Share News

నీతి, విశ్వాసాలే అర్హత

ABN , Publish Date - Nov 20 , 2026 | 03:06 AM

నీతిమంతులు, చెడ్డవారు ఈ లోకంలో కలిసే ఉంటారు. ఎవరు ఎవరనేది నిర్ధారించడం సాధ్యం కాదు. కానీ యుగసమాప్తిలో..

నీతి, విశ్వాసాలే అర్హత

దైవమార్గం

నీతిమంతులు, చెడ్డవారు ఈ లోకంలో కలిసే ఉంటారు. ఎవరు ఎవరనేది నిర్ధారించడం సాధ్యం కాదు. కానీ యుగసమాప్తిలో... అంటే చివరి తీర్పును ఇచ్చే రోజున వారిని దేవుడు వేరు చేస్తాడు. ఎవరికి అర్హమైన స్థానాన్ని వారికి ప్రసాదిస్తాడు. దీనికి ‘‘సముద్రంలో విసిరిన వలలు నిండినప్పుడు జాలరులు దాన్ని ఒడ్డుకు లాగి, కూర్చొని, మంచి చేపలను ఏరి గంపలో వేసుకొని, పనికిరానివాటిని పారేస్తారు’’ అంటూ ఒక ఉపమానాన్ని ఏసు ప్రభువు చెప్పాడు. ఇందులో ప్రతి పదానికి లోతైన అంతరార్థం ఉంది.

సముద్రం... ఈ లోకాన్ని, వల... దేవుని రాజ్యాన్ని లేదా సువార్త ప్రకటనను సూచిస్తాయి. సముద్రంలో వల వేసినప్పుడు అన్ని రకాల చేపలు పడతాయి. అదే విధంగా సువార్త ద్వారా రకరకాల ప్రజలు ఒక సంఘంగా ఏర్పడతారు. వల నిండడం అనేది దేవుడు నిర్ణయించిన సమయం పూర్తి కావడాన్ని సూచిస్తుంది. లోకంలో సువార్త ప్రకటించాల్సిన కాలం ముగిసి, రక్షణ పొందవలసిన వారి సంఖ్య పూర్తయినప్పుడు తీర్పు సమయం వస్తుంది. సముద్రం లోతుల్లోంచి ఒడ్డు అనే బహిరంగ స్థలానికి చేపలను మత్స్యకారులు తీసుకువస్తారు. అంటే ప్రతి మనిషి తన జీవితం చివరకు దేవుని న్యాయపీఠం ఎదుట బహిర్గతం అవుతుంది. జాలరి కూర్చొని, నిదానంగా చేపలను ఏరినట్టు... దేవుని సన్నిధిలో నీతిమంతులను, చెడ్డవారిని వేరు చేసే కార్యం చాలా కచ్చితత్వంతో, ఎలాంటి పొరపాటుకు తావులేకుండా, న్యాయబద్ధంగా జరుగుతుంది. క్రీస్తుపై విశ్వాసంతో, నీతిగా జీవించిన వారిని దేవదూతలు పరలోక రాజ్యంలో చేర్చుకుంటారు. పైకి భక్తిని నటిస్తూ, హృదయంలో ఎలాంటి మార్పు లేనివారు, దేవుని మార్గాలను తిరస్కరించినవారు అగ్నిగుండం (వినాశనం) పాలవుతారని క్రీస్తు వివరించాడు.

సువార్త రకరకాల ప్రజలను ఆకర్షిస్తుంది. వారిలో అన్ని నేపథ్యాలు, దేశాలు, జీవనశైలులకు చెందిన వ్యక్తులు ఉంటారు. అయితే కొందరు మాత్రమే సువార్తను పూర్తి విశ్వాసంతో స్వీకరిస్తారు. అలాకాకుండా... విశ్వాసుల్లా నటిస్తూ, అవినీతిని అంటిపెట్టుకున్నవారు అగ్నిగుండం పాలవుతారు. వలలో మంచి, చెడు చేపల మాదిరిగా మంచివారు, చెడ్డవారు కలిసే ఉన్నా... చివరికి వేర్పాటు తప్పదు. కాబట్టి దేవునిపట్ల నిజమైన విశ్వాసంతో, నీతిమంతంగా జీవించేవారే పరలోక రాజ్యంలో చేరడానికి అర్హులు.

ఈ వార్తలనూ చదవండి:

చెన్నైలో భారీగా హెరాయిన్ పట్టివేత.. రూ.710 కోట్ల విలువైన డ్రగ్స్ స్వాధీనం..

నైలాన్ తాడుతో చిన్నారి చేతులు కట్టేసి కొట్టిన టీచర్.. తమిళనాడు స్కూల్లో ఘటన

Updated Date - Nov 20 , 2026 | 03:06 AM