Share News

సమకాలీన కథలు కొత్తవాళ్లతోనే తీయాలి

ABN , Publish Date - Feb 15 , 2026 | 01:24 AM

తెలుగు చలనచిత్ర పరిశ్రమలో భారీ పౌరాణిక, చారిత్రక చిత్రాలకు కేరాఫ్‌ అడ్ర్‌సగా నిలిచిన దర్శకుడు గుణశేఖర్‌. ఆయన తాజాగా తెరకెక్కించిన ‘యుఫోరియా’ చిత్రం మంచి ఆదరణ...

సమకాలీన కథలు  కొత్తవాళ్లతోనే తీయాలి

తెలుగు చలనచిత్ర పరిశ్రమలో భారీ పౌరాణిక, చారిత్రక చిత్రాలకు కేరాఫ్‌ అడ్ర్‌సగా నిలిచిన దర్శకుడు గుణశేఖర్‌. ఆయన తాజాగా తెరకెక్కించిన ‘యుఫోరియా’ చిత్రం మంచి ఆదరణ పొందుతూ విమర్శకుల ప్రశంసలు అందుకుంటోంది. ఈ సందర్భంగా సినిమా విజయం, నేటి సామాజిక అంశాలపై గుణశేఖర్‌ పంచుకున్న విశేషాలు మీ కోసం.

‘యుఫోరియా’కు వస్తున్న స్పందన చూస్తుంటే మీకెలా అనిపిస్తోంది?

నిజానికి చాలా సంతోషంగా ఉంది. టెన్షన్‌ కంటే కూడా ఒకరకమైన సంతృప్తి ఉంది. ముఖ్యంగా జర్నలిస్ట్‌ మిత్రులు, విమర్శకులు సినిమాను అభినందించడం గొప్ప విషయం. ‘ది హిందూ’, ‘టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా’ వంటి ప్రతిష్ఠాత్మక పత్రికలు 3.5 నుంచి 4 వరకు రేటింగ్స్‌ ఇవ్వడం మా టీం అందరికీ ఎంతో ప్రోత్సాహాన్ని ఇచ్చింది. మేము ఏదో ఒక సినిమా తీయాలని కాకుండా నేటి వాస్తవాలను సమాజానికి చూపించాలనే ఉద్దేశంతో ఈ అడుగువేశాం.

ఈ సినిమాలో అందరూ కొత్తవారే. భారీ వ్యయంతో ఇంత రిస్క్‌ చేయడానికి కారణం?

అవును, ఇందులో అందరూ నూతన నటులే. కానీ, కథాబలంపై ఉన్న నమ్మకంతో ఎక్కడా రాజీపడకుండా నిర్మించాం. సినిమా చూసిన ప్రేక్షకులు ‘ఇది చాలా మంచి సినిమా, దీనిని అందరిలోకి తీసుకెళ్లాలి’ అని ఒక బాధ్యతగా చెబుతున్నారు. ఆ ‘వర్డ్‌ ఆఫ్‌ మౌత్‌’ ద్వారానే సినిమా ఇంకా ముందుకు వెళ్తుందని నా నమ్మకం.

పౌరాణికాలు, చారిత్రక చిత్రాలు తీసిన మీరు హఠాత్తుగా ఈ ‘రా అండ్‌ రియలిస్టిక్‌’ శైలిలోకి మారడానికి ప్రేరణ ఏది?

‘ఒక్కడు’, ‘చూడాలని ఉంది’ వంటి కమర్షియల్‌ సినిమాలు.. ‘రుద్రమదేవి’, ‘శాకుంతలం’ వంటి పౌరాణికాలు తీశాను. అయితే, కాలంతోపాటు మారుతున్న సామాజిక పరిస్థితులు నన్ను ఆలోచింపజేశాయి. ఇప్పుడు టెక్నాలజీ వల్ల యువతపై పడుతున్న ప్రభావం, చుట్టూ జరుగుతున్న నేరాలు చూసినప్పుడు వాస్తవ ప్రపంచాన్ని కళ్లకు కట్టినట్టు చూపించాలనే ఉద్దేశంతో ఈ సినిమా చేశాను.


