Share News

హెయిర్‌ చైన్స్‌తో స్టయిల్‌గా...

ABN , Publish Date - May 25 , 2026 | 05:11 AM

ఒకప్పుడు మహిళల అలంకరణలో ప్రధాన పాత్ర పోషించిన హెయిర్‌ చైన్స్‌ మళ్లీ ఇప్పుడు ట్రెండింగ్‌లోకి వచ్చేశాయి. చక్కని హెయిర్‌ స్టయిల్‌కు అందమైన గొలుసులను..

హెయిర్‌ చైన్స్‌తో స్టయిల్‌గా...

ఒకప్పుడు మహిళల అలంకరణలో ప్రధాన పాత్ర పోషించిన హెయిర్‌ చైన్స్‌ మళ్లీ ఇప్పుడు ట్రెండింగ్‌లోకి వచ్చేశాయి. చక్కని హెయిర్‌ స్టయిల్‌కు అందమైన గొలుసులను జతచేస్తే రాయల్‌ లుక్‌ రావడం ఖాయం. అందుకే అప్పటి సంప్రదాయ డిజైన్లకు ఒకింత ఆధునికతను జోడించి రూపొందించిన సరికొత్త హెయిర్‌ చైన్లను మహిళలు అమితంగా ఇష్టపడుతున్నారు. నేటి ఫ్యాషన్‌ సరళికి తగ్గట్టు డిజైన్‌ చేసిన మల్టీ లేయర్స్‌, ఫ్లోరల్‌, బోహో, ఎత్నిక్‌ మోడల్‌ చైన్లకు డిమాండ్‌ అధికంగా ఉంటోంది. ప్రస్తుతం ట్రెండింగ్‌లో ఉన్న హెయిర్‌ చైన్స్‌పై ఓ లుక్కేద్దామా...

ఎత్నిక్‌ చైన్స్‌ : బంగారం లేదా వెండితో తయారుచేసిన సన్నని గొలుసులకు ముత్యాలు, కుందనాలు, పోల్కీలు జతచేసి ఈ ఎత్నిక్‌ చైన్స్‌ను డిజైన్‌ చేస్తారు. ఇవి ఎలాంటి హెయిర్‌ స్టయిల్‌కైనా బాగా సూటవుతాయి. వీటిని చిన్న క్లిప్‌లు, స్నాప్‌ పిన్‌లు లేదంటే బాబీ పిన్‌లతో శిరోజాలకు జోడిస్తారు. లెహంగాలు, పట్టుచీరలు, లంగా-ఓణీలపైన గ్రాండ్‌ లుక్‌నిస్తాయి.

కాన్‌ చైన్స్‌ : ఒక కొనను చెవి పోగుకు మరో కొనను తల వెనక భాగానికి మధ్యలో యూ పిన్‌తో జోడిస్తారు. ఇలా రెండువైపులా కూర్చి ఈ రెంటి మధ్యలో అందమైన పెండెంట్‌ను అమరుస్తారు. ఈ కాన్‌ చైన్స్‌.. విరబోసిన శిరోజాల మీద అందంగా కనిపిస్తాయి. చీరలు, సల్వార్‌ సూట్స్‌, లాంగ్‌ ఫ్రాక్స్‌ మీద చక్కగా నప్పుతాయి.


బోహో చైన్స్‌ : వీటిని అయిదారు వరుసల్లో డిజైన్‌ చేస్తారు. గొలుసులకు మధ్యమధ్యలో రైన్‌ స్టోన్స్‌, మిర్రర్స్‌, క్రిస్టల్స్‌, ఛార్మ్స్‌, మువ్వలు, గంటలు, రంగు రంగుల పూసలు, పూల ఆకృతులు జతచేస్తారు. వీటివల్ల హెయిర్‌ స్టయిల్‌ గ్రేస్‌ఫుల్‌గా కనిపిస్తుంది. వీటిని బన్‌ స్టయిల్స్‌ కింద వేలాడదీసినా, పోనీకి చుట్టినా, విరబోసిన శిరోజాలమీద అమర్చినా, జడతోపాటు అల్లినా చూడడానికి బాగుంటాయి. అన్ని రకాల సంప్రదాయ దుస్తులపై ఇవి అందంగా నప్పుతాయి.

క్లిప్‌ చైన్స్‌ : రాళ్లు, పూసలు, కుందనాలు పొదిగిన క్లిప్‌కు సన్నని గొలుసులు వేలాడేలా అమరుస్తారు. ఈ గొలుసులకు గంటలు, ముత్యాలు, నెమళ్లు, హంసలను పెండెంట్‌లా అమరుస్తారు. ఈ క్లిప్‌ చైన్స్‌... కర్లీ హెయిర్‌ ఉన్నవారికి బాగా నప్పుతాయి. తలలో క్లిప్‌ పెట్టుకుంటే చాలు చైన్స్‌ వాటంతట అవే శిరోజాలపై అమరి గ్రాండ్‌ లుక్‌నిస్తాయి. చీరలు, లెహంగాలకు ఇవి బాగుంటాయి.

ఇవి కూడా చదవండి:

ఐపీఎల్‌లో అరుదైన ఫీట్.. కోహ్లీ, సెహ్వాగ్ సరసన శ్రేయస్ అయ్యర్

ఐపీఎల్ చరిత్రలోనే తొలిసారి.. పంజాబ్ ఓపెనర్ అరుదైన ఘనత

Updated Date - May 25 , 2026 | 05:11 AM