Share News

గ్లోబల్‌ గణేశా!

ABN , Publish Date - Sep 14 , 2026 | 06:13 AM

భౌగోళిక ఎల్లలు, సంస్కృతులు, రంగులను దాటుకుని ప్రపంచవ్యాప్తంగా వివిధ రూపాల్లో కొలువవుతున్న శ్రీ గణపతి విశేషాలు....

గ్లోబల్‌ గణేశా!

భౌగోళిక ఎల్లలు, సంస్కృతులు, రంగులను దాటుకుని ప్రపంచవ్యాప్తంగా వివిధ రూపాల్లో కొలువవుతున్న శ్రీ గణపతి విశేషాలు.

భారతీయ సంస్కృతిలో ప్రాథమిక దైవంగా పూజలందుకునే వినాయకుడు, కేవలం భరతభూమికే పరిమితం కాలేదు. ఆధ్యాత్మిక ప్రపంచంలో విఘ్న నివారకుడిగా పూజలందుకునే గణనాథుడు.. శతాబ్దాల క్రితమే సరిహద్దులు దాటి ప్రాచ్య, పాశ్చాత్య దేశాల సంస్కృతుల్లో ఒక భాగమయ్యాడు. ఆసియాలోని వివిధ బౌద్ధ, హిందూ రాజ్యాలకు వ్యాపించిన ఈ దేవతా రూపం, ఆయా ప్రాంతాల సంప్రదాయాలకు అనుగుణంగా కొత్త పేర్లతో పూజలందుకుంటోంది.

ఇండోనేషియా: విద్యకు ప్రతిరూపం

ముస్లిం జనాభా అధికంగా ఉండే ఇండోనేషియాలో వినాయకుడికి ప్రత్యేక స్థానం ఉంది. అక్కడ గణపతిని విజ్ఞానానికి, జ్ఞానానికి, విద్యకు అధిపతిగా భావిస్తారు. ఆ దేశంలో 1998లో విడుదల చేసిన 20 వేల రూపీ కరెన్సీ నోటుపై విద్యాశాఖ మాజీమంత్రి కి హజార్‌ దేవాంతర చిత్రంతో పాటు వినాయకుడి చిత్రాన్ని ముద్రించడం చారిత్రక విశేషం. తదనంతరం రక్షణ కారణాల రీత్యా ఆ నోటు చెలామణిని ఉపసంహరించుకున్నప్పటికీ, నేటికీ ఆ దేశ విద్యాసంస్థలు, ప్రముఖ భవనాల వద్ద గణేశుడి విగ్రహాలు దర్శనమిస్తాయి.

జపాన్‌: జ్ఞానదాతగా.: జపాన్‌ బౌద్ధ సంప్రదాయంలో వినాయకుడిని ‘కాంగిటెన్‌’ లేదా ‘షోటెన్‌’ అని పిలుస్తారు. 8-9వ శతాబ్దంలో షింగోన్‌ బౌద్ధమతం ద్వారా గణపతి ఆరాధన జపాన్‌కు వ్యాపించింది. జపాన్‌ వ్యాప్తంగా దాదాపు 250కి పైగా ఆలయాలలో గణేశుడి ఆరాధన కనిపిస్తుంది. ముఖ్యంగా వ్యాపార అభివృద్ధికి, ఆటంకాలు తొలగిపోవడానికి కాంగిటెన్‌ను నిష్ఠతో పూజిస్తారు. టోక్యోలోని మత్సుచియామా షోటెన్‌ ఆలయం దీనికి ప్రసిద్ధి.


థాయిలాండ్‌: కళల దేవుడు

థాయిలాండ్‌లో వినాయకుడిని‘ఫ్రా ఫికానెట్‌’ అని పిలుస్తారు. థాయ్‌ బౌద్ధులు ఆయనను అదృష్టానికి, సౌభాగ్యానికి, సకల కళలకు అధిపతిగా కొలుస్తారు. అక్కడి రంగుల ప్రపంచం, సినీరంగం, నాటక రంగానికి చెందిన కళాకారులు తమ కొత్త ప్రాజెక్ట్‌ ప్రారంభించే ముందు వినాయకుడికి పూజలు చేయడం ఆనవాయితీ.

మయన్మార్‌, రష్యా, ఇతర పాశ్చాత్య దేశాలు

మయన్మార్‌లో ‘మహా పీనే’ పేరుతో రక్షణ దైవంగా గణపతి కనిపిస్తాడు. అలాగే రష్యాలోని ప్రాచీన పురాతత్వ శాస్త్ర ఆధారాలలో, సెంట్రల్‌ ఆసియా ప్రాంతాల్లో ప్రాచీన గణపతి శిల్పాలు లభించాయి.

రూపాలు మారినా, పేర్లు మారినా విశ్వవ్యాప్తంగా వినాయకుడు ఆటంకాలను తొలగించే విజ్ఞాన రూపంగానే నిలిచాడు. ప్రపంచ సంస్కృతులను ఏకం చేసే ఆధ్యాత్మిక వారధిగా బొజ్జ గణపయ్య కొలువవుతున్న తీరు అపారమైన మానవ సాంస్కృతిక వైభవానికి నిదర్శనం.

ఈ వార్తలనూ చదవండి:

బ్రిక్స్ సదస్సు విజయవంతం.. ప్రధాని మోదీకి చైనా అధ్యక్షుడి అభినందనలు

ఈఎంపీ షీల్డులు, హైటెక్ ఎన్‌క్రిప్షన్.. మిసైల్ దాడులనూ తిప్పికొట్టే జిన్ పింగ్ ఫ్లైట్.!

Updated Date - Sep 14 , 2026 | 06:13 AM