ప్రస్తుతం సినిమాల్లో హింస మితిమీరుతోందన్న చర్చ జరుగుతోంది. దీనిపై మీ అభిప్రాయం?

గతంలో చిన్న హింస చూసినా భయపడేవారు. కానీ ఇప్పుడు రక్తపాతం పెరిగిపోయింది. సెన్సార్‌బోర్డు ‘ఎ’ సర్టిఫికెట్‌ ఇస్తున్నప్పటికీ, అది చిన్న పిల్లల మనస్తత్వాలపై ఎలాంటి ప్రభావం చూపుతుందో అన్నది ఆందోళనకరం. ఈ సినిమాలో హింస ఉన్నా, అది ఒక సందేశం కోసం ఉద్దేశించినదే తప్ప కేవలం రక్తాన్ని చూపడం కోసం కాదు.

టెక్నాలజీ వల్ల పిల్లలు వేరే ప్రపంచంలో జీవిస్తున్నారని అన్నారు. దీనిపై తల్లిదండ్రులకు మీరిచ్చే సూచన ఏంటి?

నేటి పిల్లలు స్మార్ట్‌ఫోన్ల ద్వారా ఒక సమాంతర ప్రపంచంలో జీవిస్తున్నారు. ఇంట్లో మన కళ్ల ముందే ఉన్నా వాళ్లు ఇంటర్నెట్‌లో ఏం చూస్తున్నారు, ఎవరితో తిరుగుతున్నారు అనేది తల్లిదండ్రులకు తెలియడం లేదు. ఫోన్ల వల్ల పిల్లలు ఒంటరితనానికి గురికావడం, లేదా హింసాత్మకంగా మారుతున్నారు. అందుకే తల్లిదండ్రులు అలర్ట్‌గా ఉండి పిల్లలకు తగిన సమయం కేటాయించాలి.

77-Navya.jpg

మీరు వీఎ్‌ఫఎక్స్‌లో నిపుణులు, కానీ ఈ సినిమాకు అసలు వీఎ్‌ఫఎక్స్‌ వాడలేదని విన్నాం. అది నిజమేనా?

అవును, యుఫోరియాలో జీరో వీఎ్‌ఫఎక్స్‌, జీరో సీజీ. వాస్తవిక సినిమాలు తీసేటప్పుడు కంప్యూటర్‌ గ్రాఫిక్స్‌ అవసరం లేదు. ఈ రోజుల్లో కొందరు మేకర్స్‌ టెక్నాలజీని మిస్‌యూజ్‌ చేస్తున్నారు. స్టార్‌ హీరోల డేట్స్‌ లేనప్పుడు గ్రీన్‌మ్యాట్‌ వేసి షూటింగ్‌ పూర్తిచేయడం అబ్యూజ్‌ చేయడమే అవుతుంది. ప్రేక్షకులు ఇప్పుడు చాలా అడ్వాన్స్‌ అయ్యారు. మేకర్స్‌ చేసే ప్రతి పొరపాటును ఇట్టే కనిపెట్టేస్తున్నారు.

మీరు స్టార్స్‌తో పనిచేశారు, కొత్తవాళ్లతో చేశారు. వీరితో పనిచేయడంలో ఉండే కంఫర్ట్‌, ఇబ్బందులు ఏంటి?

అది కథను బట్టి ఉంటుంది. మనం ఎప్పుడైతే కథను కొత్తవాళ్లతో చెప్పాలనుకుంటున్నామో, అది కొత్తవాళ్లతోనే చెప్పాలి. అప్పుడు ఉండే సౌలభ్యం బాగుంటుంది. వాళ్లు మనకి డేట్స్‌తో సంబంధం లేకుండా హ్యాండీగా ఉంటారు. అదే సమయంలో స్టార్స్‌తో తీయాలనుకున్నప్పుడు మన ప్రతిభ చూపించాల్సి ఉంటుంది. ఎందుకంటే స్టార్‌ మీద కొన్ని కోట్ల రూపాయల వ్యాపారం జరుగుతున్నప్పుడు అతడి డేట్స్‌ చాలా విలువైనవి. అందుకే స్టార్‌తో సినిమా తీసినప్పుడు ఆ వర్క్‌ ఎన్విరాన్మెంట్‌కి అడాప్ట్‌ కావడం చాలా అవసరం. ఈ రెండింటినీ పోల్చి చూడలేం. దేనికదే ఒక ప్రత్యేకమైన అనుభవం.

