కొలువు తీరిన జ్ఞాన ప్రదాతలు
ABN , Publish Date - Jul 24 , 2026 | 05:17 AM
అజ్ఞానమనే చీకట్లను తొలగించి, జ్ఞానాన్ని ప్రసాదించే వారిని ‘గురువు’ అని (గు శబ్దస్త్వంధకారః రు శబ్దస్తన్నిరోధకః... అంధకార నిరోధిత్వాత్ గురురిత్యభిధీయతే) పిలుస్తారు...
తెలుసుకుందాం
29న గురుపౌర్ణమి
అజ్ఞానమనే చీకట్లను తొలగించి, జ్ఞానాన్ని ప్రసాదించే వారిని ‘గురువు’ అని (గు శబ్దస్త్వంధకారః రు శబ్దస్తన్నిరోధకః... అంధకార నిరోధిత్వాత్ గురురిత్యభిధీయతే) పిలుస్తారు. గురువు ద్వారానే పరమాత్మను చేరడం సులభ సాధ్యమవుతుందని మన ధర్మం చెబుతోంది. సనాతన సంప్రదాయంలో శ్రీరాముణ్ణి పరమాత్మగా, సీతమ్మ తల్లిని జీవాత్మగా... వారిద్దరికీ వియోగం కలిగినప్పుడు వారిని కలిపిన హనుమంతుణ్ణి గురువుగా భావిస్తారు. అటువంటి మరికొన్ని గురు స్వరూపాల గురించి, వారి దివ్య సన్నిధుల గురించి తెలుసుకుందాం.
వేద వ్యాసుని గుహ: వ్యాస భగవానుడు అవతరించిన ఆషాఢ పౌర్ణమి రోజును ‘వ్యాస పౌర్ణమి’, ‘గురు పౌర్ణమి’గా వ్యవహరిస్తారు.. ఈ రోజున శిష్యులు తమ గురువులను వ్యాసునికి ప్రతిరూపంగా భావించి, పూజలు, సత్కారాలు చేస్తారు.వేదరాశిని భవిష్యత్తులో జనులు ఆకళింపు చేసుకొని, అధ్యయనం చేయడానికి వీలుగా నాలుగు భాగాలుగా విభజించినవాడు వ్యాసుడు. అందుకే ఆయనకు ‘వేద వ్యాసుడు’ అనే పేరు వచ్చింది. వేదాలలోని అర్థాలను గ్రహించే క్రమంలో మహర్షులకు వచ్చిన సందేహాలను నివృత్తి చేస్తూ ‘బ్రహ్మ సూత్రాలు’ అనే మార్గదర్శకాలను ఆయన నిర్దేశించాడు. అలాగే అష్టాదశ పురాణాలను అనుగ్రహించాడు. వేదాలకు అర్థాలను చెప్పిన ఆయనను సాక్షాత్తూ విష్ణుస్వరూపంగా భావిస్తారు. బదరీ క్షేత్ర సమీపంలోని మనా అనే గ్రామంలో వ్యాస గుహ ఉంది. వ్యాసుడు మహాభారతాన్ని చెబుతుంటే వినాయకుడు లిఖించిన చోటు ఇదేనని ప్రతీతి. ఈ గుహ రాతి పొరలు పుస్తక పుటల మాదిరిగా ఒకదానిపై ఒకటి పేర్చినట్టు ఉంటాయి.
గీతాచార్యుని ఆలయం: కురుక్షేత్ర సంగ్రామంలో అర్జునుడికి రథసారథిగా వ్యవహరించి, భగవద్గీతను బోధించిన శ్రీకృష్ణుడు గీతాచార్యునిగా, జగదాచార్యునిగా ప్రసిద్ధి చెందాడు. ప్రపంచంలో శ్రీకృష్ణుడికి ఎన్ని ఆలయాలు ఉన్నా... చెన్నైలోని ట్రిప్లికేన్ ప్రాంతంలోని పార్థసారథి ఆలయం ప్రత్యేకమైనది. అక్కడ స్వామివారు ఆజానుబాహుడిగా, చక్కటి మీసాలతో, నిలుచున్న భంగిమలో కొలువై ఉంటాడు. పక్కనే రుక్మిణి, బలరాముడు, ప్రద్యుమ్నుడు, అనిరుద్ధులతో కూడిన పరివారం ఉంటుంది.
శ్రీ ఆది శంకరుల సన్నిధి: అద్వైత సిద్ధాంతకర్త అయిన శ్రీఆది శంకరాచార్యుల జన్మస్థలం కేరళలోని కాలడి. ఆయన అవతారాన్ని చాలించిన కేదారనాథ క్షేత్రంలో ఇటీవల కృష్ణశిలా (నల్లరాతి)మూర్తిని ప్రతిష్ఠించారు. బదరికాశ్రమం, కంచి కామాక్షి ఆలయంతో సహా అనేక క్షేత్రాలలో శ్రీశంకరుల సన్నిధులు ఉన్నాయి. అలాగే మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఓంకారేశ్వర క్షేత్రంలో 108 అడుగుల ఎత్తైన ఆదిశంకరుల విగ్రహాన్ని ‘స్టాట్యూ ఆఫ్ వన్‌నె్‌స’ పేరిట నెలకొల్పింది. చతురామ్నాయ పీఠాలలో ఒకటైన శృంగేరిలో అద్వైత ప్రచారం కోసం ఒక కొండపై 25 అడుగుల ఎత్తయిన శ్రీ శంకరుల శిలామూర్తిని ప్రతిష్ఠించారు.
