Share News

కాపాడే కొంగుబంగారాలు

ABN , Publish Date - Jul 31 , 2026 | 01:08 AM

భగవత్‌ తత్త్వం సృష్టి అంతటా వ్యాపించి ఉంది. మానవుడు ఆ తత్త్వాన్ని పలు రీతులలో ఆరాధించి, అభీష్టాలు నెరవేర్చుకుంటున్నాడు. పూర్వం జనావాసాలు ఏర్పడిన కాలం నుంచి...

కాపాడే కొంగుబంగారాలు

భగవత్‌ తత్త్వం సృష్టి అంతటా వ్యాపించి ఉంది. మానవుడు ఆ తత్త్వాన్ని పలు రీతులలో ఆరాధించి, అభీష్టాలు నెరవేర్చుకుంటున్నాడు. పూర్వం జనావాసాలు ఏర్పడిన కాలం నుంచి... వాటిని రక్షించుకోవడం కోసం గ్రామ సరిహద్దులలో దేవతలను ప్రతిష్ఠించుకొనేవారు. ఏదైనా చెయ్యాలనుకున్నప్పుడు ఇంటి పెద్దకు మొదటగా విన్నవించి అనుమతి తీసుకున్నట్టే... గ్రామాల్లో జరిగే అన్ని కార్యక్రమాలకు, ఇళ్ళలో జరిగే శుభకార్యాలకు, ముఖ్యమైన పనులకు గ్రామదేవత అనుమతి తీసుకొనేవారు. ఇది ఎన్నో తరాలుగా కొనసాగుతున్న సంప్రదాయం. కాగా గ్రామ దేవతల ప్రతిమల పరిమాణం ఇంత ఉండాలి, ఇలాగే ఉండాలి అనే ప్రత్యేకమైన ఆగమ శాస్త్ర నియమాలు లేవు.

పూర్వపు రోజుల్లో నలుచదరంగానో, త్రికోణంగానో ఉండే శిలను లేదా నిలువుగా ఉండి పైన అర్ధవృత్తాకారంలో ఉన్న శిలను కానీ, లేదా ఏదైనా వృక్షాన్ని కాని (సాధారణంగా వేపచెట్టును లేదా రావిచెట్టును), ఆ వృక్షం మొదట్లో ప్రతిష్ఠించిన శిలను కాని గ్రామదేవతగా ఆరాధిస్తూ ఉండేవారు. గ్రామ దేవత ఆరాధన ఎంత ముఖ్యమైనదంటే... కుటుంబ కార్యక్రమాలు మాత్రమే కాదు, గ్రామంలో నూతనంగా ఏదైనా ఆలయాన్ని నిర్మించి, ప్రాణప్రతిష్ఠా కార్యక్రమాలను నిర్వహించాలన్నా ముందుగా సంబంధిత గ్రామ దేవతకు పూజలు చేయాల్సిందే. గ్రామ దేవతలకు ఒక ప్రాంతమంతా నిర్దిష్టమైన సమయంలో చేసే ఉత్సవాలు చేసే సంప్రదాయం కూడా ఎప్పటినుంచో ఉంది. ప్రతి యేటా ఆషాఢ మాసంలో తెలంగాణ ప్రాంతంలో గ్రామ దేవతలకు కృతజ్ఞతగా నిర్వహించే వైభవోపేతమైన వేడుకలు... బోనాలు. నెల రోజులు కొనసాగే ఈ ఉత్సవాల్లో... మహాంకాళి, ఎల్లమ్మ, పోచమ్మ తదితర పేర్లతో వెలసిన అమ్మవారికి భక్తి ప్రపత్తులతో నైవేద్యాలను సమర్పించి, తమను చల్లగా చూడాలని మహిళలు వేడుకుంటారు.


ఎన్నెన్నో రూపాలు...

ప్రకృతి అంటే స్త్రీ స్వరూపం. అందుకే లక్ష్మీ అష్టోత్తర శతనామావళి ‘ప్రకృతి’ శబ్దంతోనే మొదలవుతుంది. ప్రకృతి స్వరూపంగా ఆరాధనలు అందుకొనే గ్రామ దేవతలందరూ శక్తి స్వరూపిణులైన స్త్రీమూర్తులే. కుల, వర్ణ, వర్గ విచక్షణ లేకుండా... సర్వ జనులు నేరుగా తమ స్వహస్తాలతో అలంకరణలు చేసి, సేవలు, పూజలు చేసుకోవచ్చు. తమ ఇళ్ళలో వండి తెచ్చిన నైవేద్యాలను నేరుగా సమర్పించుకోవచ్చు. గ్రామాల్లో కొలువైన దేవతలను పలురకాలుగా వర్గీకరించవచ్చు.

గ్రామ దేవతలు: గ్రామ సరిహద్దులలో వెలసి ఉండే దేవతలు. పోలేరమ్మ, ఎల్లమ్మ, అంకాళమ్మ, సుంకలమ్మ, గంటలమ్మ... ఇలా గ్రామ దేవతలు ఎన్నో పేర్లతో ఉంటారు.

