నాడు... నేడు మార్పే వారి మంత్రం
ABN , Publish Date - Jan 29 , 2026 | 03:20 AM
ఇన్‌స్టాలోకి వెళ్లినా... ఫేస్‌బుక్ పేజీలు తిప్పినా... మనకు తరచూ కనిపించేవి... ‘నాడు- నేడు’ చిత్రాలు. సరదాకు కొందరు... అపురూపంగా కొందరు...
సంకల్పం
ఇన్‌స్టాలోకి వెళ్లినా... ఫేస్‌బుక్ పేజీలు తిప్పినా... మనకు తరచూ కనిపించేవి... ‘నాడు- నేడు’ చిత్రాలు. సరదాకు కొందరు... అపురూపంగా కొందరు... తమను తాము ‘పాత- కొత్త’లతో పోల్చుకొని మురిసిపోతుంటారు. కానీ మరికొందరు... నాడు రగిలించిన సామాజిక చైతన్యాన్ని... నేడూ కొనసాగిస్తూ... అదే స్ఫూర్తిని నింపుతుంటారు. అప్పుడు... ఇప్పుడు... మార్పు కోసం పరితపించే అలాంటి ఇద్దరు అమ్మాయిల పరిచయమే ఇది.
జన్నత్... దాల్ లేక్ కోసం
చిన్న వయసు... పెద్ద ఆలోచనలు. జన్నత్ పత్లూ ప్రయాణం ఆసాంతం సామాజిక అంశాలతోనే ముడిపడి సాగుతోంది. భూతల స్వర్గం కశ్మీర్‌లో పుట్టిన ఆమె... అక్కడి ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ పెరిగింది. నాలుగేళ్ల వయసు నుంచీ పడవలో తండ్రి పక్కన కూర్చొని ప్రఖ్యాత పర్యాటక కేంద్రమైన దాల్‌లేక్ సరస్సులో విహరించింది. ప్లాస్టిక్ వ్యర్థాలతో నిండిపోతున్న సరస్సును కాలుష్యం నుంచి కాపాడుకొనేందుకు నాన్నతో కలిసి తన వంతు ప్రయత్నం మొదలుపెట్టింది. పడవలో కూర్చొని వలతో నీటిలోని వ్యర్థాలను బయటకు తీసిన ఆ చిన్నారి... తరువాత కూడా ఆ కార్యక్రమాన్ని కొనసాగించింది. తోటి విద్యార్థుల్లో స్ఫూర్తి నింపింది. అలనాటి చిత్రాన్ని ఇటీవల తన ఇన్‌స్టాలో పోస్టు చేసింది జన్నత్. జతగా ఇప్పటి ఫొటో కూడా పంచుకుంది.
నేడూ అదే చైతన్యం...
పదేళ్లు గడిచిపోయాయి... జన్నత్ జీవితంలో. కానీ ఆమె సంకల్పం చెక్కు చెరదలేదు. పర్యావరణ పరిరక్షణ కోసం జన్నత్ చేస్తున్న కృషికి జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. ప్రధాని మోదీ నుంచి గౌరవ పురస్కారం సైతం అందుకుంది. అయినా ఇసుమంతైనా గర్వం లేదు ఆమెలో. నేటికీ అదే అంకితభావం... ఉత్సాహం. ఎక్కడ ఉన్నా... ప్రతి ఆదివారం మాత్రం దాల్ లేక్ ముందు వాలిపోతుంది. చేతిలో ఒక వల పట్టుకొని... చిన్న పడవ ఎక్కి... అందులోని వ్యర్థాలను తొలగించే పనిలో నిమగ్నమైపోతుంది. ప్రజల్లో చైతన్యం రగిలించి... వారిని కూడా ఆ దిశగా అడుగులు వేయిస్తుంది. అవగాహన సదస్సులు నిర్వహించి... సామాన్యులతో పాటు ప్రభుత్వ యంత్రాంగాన్నీ కదిలించి... దాల్‌లేక్ పరిరక్షణను ఒక ఉద్యమంలా ముందుకు నడిపిస్తోంది.
