అజ్ఞానమే అసలైన విపత్తు
ABN , Publish Date - Nov 20 , 2026 | 03:13 AM
సిక్కు మత స్థాపకుడైన గురునానక్ అపారమైన కరుణాగుణం కలిగిన వ్యక్తి. కాలినడకన గ్రామాలు తిరుగుతూ, ప్రజలకు తన బోధనలను ఆయన అందిస్తూ...
సద్గురువాణి
24న గురునానక్ జయంతి
సిక్కు మత స్థాపకుడైన గురునానక్ అపారమైన కరుణాగుణం కలిగిన వ్యక్తి. కాలినడకన గ్రామాలు తిరుగుతూ, ప్రజలకు తన బోధనలను ఆయన అందిస్తూ ఉండేవారు. ఒక ప్రాంతంలో బాగా సంపన్నుడైన వ్యక్తి ఇంట్లో కొన్నాళ్ళపాటు ఆయన అతిథిగా ఉన్నారు. ఒక రోజు ఆయన ఆ ఇంటి నుంచి బయలుదేరుతూ... ఆ సంపన్నుడికి ఒక సూది ఇచ్చారు. ‘‘దీన్ని నీ దగ్గర భద్రంగా ఉంచు. కొన్నాళ్ళ తరువాత మళ్ళీ నిన్ను కలిసినప్పుడు... దీన్ని నాకు తిరిగి ఇవ్వు’’ అని అన్నారు.
నానక్ వెళ్ళిపోయిన తరువాత ఆ సంఘటన గురించి తన భార్యకు ఆ సంపన్నుడు చెప్పాడు. వెంటనే ఆమె అతని మీద మండిపడుతూ ‘‘గురువుగారి దగ్గర్నుంచి సూది ఎందుకు తీసుకున్నావు? ఆయన వృద్ధుడు. ఆయన మరణించినట్టయితే... సూదిని తిరిగి ఇవ్వలేవు. అప్పుడు ఏం చేస్తావు? ఆయనకు నువ్వు ఏదైనా ఇస్తే మంచిది కానీ అలాంటి వ్యక్తి దగ్గర ఏదీ తీసుకోకూడదు. ఆ రుణం శాశ్వతంగా మిగిలిపోతుంది. ఆ రుణం తీర్చుకోవడానికి నువ్వు మరో వెయ్యి జన్మలెత్తాలి. వెంటనే బయలుదేరు. ఆయనను వెతికి, సూదిని తిరిగి ఇవ్వు’’ అని చెప్పింది.
దాంతో గురునానక్‌ను వెతుకుతూ అతను బయలుదేరాడు. రెండు నెలల తరువాత కష్టపడి ఆయన ఉన్న చోటుకు చేరుకోగలిగాడు. ‘‘గురూజీ! ఈ సూదిని నా దగ్గర భద్రపరచలేను. మీరు వయోధికులు. ఒకవేళ మీరు మరణిస్తే... ఈ సూదిని స్వర్గానికి తీసుకొచ్చి మీకు తిరిగి ఇవ్వలేను. దానివల్ల మీకు శాశ్వతంగా రుణపడిపోతాను’’ అన్నాడు. అప్పుడు గురునానక్ ‘‘అయితే ఈ సూదిని స్వర్గానికి తీసుకువెళ్ళలేవనే సంగతి నీకు తెలుసు, అవునా?’’ అని అడిగారు. ‘‘అవును’’ అని అతను బదులిచ్చాడు. ‘‘ఈ చిన్న సూదినే తీసుకువెళ్ళలేనప్పుడు... ఇంత సంపదను, ఇన్ని ఆస్తులను, ఇన్ని వస్తువులను ఎందుకు కూడబెట్టుకుంటున్నావు? వాటిని నువ్వు స్వర్గానికి మోసుకుపోలేవు కదా!’’ అని అడిగారు నానక్. ధనార్జనే ప్రధానంగా భావించే ఆ సంపన్నుడికి జ్ఞానోదయమయింది. గురునానక్ కాళ్ళమీద పడ్డాడు. ఆయన ఆశీస్సులు తీసుకొని ఇంటికి తిరిగి వెళ్ళాడు. తన కుటుంబానికి అవసరమైన వాటిని మాత్రమే ఉంచుకొని... మిగిలిన అన్నిటినీ పేదల శ్రేయస్సు కోసం వినియోగించాడు.
ఈ ప్రపంచంలో స్థలం పరిమితం, వనరులు పరిమితం. వ్యక్తులు కావచ్చు, సమాజాలు కావచ్చు, దేశాలు కావచ్చు... అంతులేకుండా సంపదను పోగుచేసుకోవడం మొదలుపెడితే, దానివల్ల వారికి, ఇతరులకు ఘర్షణలు, బాధలే మిగులుతాయి. ‘నాకు ఇంత మాత్రమే అవసరం. మిగిలిన వాటిని అందరి శ్రేయస్సు కోసం వినియోగిస్తాను’ అని ప్రతి మనిషి తనలోతాను నిర్ణయించుకోవాలి. అలా భావించని మనిషి తనకు, ఈ ప్రపంచానికి ఒక విపత్తుగా మారుతాడు. భూకంపాలు, అగ్నిపర్వత విస్పోటనాలు, సునామీలు మాత్రమే ఈ భూమికి విపత్తులు కావు. మానవుల అజ్ఞానం అసలైన, నిజమైన విపత్తు. దాని నివారణకు జ్ఞానోదయమే ఏకైక పరిష్కారం. పైన చెప్పిన గురునానక్ కథలోని అంతరార్థం అదే.
సద్గురు జగ్గీవాసుదేవ్
ఈ వార్తలనూ చదవండి:
చెన్నైలో భారీగా హెరాయిన్ పట్టివేత.. రూ.710 కోట్ల విలువైన డ్రగ్స్ స్వాధీనం..
నైలాన్ తాడుతో చిన్నారి చేతులు కట్టేసి కొట్టిన టీచర్.. తమిళనాడు స్కూల్లో ఘటన