వన దేవతలు: అడవిలో నివాసం ఉండే గిరిజనులు ఆరాధించే దేవతలు వన దేవతలు. తెలంగాణలోని మేడారంలో వెలసిన సమ్మక్క, సారలమ్మ దేవతలు దీనికి చక్కటి ఉదాహరణ. రెండేళ్ళకు ఒకసారి జరిగే మేడారం జాతర దేశంలోనే అతి పెద్దదిగా ప్రసిద్ధి చెందింది. ఈ జాతరలో గిరిజనులతోపాటు ఇతర వర్గాల భక్తులు కూడా పాల్గొని అమ్మవార్లను కొలుస్తారు.

పేరంటాలు: తమ కుటుంబం కోసమో, గ్రామం కోసమో, పరోపకారం కోసమో ప్రాణత్యాగం చేసి, ఆయా గ్రామాల ప్రజల నుంచి పూజలు అందుకొనే దేవతలను ‘పేరంటాళ్ళు/ పేరంటాలు’ అంటారు. నెల్లూరు జిల్లా నర్రవాడలో వెలసిన శ్రీవెంగమాంబ పేరంటాలు ఆలయం ప్రసిద్ధమైనది. అలాగే పెనుగంచిప్రోలు తిరుపతమ్మ తల్లి, విజయనగరం పైడితల్లి అమ్మవారు, పెనుగొండ వాసవీ కన్యకాపరమేశ్వరి అమ్మవారు, నిడదవోలు లక్ష్మీ అమ్మవారు... ఇలా ఎన్నో ఉదాహరణలు చెప్పుకోవచ్చు.

వలస దేవతలు: ఏవైనా అవాంతరాలవల్ల... ఒక గ్రామం మొత్తం వేరే చోటుకు తరలిపోయినప్పుడు... ఆ గ్రామ దేవతలను కూడా తీసుకువెళ్ళి, నూతన ఆలయం నిర్మిస్తారు. వారికి ‘వలస దేవతలు’ అని పేరు.

దేవరిల్లు: కొన్ని చోట్ల దేవతలను మట్టి ముంతలు లేదా లోహపు ముంతలలో కొన్ని పవిత్ర ద్రవ్యాలు ఉంచి పూజిస్తారు. వీటికి ‘గరగలు’ అని పేరు. అలా గరగలను ఉంచే ఇంటిని ‘దేవరిల్లు’ అంటారు.


జానపద సాహిత్యంలో గ్రామ దేవతలను కీర్తిస్తూ ‘ఏడుగురు అక్కలు ఉయ్యాలో, ఒక్క తమ్ముడు ఉయ్యాలో’ అని పాడుతారు. ఆ ఏడుగురు అక్కలు ‘సప్తమాతృకలు’ అని చెప్పుకోవచ్చు. గ్రామ దేవతలకు ముందు పోతురాజుగా భావించే శిల లేదా విగ్రహం ఉంటుంది. అమ్మవారితో పాటు పోతురాజును కూడా పూజిస్తారు. కోరికలు తీర్చే కొంగుబంగారాలైన గ్రామ దేవతలకు ఏడాదికో, రెండేళ్ళకో ఆ గ్రామ నియమాలను అనుసరించి ఉత్సవాలు జరుగుతాయి. వాటిని ‘జాతరలు’, ‘తిరునాళ్ళు’ అని పిలుస్తారు. జాతరలకు చాటింపు వేసిన తరువాత... అవి పూర్తయ్యేదాకా గ్రామస్తులు ఊరి పొలిమేర దాటరు. ఏదైనా అత్యవసర పరిస్థితి వస్తే... అమ్మవారికి విన్నపం చేసి, ఉదయాన్నే బయటకు వెళ్ళి, సాయంత్రానికల్లా తిరిగి గ్రామానికి వస్తారు.

ఆ పేర్లు ఎలా వచ్చాయి?

గ్రామ దేవతల పేర్ల వెనుక ఆసక్తికరమైన విశేషాలు కనిపిస్తాయి. పొలిమేరలో ఉండి రక్షించే దేవతను పోలేరమ్మ అని, ఎల్ల మీద ఉండి రక్షించే అమ్మవారిని ఎల్లమ్మ అని, చింతలు తీర్చే దేవతను చింతమ్మ అని, అన్నీ అమర్చే అమ్మ, గ్రామానికే పెద్ద కనుక పెద్దమ్మ అని, అగ్నికి ప్రతిరూపమైన తల్లిని అనలమ్మ అని, ప్రత్యక్ష నారాయణుడు సూర్యుడికి ప్రతిరూపంగా కొలువైన అమ్మను సూరమ్మ అని, నీటి వనరులకు ప్రతిరూపమైన అమ్మవారిని గంగమ్మ అని, కొండవాలులో ప్రతిష్ఠించిన అమ్మవారిని కొండమ్మ అని, పుట్టల దగ్గర వెలసిన దేవతను పుట్టమ్మ లేదా నాగమ్మ అని, గాలికి ప్రతిరూపంగా కొలువుతీరిన తల్లిని గాలమ్మ అని పిలుస్తారు.

డి.యన్‌.వి. ప్రసాద్‌ స్థపతి

9440525788

ఈ వార్తలనూ చదవండి:

కువైట్‌లోని చైనా కంపెనీపై ఇరాన్ దాడి

కుట్రపూరిత వీసా కేసు.. అమెరికా నుంచి భారతీయుడి బహిష్కరణ

Updated Date - Jul 31 , 2026 | 01:08 AM