ప్రేమను మేలుకొలుపుదాం
ABN , Publish Date - Feb 20 , 2026 | 05:17 AM
భౌతిక ప్రపంచంలో మనం సాధారణంగా ‘ప్రేమ’ పేర్కొనే భావనను... భగవద్గీత, ఇతర వైదిక శాస్త్రాల్లో ‘కామం’గా పరిగణిస్తారు. వాటి ప్రకారం నిజమైన ప్రేమకు, భౌతికమైన కామానికి మధ్య స్పష్టమైన తేడా ఉంది. ఆత్మేంద్రియ...
హరేకృష్ణ
భౌతిక ప్రపంచంలో మనం సాధారణంగా ‘ప్రేమ’ పేర్కొనే భావనను... భగవద్గీత, ఇతర వైదిక శాస్త్రాల్లో ‘కామం’గా పరిగణిస్తారు. వాటి ప్రకారం నిజమైన ప్రేమకు, భౌతికమైన కామానికి మధ్య స్పష్టమైన తేడా ఉంది. ఆత్మేంద్రియ ప్రీతి వాంఛ- తారే బలి కామ... సొంత ఇంద్రియాలను తృప్తి పరచుకోవాలనే కోరికను ‘కామం’ అంటారు. భౌతిక ప్రపంచంలోని సంబంధాలు తరచుగా వ్యక్తిగత ఆనందం లేదా ఇంద్రియ తృప్తి మీద ఆధారపడి ఉంటాయి. ఎప్పుడైతే ఆ తృప్తి ఆగిపోతుందో ఆ సంబంధం లేదా ప్రేమ... కోపంగా (క్రోధంగా), ద్వేషంగా మారుతుంది. కృష్ణేంద్రియ ప్రీతి ఇచ్ఛా ధరే ప్రేమ నామ... భగవంతుణ్ణి (శ్రీకృష్ణుణ్ణి) సంతోషపెట్టాలనే కోరికను ‘ప్రేమ’ అంటారు. అది నిస్వార్థమైనది. ఇక ‘రూపాంతరం చెందడం’ అనే విషయానికి వస్తే... ప్రతి జీవునికి భగవంతునిపట్ల సహజమైన, నిత్యమైన ప్రేమ ఉంటుంది. కానీ జీవుడు భౌతిక సృష్టితో లేదా రజోగుణంతో సంపర్కంలోకి వచ్చినప్పుడు ఆ ప్రేమ... కామంగా రూపాంతరం చెందుతుంది. కాబట్టి సొంత సుఖాన్ని ఆశించే భావనను శాస్త్రాలు ప్రేమగా కాకుండా కామంగా గుర్తిస్తాయి.
శ్రీ చైతన్య మహాప్రభువుల బోధ ప్రకారం... ప్రతి జీవుని హృదయంలో కృష్ణునిపట్ల ప్రేమ నిద్రాణమై ఉంటుంది. నిత్యం భక్తి సాధన ద్వారా... ముఖ్యంగా శ్రవణం (వినడం) కీర్తనం (జపించడం) ద్వారా ఆ ప్రేమ మేలుకొంటుంది. భగవద్గీత, శ్రీమద్భాగవత శ్లోకాల ద్వారా శ్రీ చైతన్య మహాప్రభువు దీన్ని సమర్థించిన వివరణ ఈ విధంగా ఉంది.
హృదయ శుద్ధీకరణ: సాధన భక్తిలో మొదటి దశ శ్రవణం, కీర్తనం. శ్రీమద్భాగవతం ప్రకారం ఎవరైతే శ్రీకృష్ణుని కథలు వింటారో... వారి హృదయంలో పరమాత్మగా ఉన్న శ్రీకృష్ణుడు ఒక శ్రేయోభిలాషిగా వ్యవహరిస్తాడు. ఆ భక్తుని హృదయంలో భౌతిక భోగాల పట్ల ఉన్న కోరికలను, అమంగళకరమైన విషయాలను భగవంతుడే స్వయంగా ప్రక్షాళన చేస్తాడు. ఈ విధంగా... నిత్యం భగవంతుడి గురించి వినడం, కీర్తించడం ద్వారా భక్తుని హృదయం పునీతమవుతుంది.
బుద్ధియోగం: భక్తుడు నిత్యం ప్రేమపూర్వకంగా సేవలో నిమగ్నమైనప్పుడు... భగవంతుడు అతణ్ణి ప్రత్యేకంగా అనుగ్రహిస్తాడు. ఎవరైతే తనను నిరంతర ప్రేమతో తనను ఆరాధిస్తారో... వారికి తనను చేరుకొనే మార్గాన్ని బుద్ధిని (బుద్ధియోగం) ప్రసాదిస్తానని ‘భగవద్గీత’లో భగవంతుడు చెప్పాడు. జ్ఞానం ద్వారా భక్తుడు భగవంతుడి తత్త్వాన్ని అర్థం చేసుకొని ఆయనను సమీపిస్తాడు. దీనికోసం శ్రీ చైతన్య మహాప్రభువులు బోధించిన యుగధర్మం... నిత్యం శ్రీహరి నామ సంకీర్తన. ప్రధానంగా ‘హరే కృష్ణ’ మంత్రాన్ని రోజూ జపించడం.
శ్రీసత్యగౌర చంద్రదాస ప్రభూజీ
అధ్యక్షుడు, హరే కృష్ణ మూవ్‌మెంట్,
హైదరాబాద్, 9396956984
శ్రీ చైతన్య మహాప్రభువు, రూప గోస్వామి వివరించిన ప్రకారం భక్తి ఈ క్రింది దశలలో అభివృద్ధి చెందుతుంది.
శ్రద్ధ: మొదటిది భగవంతుడి మీద నమ్మకం. సాధుసంగం: భక్తులతో సాంగత్యం. భజన క్రియ: గురువు ఆదేశానుసారం భక్తిని ఆచరించడం (దీన్నే సాధన భక్తి అంటారు) అనర్థ నివృత్తి: హృదయంలోని కల్మషాలు తొలగిపోవడం. నిష్ఠ: భక్తిలో స్థిరత్వం. రుచి: భగవంతుడి సేవ పట్ల ఆసక్తి. ఆసక్తి: భగవంతుడి పట్ల గాఢమైన అనురక్తి. భావ: ప్రేమకు పూర్వ దశ. ప్రేమ: అంతిమంగా, ఇది పరిపూర్ణమైన కృష్ణ ప్రేమగా (ప్రేమభక్తి) మారుతుంది. కాబట్టి సాధన భక్తి ద్వారా హృదయం శుద్ధి కావడం, భగవంతుని అనుగ్రహంతో సరైన బుద్ధిని పొందడం ద్వారా భక్తుడు శ్రీకృష్ణునితో తన సంబంధాన్ని పునరుద్ధరించుకుంటాడు, ప్రేమభక్తిని పొందుతాడు.
ఇవి కూడా చదవండి..
బిల్‌గేట్స్ AI సమ్మిట్ ప్రసంగం: ఉత్కంఠకు తెర.. స్పష్టతనిచ్చిన ఫౌండేషన్!
సర్వజన క్షేమానికి పరిష్కారాలు కనుగొందాం