Share News

గ్రీకు వేదాంతి జీనో

ABN , Publish Date - Nov 20 , 2026 | 03:09 AM

ఒకప్పుడు గ్రీసు దేశంలో గొప్ప వేదాంతి ఉండేవాడు. అతని పేరు జీనో. తర్కంలో మంచి నైపుణ్యం ఉన్న తత్త్వవేత్త అయిన జీనో తన మాటల నైపుణ్యంతో...

గ్రీకు వేదాంతి జీనో

ఒకప్పుడు గ్రీసు దేశంలో గొప్ప వేదాంతి ఉండేవాడు. అతని పేరు జీనో. తర్కంలో మంచి నైపుణ్యం ఉన్న తత్త్వవేత్త అయిన జీనో తన మాటల నైపుణ్యంతో, వాదనా బలంతో ఎదుటివారిని ఒప్పించేవాడు. ‘జీవితం నిరర్థకమైనది, దుఃఖభూయిష్టమైనది, విలువలేనిది. కాబట్టి అజ్ఞానులు, మూర్ఖులు మాత్రమే తమ జీవితాలను కొనసాగిస్తూ ఉంటారు. కష్టాలను అనుభవిస్తూ చింతిస్తూ, దుఃఖాన్ని భరిస్తూ ఈ లోకాన్ని అంటిపెట్టుకొని ఉంటారు. తెలివైనవారు, జ్ఞానవంతులు ఈ లోకం నుంచి విముక్తి కోసం తపిస్తారు. లౌకిక కష్టాల నుంచి, బంధాల నుంచి విడివడి స్వేచ్ఛ పొందుతారు’ అనేది అతని ముఖ్య సిద్ధాంతం. ఆయన రచనలు, ఉపన్యాసాల్లో ప్రధానాంశం ఇదే.

ఎంతోమంది యువకులు జీనోకు శిష్యులయ్యారు. ఆయన బోధలు విని, అదే సత్యమని భావించి ఆత్మహత్యలకు పాల్పడేవారు. ఇలా ఎన్నో వందల మంది మరణించారు. ఆత్మహత్యలు మూర్ఖత్వమని, మానవులు జీవిస్తూ, తమ జీవితాలను సద్వినియోగం చేసుకోవాలనీ చెప్పవలసిన తత్త్వవేత్త ఇలా ఆత్మహత్యలకు పురిగొల్పడం దారుణమని జీనో జీవించి ఉన్నప్పుడు, మరణించిన తరువాత తీవ్రమైన విమర్శలు వచ్చాయి. అన్నిటికన్నా విచిత్రమేమిటంటే... విచక్షణారహితంగా ఎందరో బలవన్మరణం పొందడానికి కారణమైన జీనో... తొంభయ్యేళ్ళకి పైగా జీవించాడు.

అతను మరణశయ్య మీద ఉన్నప్పుడు ఒక శిష్యుడు ‘‘మహాశయా! ఎందరో యువతీ యువకులను ఆత్మహత్యలు చేసుకోవడానికి ప్రోత్సహించిన మీరు ఇప్పటివరకూ, తొంభై ఏళ్ళు వచ్చేదాకా ఎందుకు జీవించారు?’’ అని అడిగాడు. అప్పుడు జీనో... ‘‘ఏం చేయమంటారు నాయనా! లోకుల పట్ల నాకున్న కరుణ అలాంటిది. నేను జీవించి ఉండకపోతే... జీవితం అత్యంత బాధాకరమైనది అనే నిష్ఠుర సత్యాన్ని ఈ లోకులకు ఎవరు బోధిస్తారు? దాని నుంచి బయటపడాలని ఎవరు సలహా ఇస్తారు? అందుకే బతకడం ఎంత కష్టమైనా సరే... దాన్ని భరిస్తూ ఇప్పటివరకూ జీవించాను’’ అని సమాధానమిచ్చాడు.


జీనో బోధల గురించి ఓషో వ్యాఖ్యానిస్తూ ‘‘ప్రతి జీవితం విలువైనదే. సమాజానికి ఉపయోగపడని జీవితం నిరర్థకమనీ, అది కొనసాగించవలసినది కాదనీ జీనో ఉద్దేశం కావచ్చు. అయితే స్వార్థరాహిత్యం, ప్రేమ, కరుణ లాంటి విలువలతో నింపితే... ప్రతి జీవితం దివ్యమైనదే అవుతుంది’’ అన్నారు. తత్త్వవేత్తలు జీవితాలను సన్మార్గంలో నడిపించడానికి పాటుపడాలి కానీ నిరాశలో కుంగిపోవడానికి, ప్రాణాలు తీసుకోవడానికి ప్రేరేపించకూడదన్నది ఓషో మాటల్లోని ప్రధానాంశం. కాగా... దుర్బల మనస్కులను ఆత్మహత్యలకు ప్రేరేపించిన వాడిగా హెజెసియాస్‌ అనే తత్త్వవేత్త కూడా ప్రసిద్ధి చెందాడు.

రాచమడుగు శ్రీనివాసులు

ఈ వార్తలనూ చదవండి:

చెన్నైలో భారీగా హెరాయిన్ పట్టివేత.. రూ.710 కోట్ల విలువైన డ్రగ్స్ స్వాధీనం..

నైలాన్ తాడుతో చిన్నారి చేతులు కట్టేసి కొట్టిన టీచర్.. తమిళనాడు స్కూల్లో ఘటన

Updated Date - Nov 20 , 2026 | 03:30 AM