్ల ఏర్పాటు లాంటి పలు కార్యక్రమాలను మా సంస్థ చేపడుతోంది. అలాగే నేను గుర్తించిన మరో సమస్య... మహిళలపై వివక్ష. వారికి బ్యాంకు ఖాతాలు లేకపోవడంతో... నగదు రూపంలో అందుకున్న డబ్బును పురుషులు లాక్కోవడం తరచుగా జరిగేది. ఈ నేపథ్యంలో... మహిళలతో బ్యాంకు ఖాతాలు తెరిపించి, వారి శ్రమ ఫలాన్ని నేరుగా వాటిలో జమ చేయడం, పశువుల కొనుగోలు కోసం రుణాలు, వివిధ అంశాలపై మహిళలకు అవగాహన, వారి పిల్లల చదువు కోసం సహాయం తదితరాలతో వారు ఆర్థికంగానూ, సామాజికంగాను సాధికారత సాధించడానికి, వారిపట్ల వివక్ష పోవడానికి దోహదం చేస్తున్నాం. మరిన్ని ప్రాంతాలకు మా కార్యక్రమాలను విస్తరించడానికి ప్రణాళికలు వేస్తున్నాను. గత ఆరేళ్ళలో... అక్కడి ప్రజల జీవితాల్లో వచ్చిన మార్పునకు నేను ఎంతో కొంత దోహదపడినందుకు చాలా సంతోషంగా ఉంది. ఇంతకు మించిన సంతృప్తి ఇంకేముంటుంది?’’
ఇవి కూడా చదవండి
సంపులో పడి చిన్నారి మృతి.. తట్టుకోలేక నాయనమ్మ కన్నుమూత!
టీమిండియాతోనే పయనం.. కానీ మ్యాచ్‌కు ముందు వైభవ్‌కు ప్రత్యేక రూమ్!