‘మాతృభూమిని ప్రేమించండి. మాటలతో కాదు... మీ చేతలతో’ అంటూ నాడు తండ్రి నింపిన స్ఫూర్తే నేటికీ జన్నత్‌ను ఇంధనమై నడిపిస్తోంది.

చరణ్య.. సంస్కృతి పరిచయం
పదేళ్ల కిందటి తన ఫొటోను... తాజా చిత్రంతో కలిపి ఇన్‌స్టాలో పెట్టింది చరణ్యా కుమార్. ఈ దశాబ్ద కాలంలో ఆమె జీవితంలో పెద్ద మార్పులేమీ జరగలేదు. కానీ తన చుట్టూ ఉన్నవారిలో మార్పు తేవడంలో సఫలమయ్యారు. అమూల్యమైన భారతీయ సంస్కృతిని భావితరాలకు అందించే బృహత్తర కార్యక్రమానికి నాడు శ్రీకారం చుట్టిన ఆమె... నేడు దాన్ని ఒక వ్యవస్థగా మార్చారు. ‘చిత్తమ్’ పేరుతో పర్యావరణహిత విద్యా, వినోద స్టార్ట్‌పను తీసుకువచ్చారు. పిల్లలు, పెద్దలు కలిసి ఆడే పదిహేడు రకాల బోర్డ్, కార్డ్ గేమ్స్, యాక్టివిటీ కిట్స్‌ను సంస్థ పరిచయం చేసింది. వీటన్నిటినీ సాంస్కృతిక, ఆధ్యాత్మిక విద్యను సరదాగా, అదే సమయంలో అర్థవంతంగా బోధించే సాధనాలుగా రూపొందించింది. అంతేకాదు... పాఠశాలలకు వెళ్లి అక్కడి పిల్లలతో ఆటలు ఆడిస్తూ, అవగాహన కల్పిస్తున్నారు చరణ్య. ఇందుకుగానూ ఆమె పలు పురస్కారాలు, ప్రముఖుల ప్రశంసలు అందుకున్నారు.
భావితరాలకు అందించాలని...
బాల్యం నుంచి భారతీయ సంస్కృతి, చరిత్ర పట్ల ఆసక్తి కనబరిచిన చరణ్య... తోటి పిల్లలకు వాటిని కథలుగా చెప్పింది. అమెరికాలోని నార్త్ కరోలినా యూనివర్సిటీ నుంచి కంప్యూటర్ సైన్స్‌లో ఎంఎస్ చేసిన ఆమె... 2014లో ‘ఇన్‌సీడ్’ బిజినెస్ స్కూల్‌లో ఎంబీయే చదివింది. భారత్‌కు తిరిగి వచ్చాక బెంగళూరులోని వివిధ సంస్థల్లో ఉద్యోగం చేసింది 2021లో ‘గురుకూల్ ఫన్’ స్టార్ట్‌పను నెలకొల్పింది. తరువాత ఆ సంస్థ నుంచి బయటకు వచ్చి మూడున్నరేళ్ల కిందట స్వస్థలం చెన్నైలో ‘చిత్తమ్’ను ప్రారంభించింది. ఇప్పుడు ప్రముఖ సంస్థలతో కలిసి తన ఉత్పత్తులను మార్కెటింగ్ చేసుకొంటున్న చరణ్య లక్ష్యం... డబ్బు సంపాదన ఒక్కటే కాదు. భారతీయ మూలాలను భావితరాలకు అందించాలన్న బలమైన ఆకాంక్ష కూడా.
ఇవీ చదవండి
మాకూ హెల్ప్ చేయండి! సుందర్ పిచాయ్‌కు భారతీయ విద్యార్థుల రిక్వెస్ట్
బీటెక్‌లో 17 బ్యాక్‌లాగ్స్.. అయినా వెనక్కు తగ్గలేదు.. ఐదేళ్లు గడిచేసరికి రూ.1.7 కోట్ల శాలరీ