Share News

కష్టంలోనే సుఖం

ABN , Publish Date - Feb 06 , 2026 | 03:44 AM

మంచి జీవితం గురించి, ఉన్నతమైన జీవితం గురించి అందరూ కలలు కంటారు. వాటిని నెరవేర్చుకోవడానికి ఒక్కొక్కరిదీ ఒక్కొక్క దారి. కొందరు ఎదుటి వ్యక్తిని నమ్మించి, మభ్యపెట్టి సంపాదించడానికి పాట్లు పడతారు.

కష్టంలోనే సుఖం

సందేశం

మంచి జీవితం గురించి, ఉన్నతమైన జీవితం గురించి అందరూ కలలు కంటారు. వాటిని నెరవేర్చుకోవడానికి ఒక్కొక్కరిదీ ఒక్కొక్క దారి. కొందరు ఎదుటి వ్యక్తిని నమ్మించి, మభ్యపెట్టి సంపాదించడానికి పాట్లు పడతారు. లాభం కోసం వ్యాపారాల్లో మోసం చేస్తారు. ‘ఎలాగైనా సంపాదించాలి’ అనుకొనేవారికి ఎన్నో అడ్డదారులు ఉన్నాయి. కానీ అవన్నీ చివరికి మనశ్శాంతిని దూరం చేస్తాయి. కలలను నెరవేర్చుకోవడానికి కష్టపడాలి. దానికోసం దృఢసంకల్పం ఉండాలి. వేర్లు భూమిలో గట్టిగా పాతుకుపోయిన వృక్షానికి ఉన్నంత దృఢత్వాన్ని కలిగి ఉండాలి. ‘‘సంపాదన విషయంలో ధర్మాన్ని అనుసరించేవారే నా సంప్రదాయాన్ని పాటించేవారు. తనవల్ల చెడు జరగకుండా, ప్రజలను కాపాడే వ్యక్తి స్వర్గంలో తప్పకుండా ప్రవేశిస్తాడు’’ అని మహా ప్రవక్త మహమ్మద్‌ చెప్పారు. ‘‘కష్టపడి, ధర్మమైన సంపాదనతో చేసే భోజనమే ఉత్తమమైన భోజనం’’ అని స్పష్టం చేశారు. మహనీయుడైన ప్రవక్త దావూద్‌ స్వయంగా శ్రమించి తన ఆహారాన్ని సంపాదించుకొనేవారు.

ఒక సందర్భంలో ఒక పేద సహచరుడు దైవప్రవక్త దగ్గరకు సాయం కోసం వచ్చాడు. అప్పుడు ఆయన తన దగ్గర ఉన్న వస్తువులను వేలం వేసి ఒక గొడ్డలి కొన్నారు. ఆ గొడ్డలికి కర్రను తన స్వహస్తాలతో తయారు చేసి, ఆ వ్యక్తికి ఇచ్చారు. అడవికి వెళ్ళి, కట్టెలు కొట్టి, అమ్ముకొని జీవించాలని సలహా ఇచ్చారు. ఆ తరువాత కొన్నాళ్ళకు... మహాప్రవక్త దగ్గరకు ఆ వ్యక్తి మళ్ళీ వచ్చి, తన ఆర్థిక పరిస్థితి మెరుగుపడిందని చెప్పాడు. ఆ మాటలకు దైవప్రవక్త ఎంతో సంతోషించారు. ‘‘ఇతరుల సహాయం కోరడం కన్నా కష్టపడి సంపాదించడం గొప్ప పని’’ అని చెప్పారు. ‘‘మరణించి, పరలోకగతుడైన ప్రతి వ్యక్తికి తన ఇహలోక జీవితం పట్ల పశ్చాత్తాపం, ఆందోళన తప్పకుండా కలుగుతాయి. మరణించిన వ్యక్తి మంచివాడు, సచ్ఛరితుడు అయితే... మరిన్ని మంచి కార్యాలు చేసి ఇంకా ఎక్కువ పుణ్యం సంపాదించుకోలేకపోయానని పశ్చాత్తాపపడతాడు. చెడ్డవాడయితే... దుష్కార్యాలకు, పాపాలకు ఎందుకు దూరంగా ఉండలేకపోయానని పశ్చాత్తాపపడతాడు’’ అని ఆయన వెల్లడించారు. కష్టంలోనే సుఖం ఉంది. ‘‘ఇహలోక సంపాదన చేస్తూనే పరలోక సంపద కోసం కష్టపడే వ్యక్తులు సదాచార పరాయణులు, వారు మరణానంతరం ఉత్తమ స్థానాన్ని పొందుతారు’’ అని ఇస్లాం ధర్మం చెబుతోంది.

మహమ్మద్‌ వహీదుద్దీన్‌

ఈ వార్తలు కూడా చదవండి

తిరుమల లడ్డూ వ్యవహారంలో ఏక సభ్య కమిషన్ ఏర్పాటు: సీఎం

ఏపీ హైకోర్టును ఆశ్రయించిన మాజీ మంత్రి అంబటి రాంబాబు

Updated Date - Feb 06 , 2026 | 03:44 AM