శ్రీ మధ్వాచార్యుల ఆలయ, బృందావనాలు: పరమాత్మ స్వతంత్రుడని, జీవులు అస్వతంత్రులని ద్వైత సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన శ్రీమధ్వాచార్యులకు కర్ణాటకలోని ఉడుపి, ఆ సమీపంలోని పాజక క్షేత్రంలో ఆలయం, బృందావనం ఉన్నాయి. ఉడుపిలోని అష్టమఠాలలో కూడా ఆయన ఆరాధన విశేషంగా జరుగుతుంది.
శ్రీ నమ్మళ్వార్: తిరునల్వేలి సమీపంలోని ఆళ్వార్ తిరునగరిలో శ్రీ నమ్మాళ్వార్‌కు ప్రత్యేక సన్నిధి ధ్వజస్తంభంతో పాటు ఉంటుంది. అక్కడ ప్రాచీనమైన చింతచెట్టు కింద (తిరుప్పుళి) శ్రీనమ్మాళ్వార్ దివ్య ప్రబంధ బోధలు చేశారు. కాబట్టి ఆ వృక్షాన్ని కూడా భక్తులు పూజిస్తారు.
శ్రీ రామానుజుల దివ్యమూర్తి: ‘భగవంతుడి ముందు జనులందరూ సమానమే’ అనే సమతావాదాన్ని చాటి, విశిష్టాద్వైత సిద్ధాంతాన్ని ప్రతిపాదించినవారు శ్రీ రామానుజులు. ఆయన తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామికి శంఖుచక్రాలను సమర్పించారు. శ్రీవారి ఆలయంలోని హుండీ ఎదురుగా జ్ఞానముద్రలో కొలువై నిత్యం పూజలు అందుకుంటున్నారు. రామానుజుల జన్మస్థలమైన శ్రీపెరంబదూరులోని శ్రీఆదికేశవ పెరుమాళ్ ఆలయంలో ఆయన సన్నిధి ఉంది.
శ్రీరామానుజులు అవతార సమాప్తి చేశాక... ఆయన చరమదేహంగా భావించే విగ్రహం... శ్రీరంగం దేవాలయంలో ప్రత్యేకంగా నిర్మించిన విశాలమైన ఉపాలయంలో కొలువై ఆరాధనలు పొందుతోంది. మెల్కోటే, సింహాచలం తదితర క్షేత్రాల్లో, అలాగే అన్ని దివ్యదేశాల్లో రామానుజుల సన్నిధి ఉంటుంది. ఇటీవల హైదరాబాద్
సమీపంలో సమతామూర్తి బృహత్ విగ్రహం నిర్మితమయింది. అందులో 120 కిలోల స్వర్ణంతో చేసిన రామానుజుల బంగారు విగ్రహం కూడా ఉంది.
శ్రీరాఘవేంద్రుల బృందావనం:
ద్వైత సంప్రదాయానికి చెందిన శ్రీరాఘవేంద్రస్వామివారి బృందావనం కర్నూలు జిల్లా మంత్రాలయంలో ఉంది. మహిమాన్వితుడైన ఆ స్వామి నేటికీ ఆ బృందావనం నుంచే తమను అనుగ్రహిస్తారని భక్తుల విశ్వాసం.
శ్రీమణవాళ మహాముని:
శ్రీవేంకటేశ్వర సుప్రభాతాన్ని రచించిన శ్రీ ప్రతివాది భయంకర అణ్ణంగరాచార్యులకు ఆచార్యులు శ్రీమణవాళ మహాముని. ఆయనను రామానుజుల రెండో అవతారంగా భావిస్తారు. ‘పెరియజీయర్’ అని పిలుస్తారు. శ్రీపెరంబదూరులోని శ్రీరామానుజుల సన్నిధి పక్కనే ఆయనకు ప్రత్యేక ఆలయం ఉంది.
శ్రీ వేదాంత దేశికులు:
విశిష్టాద్వైత సిద్ధాంతాన్ని వ్యాప్తి చేయడానికి అనేక గ్రంథాలు రచించిన శ్రీవేదాంత దేశికుల సన్నిధులు వారి జన్మస్థానమైన తూప్పుల్, శ్రీరంగం, తిరుపతిలోని గోవిందరాజస్వామి ఆలయం, అలాగే అనేక దివ్యదేశాలలో ఉన్నాయి. ఒక విశేష ఆలయం తిరువహేంద్రపురం అనే దివ్యదేశంలో ఉంది.
శ్రీ రమణమహర్షి:
తమిళనాడులోని అరుణాచలం (తిరువణ్ణామలై)లో శ్రీరమణ మహర్షి తపస్సు చేసిన విరూపాక్ష గుహ, ఆయన దివ్య సమాధి ఉన్నాయి. భక్తులు అక్కడ మౌనంగా ధ్యానం చేస్తారు.
డి.యన్.వి. ప్రసాద్ స్థపతి
9440525788
ఈ వార్తలనూ చదవండి:
ఇన్‌స్టా స్టోరీలో 'కాక్రోచ్' పోస్ట్.. వివాదంలో ఆర్ఏఎఫ్ ఆఫీసర్ సోనియా!
ప్రధాని నివాసం ముందు కాంగ్రెస్ నిరసన.. వాంగ్‌చుక్ భార్య విమర్శలు