ఇప్పుడు ప్రేక్షకుల అభిరుచి మారుతోంది కదా, దీనిపై మీ అభిప్రాయం?

అవును, ఒకప్పుడు ఇతర భాషల సినిమాలను కేవలం అవార్డుల సినిమాలని దూరంగా పెట్టేవారు. కానీ ఇప్పుడు ఓటీటీల వల్ల తెలుగు ప్రేక్షకులు మలయాళం, తమిళ సినిమాల్లోని సబ్‌ కల్చర్‌ కాన్సెప్టులను కూడా ఆదరిస్తున్నారు. ఆ ధైర్యంతోనే నేను ఏ మూస పద్ధతిని అనుసరించకుండా ఈ సినిమా తీశాను.


ప్రొడక్షన్‌ టైం పెరగడం వల్ల బడ్జెట్‌ కూడా పెరుగుతోంది కదా, దీనిపై మీ అభిప్రాయం?

ప్రొడక్షన్‌ టైం పెరగడంలో సమస్య లేదు, ఎందుకంటే క్వాలిటీ డిమాండ్‌ పెరుగుతోంది. కానీ మేకింగ్‌కు ఎక్కువ బడ్జెట్‌ పెట్టుకోవాలి తప్ప, కేవలం ఆర్టిస్టుల రెమ్యునరేషన్లకే సింహభాగం వెళ్లిపోతే క్వాలిటీ రాదు. మార్కెట్‌ ఉన్న హీరో ఎక్కువ తీసుకోవడంలో తప్పులేదు, కానీ ఆ భారం మేకింగ్‌ మీద పడకుండా చూసుకోవాలి.

షూటింగ్‌ సమయంలో వచ్చే ఒత్తిడిని ఎలా ఎదుర్కొంటారు?

నేను పనిని ఇష్టపడి చేస్తాను కాబట్టి నాకు స్ట్రెస్‌ ఉండదు. ఏదైనా అనుకున్నట్టు జరగకపోయినా నేను అసహనానికి గురికాను. దానిని ఒక సవాలుగా తీసుకుని ఇంకా మెరుగ్గా చేయడానికి ప్రయత్నిస్తాను. సెట్స్‌లో కూడా చాలా ప్రశాంతంగా ఉంటాను.

సీవీఎల్‌ఎన్‌ ప్రసాద్‌

ఈ చిత్ర నిర్మాణంలో మీ కుటుంబం పాత్ర?

నాకు నా కుటుంబమే అతిపెద్ద అండ. ఈ సినిమాకు నా భార్య, కుమార్తెలు నీలిమ, యుక్త నిర్మాతలుగా వ్యవహరించారు. నా చిన్నమ్మాయి యుక్త అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా కూడా పని చేసింది. మేమంతా ఒక క్రియేటివ్‌ ఫీల్డ్‌లో ఉండటంవల్ల ఒకరికొకరం ఎమోషనల్‌ సపోర్ట్‌ ఇచ్చుకుంటాం.

మీ కెరీర్‌లో అత్యంత కష్టం అనిపించిన సినిమా?

బాల రామాయణం. సున్నా నుంచి 12 ఏళ్ల వయసున్న పిల్లలతో ఆ సినిమా తీయడం అప్పట్లో నాకు పెద్ద సవాలు. ఆ సినిమాకు జాతీయ అవార్డు రావడం చాలా గర్వంగా అనిపించింది. ఆ తర్వాత అంతటి కష్టమైన పని నేను మరే సినిమా విషయంలోనూ ఫేస్‌ చేయలేదు.

ఇవి కూడా చదవండి...

ఎక్స్‌అఫీషియో సభ్యుల ఓటు హక్కుపై ఎస్‌ఈసీ క్లారిటీ

మున్సిపల్ ఎన్నికల ఫలితాలు.. ఎగ్జిట్ పోల్స్ ఎంతవరకు రీచ్ అయ్యాయంటే.?

Read Latest Telangana News And Telugu News

Updated Date - Feb 15 , 2026 | 01:24 AM