Share News

ఆ ఫ్యాషన్లు మనవే!

ABN , Publish Date - Apr 27 , 2026 | 02:55 AM

అంతర్జాతీయ ఫ్యాషన్‌ బ్రాండ్లు, భారతీయ సంప్రదాయాలను అనుకరిస్తూ, సరికొత్త వాదనలకు తెర లేపుతున్నాయి. ప్రముఖ ఫ్యాషన్‌ బ్రాండ్‌, రాల్ఫ్‌ లారెన్‌ గతంలో మన ఝుంకాలనూ...

ఆ ఫ్యాషన్లు మనవే!

పోకడ

అంతర్జాతీయ ఫ్యాషన్‌ బ్రాండ్లు, భారతీయ సంప్రదాయాలను అనుకరిస్తూ, సరికొత్త వాదనలకు తెర లేపుతున్నాయి. ప్రముఖ ఫ్యాషన్‌ బ్రాండ్‌, రాల్ఫ్‌ లారెన్‌ గతంలో మన ఝుంకాలనూ, తాజాగా బంధాని స్కర్ట్‌ను కాపీ కొట్టేసి వార్తల్లోకెక్కింది. ఈ సందర్భంగా ఇప్పటివరకూ విదేశీ అగ్ర ఫ్యాషన్‌ బ్రాండ్స్‌, కాపీ కొట్టేసిన భారతీయ ఆభరణాలు, సంప్రదాయ అలంకరణల గురించిన ఆసక్తికరమైన విశేషాల గురించి తెలుసుకుందాం!

‘ప్రింట్‌ కాటన్‌ ర్యాప్‌ స్కర్ట్‌’... బంధాని ప్రింట్‌ లెహంగాకు రాల్ఫ్‌ లారెన్‌ పెట్టుకున్న పేరిది. ఒక్కో స్కర్ట్‌కు 44,800 రూపాయల ధర నిర్ణయించి విక్రయించుకుంటున్న రాల్ఫ్‌ లారెన్‌, ఈ లెహంగా, ప్రింట్‌ మూలాలను పూర్తిగా గాలికొదిలేసింది. రాజస్థాన్‌కు పరిమితమైన ఈ టై అండ్‌ డై టెక్నిక్‌ తమిళనాడులో సింగుడి పేరుతో ప్రచారం పొందింది. ఎంతో విశిష్ఠత కలిగిన ఈ భారతీయ కళను అంతర్జాతీయ వేదిక మీద ప్రదర్శించే సమయంలో, తగిన క్రెడిట్‌ ఇవ్వడం సముచితం. కానీ అగ్ర ఫ్యాషన్‌ బ్రాండ్లు ఈ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉండడం శోచనీయం.

  • మూలాలు మరిచి...

రాల్ఫ్‌ లారెన్‌కు ఇది మొదటి తప్పు కాదు. గతంలో కూడా ఈ బ్రాండ్‌, భారతీయ ఝుంకాలను కాపీ కొట్టింది. ప్యారిస్‌ ఫ్యాషన్‌ వీక్‌లో రాల్ఫ్‌ లారెన్‌ మోడల్స్‌, డోమ్‌ ఆకారపు గంటను పోలిన చెవి కమ్మలు పెట్టుకుని ప్రదర్శనలో పాల్గొన్నారు. అవి అచ్చుగుద్దినట్టు భారతీయ ఝుంకాలనే తలపిస్తున్నప్పటికీ, వాటిని ఝుంకాల పేరుతో కాకుండా, స్థానిక తెగల అమెరికన్‌ డిజైనర్లు అయిన నీల్‌ జరామా, జిమ్మీ బిగేలు రూపొందించిన వింటేజ్‌ యాక్సెసరీ్‌సగా ప్రదర్శనలో పేర్కొన్నారు. అంతే తప్ప వాటి సాంస్కృతిక మూలాలను ఎక్కడా ప్రస్థావించలేదు. విలాసవంతమైన ఫ్యాషన్‌లో ‘ఇన్‌స్పైర్‌డ్‌’, ‘హెరిటేజ్‌’, ‘వింటేజ్‌’ (ప్రేరణ పొందిన, వారసత్వ సంపద అయిన, పురాతనమైన) అనే పద ప్రయోగం సర్వసాధారణమే! అయితే ఈ సందర్భంలో ఈ ఝుంకాలను వింటేజ్‌ అని సంబోధించడం ద్వారా, అవి వాటి భౌగోళిక, ప్రామాణిక ఉనికిని కోల్పోయాయి. భారతీయ మూలాలు కలిగిన డిజైన్లను ప్రపంచ ఫ్యాషన్‌ పరిశ్రమ అనుకరించడం ఇది కొత్త కాదు. ఎంబ్రాయిడరీ చేసిన దుస్తులు మొదలు, మేజోళ్ల వరకూ భారతీయ హస్తకళలు పదే పదే అనుకరణకు గురవుతూనే ఉన్నాయి. అంతర్జాతీయ రన్‌వేల మీద స్పష్టమైన గుర్తింపు లేకుండానే ప్రదర్శనకు నోచుకుంటూనే ఉన్నాయి.


