Share News

ఆధ్యాత్మికం.. ఆరోగ్యప్రదం

ABN , Publish Date - Sep 14 , 2026 | 06:22 AM

వినాయక చవితి మనల్ని ప్రకృతికి, తద్వారా ఆరోగ్యానికి దగ్గర చేసే పండుగ. ముఖ్యంగా వినాయక పూజలో ఉపయోగించే ఇరవై ఒక్క రకాల పత్రాలు ఆరోగ్య ప్రదాయకాలు. వీటిలో ప్రతి దానికీ తనదైన...

ఆధ్యాత్మికం..  ఆరోగ్యప్రదం

వినాయక చవితి మనల్ని ప్రకృతికి, తద్వారా ఆరోగ్యానికి దగ్గర చేసే పండుగ. ముఖ్యంగా వినాయక పూజలో ఉపయోగించే ఇరవై ఒక్క రకాల పత్రాలు ఆరోగ్య ప్రదాయకాలు. వీటిలో ప్రతి దానికీ తనదైన ప్రత్యేకత ఉంది. మరొక విశేషం ఏమిటంటే... మారేడు పత్రాలకు శివార్చనలో ప్రాధాన్యం. మహా విష్ణు పూజలో తులసీ దళాలది అగ్రస్థానం. గణేశ పూజలో ఇలాంటి వ్యత్యాసాలేవీ లేవు. ప్రతి పత్రం ప్రధానమైనదే. గణేశ పూజకు వినియోగించే పత్రాలు ఔషధీ గుణాలు కలిగినవి. నిమజ్జన సమయంలో గణేశ విగ్రహంతో పాటు పత్రిని కూడా నీటిలో కలుపుతాం. ఆ పత్రాల నుంచి ఆల్కలాయిడ్స్‌ విడుదలై... నీటిలో ఉన్న చెడు బ్యాక్టీరియా తగ్గుతుంది. నీరు శుద్ధి అవుతుంది. వివిధ వ్యాధులు, ఆరోగ్య సమస్యల నివారణలో ఈ పత్రాల ప్రయోజనం గురించి ఆయుర్వేదం విస్తృతంగా వివరించింది. మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించాలని వినాయక చవితి రోజున గణేశుణ్ణి కోరుకుంటూ ఆరాధిస్తున్నప్పుడు... వివిధ వ్యాధులు రాకుండా ఉండాలని ప్రార్థిస్తూ... వాటిని నివారించే పత్రాలతో స్వామిని పూజిస్తాం. అదే పత్రి పూజలోని విశిష్టత. అంటే... ఇది ఆధ్యాత్మికమే కాదు, ఆరోగ్యప్రదాయకం కూడా. వాటి గురించి వివరంగా తెలుసుకుందాం

మాచీపత్రం/ మాచిపత్రి: మంచి సువాసన గల పత్రి. తలనొప్పులు, కంటి దోషాలు తగ్గుతాయి.

సిందువారపత్రం/ వావిలి: వాతం, శరీరం, తలమాడు నొప్పులను తగ్గిస్తుంది. పంటి చిగుళ్లు, కీళ్ల బాధలను నివారిస్తుంది.

బృహతీపత్రం/ వాకుడాకు: దగ్గు, ఉబ్బసం, నంజు, గొంతు, ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టేందుకు ఉపయోగపడుతుంది.

అపామార్గపత్రం/ ఉత్తరేణి: గాయాలను మాన్పడానికి, ఇతర చర్మ సమస్యలకు అద్భుతంగా పనిచేస్తుంది.

జాజీపత్రం/జాజి ఆకు: ఈ ఆకులు శరీరానికి వేడినిచ్చి శక్తిని కల్పిస్తాయి. వాపు, నొప్పిని తగ్గిస్తాయి. రక్తాన్ని శుద్ధి చేస్తాయి.


1-navya.jpg

దాడిమీపత్రం /దానిమ్మ: శరీరంలో త్రిదోషాలైన వాత, పిత్త, కఫాలను హరింపజేస్తుంది.

దేవదారుపత్రం / దేవదారు: దేవదారు తైలం చర్మ వ్యాధులకు, గొంతు సమస్యలకు, పేగుల్లో పుండ్ల నివారణకు, కండరాల బలోపేతానికి ఉపయుక్తంగా ఉంటుంది.

శమీపత్రం/జమ్మి: ఈ ఆకురసం మాడుకు చల్లదనాన్నిచ్చి, జుట్టు నిగనిగలాడేందుకు ఉపకరిస్తుంది.

బిల్వపత్రం/ మారేడు: ఈ వృక్షం బహు ప్రయోజనకారి. ఈ ఆకు పసరు పలు చర్మ దోషాలను నివారిస్తుంది.

మరువకపత్రం/ మరువం: నరాల ఉతే్త్ప్రరణకు, చెవిపోటు, నొప్పులకు ఔషధంగా ఉపయోగపడుతుంది.

అశ్వత్థపత్రం/ రావి: శరీరంలో విషాల విరుగుడుకు, క్రిమిదోషాలను నివారించేందుకు వినియోగిస్తారు.

దూర్వాయుగ్మం / గరిక: రక్త, మూత్ర సంబంధిత సమస్యలకు పనిచేస్తుంది.

తులసీపత్రం/ తులసి: దగ్గు, జలుబు, జ్వరం, చర్మ వ్యాధులను నివారిస్తుంది. క్రిములను నశింపజేస్తుంది. మొక్కలను చీడ పీడల నుంచి కాపాడుతుంది.

అర్జునపత్రం/ తెల్లమద్ది: దీని బెరడు కషాయం గుండెను ఆరోగ్యంగా, పదిలంగా ఉంచుతుంది.

బదరీపత్రం/ రేగు: అజీర్తి, రక్త దోషాలను నివారిస్తుంది. వీర్యవృద్ధికి తోడ్పడుతుంది.

దత్తూరపత్రం/ ఉమ్మెత్త: ఉబ్బసానికి, దగ్గులకు, కీళ్లవాతాలకు మంచి మందు. ఆ ఆకురసం తేలు, జెర్రి, ఎలుక కాట్లకు విషహరిణిగా పనిచేస్తుంది.

చూతపత్రం/మామిడి: భూమండలంలో అతి పురాతనమైన పండ్ల మొక్కల్లో మామిడి ప్రధానమైంది. మామిడాకు పాదాల బాధల నుంచి ఉపశమనం కలిగిస్తుంది.

కరవీర పత్రం/గన్నేరు: తలలో చుండ్రును తగ్గిస్తుంది. ఈ మొక్క విషతుల్యం కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకొని వాడాలి.

గండకీపత్రం/ కామంచి: కడుపులో నులిపురుగులను హరిస్తుంది.

విష్ణుక్రాంతపత్రం/వరకాంత : దీర్ఘకాలికమైన దగ్గును, కఫ వాతాలను, జ్వరాలను నివారిస్తుంది.

అర్కపత్రం/ తెల్ల జిల్లేడు: తెల్ల జిల్లేడును సూర్యునికి ప్రతీకగా భావిస్తారు. దీనిలోని ఔషధగుణాలు శరీరాన్ని కాంతిమంతం చేస్తాయి.

ఈ వార్తలనూ చదవండి:

బ్రిక్స్ సదస్సు విజయవంతం.. ప్రధాని మోదీకి చైనా అధ్యక్షుడి అభినందనలు

ఈఎంపీ షీల్డులు, హైటెక్ ఎన్‌క్రిప్షన్.. మిసైల్ దాడులనూ తిప్పికొట్టే జిన్ పింగ్ ఫ్లైట్.!

Updated Date - Sep 14 , 2026 | 06:22 AM