  • ప్రాడా ‘కొల్హాపురి’ చెప్పులు

2025లో ప్రముఖ ఇటాలియన్‌ లగ్జరీ ఫ్యాషన్‌ బ్రాండ్‌ ‘ప్రాడా’ మన కొల్హాపురి చెప్పులను పోలిన శాండిల్స్‌ను ప్రదర్శించి, తీవ్ర విమర్శలను ఎదుర్కొంది. ఆ తర్వాత, తప్పు ఒప్పుకుని, ఇండియన్‌ మేడ్‌ కొల్హాపురి శాండిల్స్‌ నుంచి ప్రేరణ పొందిన లిమిటెడ్‌ ఎడిషన్‌ శాండిల్స్‌గా ప్రకటించుకుంది. అంతే కాకుండా, చేసిన తప్పుకు పరిహారంగా, మహారాష్ట్ర, కర్నాటక రాష్ట్రాల్లో రెండు వేల జతల చెప్పులు తయారుచేసి విక్రయించేలా రెండు ప్రభుత్వ సంస్థలతో ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఈ సందర్భంగా... ‘అసలైన తయారీదారు ప్రామాణికతలకు, మా సొంత తయారీ నైపుణ్యాలను జోడించి సరికొత్త చెప్పులను రూపొందిస్తున్నాం’ అంటూ ప్రకటించుకుంది. ఈ చెప్పులు గత ఫిబ్రవరి నుంచి, ప్రపంచవ్యాప్తంగా ఉన్న 40 ప్రాడా ఆన్‌లైన్‌ స్టోర్లలో అందుబాటులోకొచ్చేశాయి. ఒక జత చెప్పుల ధర మన కరెన్సీలో అక్షరాలా 89 వేల రూపాయలు.

  • డియోర్‌ ‘ముకాయిష్‌’ ఎంబ్రాయిడరీ

ప్రాడా కొల్హాపురి శాండిల్స్‌ను ప్రదర్శించిన కొన్ని రోజులకే డియోర్‌ ఫ్యాషన్‌ బ్రాండ్‌, ఒక కోటి 90 లక్షల రూపాయల ఖరీదైన భారతీయ ముకాయిష్‌ ఎంబ్రాయిడరీ నైపుణ్యంతో రూపొందిన ఓవర్‌కోట్‌ను ప్యారిస్‌ ఫ్యాషన్‌ వీక్‌లో ప్రదర్శించింది. రాబర్ట్‌ ప్యాటిసన్‌, రిహానా, డేనియల్‌ క్రెయిగ్‌ లాంటి మహామహులు ఈ ప్రదర్శనకు హాజరయ్యారు. విమెన్స్‌వేర్‌, మెన్స్‌వేర్‌ క్రియేటివ్‌ డైరెక్టర్‌గా నియమితుడైన జోనథన్‌ యాండర్సన్‌, ఈ డెబ్యు కలెక్షన్‌ను, లగ్జరీ లేబుల్‌గా ప్రదర్శించాడు. అయితే ఫ్యాషన్‌ కామెంటేటర్‌, కంటెంట్‌ క్రియేటర్‌, హనాన్‌ బెసోవిచ్‌, ఈ ఓవర్‌కోట్‌ను తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేస్తూ, ‘ఈ రెండు లక్షల డాలర్ల డియోర్‌ ఓవర్‌కోట్‌ తయారీకి 34 రోజుల సమయం పట్టిందా? ఈ కోట్‌ గురించిన అసలు వాస్తవం తెలుసుకోండి’ అంటూ కోటు గుట్టు విప్పేశాడు. ‘సూక్ష్మవివరాలతో కూడిన ఈ కోట్‌ మీద కనిపించే ఎంబ్రాయిడరీ ముకాయిష్‌ పనితనంతో రూపొందింది. ఇది లక్నోకు చెందిన మెటల్‌ స్ర్టాండ్‌ ఎంబ్రాయిడరీ నైపుణ్యం. ఈ కోట్‌ తయారీకి 12 మంది ఎంబ్రాయిడరర్స్‌ పని చేశారు’ అంటూ కోటు వెనకున్న కథను బట్టబయలు చేయడంతో అసలు విషయం బయటి ప్రపంచానికి తెలిసింది.


5-Navya.jpg

గూచి ‘ఇండియన్‌ కుర్తా’

2021లో గూచి ఫ్యాషన్‌ బ్రాండ్‌, ఫ్లోరల్‌ ఎంబ్రాయిడరీ ఆర్గానిక్‌ లినెన్‌ కఫ్తాన్‌ను మూడున్నర లక్షల రూపాయల ధరకు విక్రయించింది. సామాజిక మధ్యమాల్లో పలువురు ఈ కుర్తాను దేశీ కుర్తాగా విమర్శించడంతో పాటు, ఇలాంటి కుర్తాలు భారతీయ మార్కెట్లో మరీ ముఖ్యంగా సరోజినీ నగర్‌లో 250 నుంచి 500 రూపాయలకే దొరుకుతాయని ఎద్దేవా చేశారు. ఈ సంఘటనతో, సంప్రదాయ భారతీయ వస్త్రాలతో పోల్చితే, ఈ వస్త్రాలు అత్యధిక ధరలను కలిగి ఉండడం, విలాసవంతమైన బ్రాండ్‌ల ధరల విధానం, సాంస్కృతిక ఆక్రమణలు మొదలైన అంశాల చుట్టూరా పలు చర్చలు బయల్దేరాయి. ఈ బ్రాండ్‌ భారతీయ మూలాలకు ప్రత్యేక గుర్తింపు ఇవ్వకుండా, సాంస్కృతిక వారసత్వాన్ని విక్రయిస్తోందని విమర్శకులు వాదించారు.

ఈ వార్తలు కూడా చదవండి..

అంతర్జాతీయ టెక్ మ్యాప్‌లో విశాఖకు చోటు

రుద్రంపేట ఘటనపై రాయపాటి శైలజ ఆరా

For More AP News And Telugu News

Updated Date - Apr 27 , 2026 | 02:56 AM