కృషికి దక్కిన విజయం
ABN , Publish Date - Feb 11 , 2026 | 02:04 AM
పుస్తకాలు కొనడానికి కూడా నోచుకోని పేదరికం... అడుగడుగునా అవరోధాలు, ఎన్నెన్నో అవమానాలు... ప్రతికూల పరిస్థితులన్నిటినీ ధైర్యంగా ఎదుర్కొని... నిర్దేశించుకున్న లక్ష్యాన్ని సాధించారు...
పుస్తకాలు కొనడానికి కూడా నోచుకోని పేదరికం... అడుగడుగునా అవరోధాలు, ఎన్నెన్నో అవమానాలు... ప్రతికూల పరిస్థితులన్నిటినీ ధైర్యంగా ఎదుర్కొని... నిర్దేశించుకున్న లక్ష్యాన్ని సాధించారు నంద్యాల జిల్లాకు చెందిన ఇట్టే విజయలక్ష్మి. ఉదయం వ్యవసాయ కూలి పనులు చేస్తూ... రాత్రంతా పట్టుదలతో చదివి గ్రూప్-2లో విజయం సాధించారు. తనను చిన్నచూపు చూసిన చోటే సత్కారాలు అందుకుంటున్న విజయలక్ష్మి స్ఫూర్తిమంతమైన ప్రయాణం ఇది...
‘‘మాది నంద్యాల జిల్లా రుద్రవరం మండలం యల్లావత్తుల గ్రామం. మా తల్లిదండ్రులకు అయిదుగురు సంతానం. నేను ఆఖరుదాన్ని. చిన్న వయసు నుంచి చదువంటే నాకు ప్రాణం. నా తల్లిదండ్రులు వ్యవసాయ కూలీలు. వారి కష్టాలను చూసి... ప్రైవేట్ స్కూల్‌లో చదవాలనే నా కోరికను చంపుకొన్నాను. అయిదో తరగతి వరకూ యల్లావత్తుల స్పెషల్ స్కూలులో, ఆరు నుంచి పదో తరగతి వరకు యల్లావత్తుల జిల్లాపరిషత్ హైస్కూలులో, ఇంటర్మీడియెట్ నంద్యాలలోని ప్రభుత్వ కళాశాలలో నా చదివాను. కొన్ని సందర్భాల్లో పుస్తకాలు కొనేందుకు కూడా డబ్బు ఉండేదికాదు. అయినా పట్టుదల వదల్లేదు. తరగతిలో అందరికన్నా ముందుండేదాన్ని. ఇంటర్ తరువాత నంద్యాలలోని ఓ ప్రైవేటు కళాశాలలో డిగ్రీ చేశాను.
కోచింగ్ మధ్యలో ఆపేశా...
డిగ్రీలో ఉండగా... మా గ్రామానికే చెందిన సాలు చెన్నయ్యతో పరిచయమయింది. అది ప్రేమగా మారింది. దీంతో అన్ని వైపులనుంచి చిక్కులు ఎదురయ్యాయి. ఊరివారి మాటలు నన్ను కుంగదీశాయి. చివరకు అందరినీ ఎదిరించి... 2018లో పెళ్లి చేసుకున్నాం. నా భర్త ట్రాక్టర్ డ్రైవర్‌గా పని చేసేవారు. సొంత ట్రాక్టర్ కొనాలని కోరిక. దానికోసం ఇద్దరం ఎంతో కష్టపడ్డాం. నేను కూలిపనులకు వెళ్లేదాన్ని. అలా కొన్నాళ్లు శ్రమించి... ట్రాక్టర్ కొన్నాం. నా భర్త విద్యావంతుడు కాదు. కానీ నాలో ప్రతిభను గుర్తించి... గ్రూప్స్ రాయాలని ప్రోత్సహించారు. డబ్బు పోగుచేసి, నన్ను గ్రూప్-2 కోచింగ్ కోసం హైదరాబాద్ పంపించారు. అక్కడ హాస్టల్‌లో ఉండి, శిక్షణ తీసుకొనేదాన్ని. అంతా సవ్యంగా సాగుతూ ఉండగా... 2023లో నా భర్తకు యాక్సిడెంట్ అయింది. మా ఊరు నుంచి నంద్యాలకు వెళ్తుండగా... ఆయన్ని ఆటో ఢీకొట్టడంతో తీవ్రంగా గాయపడ్డారు. దాంతో కోచింగ్ మధ్యలోనే ఆపేసి మా ఊరు వచ్చేశాను.
తొలి ప్రయత్నంలోనే...
అప్పటినుంచి కూలి పనులు చేస్తూ నా భర్తకు సపర్యలు చేశాను. ఆయన కోరిక మేరకు గ్రూప్-2 కోసం సన్నద్ధతను కొనసాగించాను. ఉదయం నుంచి సాయంత్రం వరకూ పనులకు వెళ్లేదాన్ని. ఇంటికి వచ్చాక, వంట పని, ఇంటి పనులు ముగించుకొని... అర్ధరాత్రి వరకూ చదివేదాన్ని. మళ్లీ తెల్లవారుజామునే లేచి... అల్పాహారం, మధ్యాహ్నానికి భోజనం తయారు చేసి, పనికి బయలుదేరేదాన్ని. ఒక వారమో, ఒక నెలో కాదు... కొన్ని నెలలు దీక్షగా దీన్ని కొనసాగించాను. వేసవి కాలంలో వ్యవసాయ పనులు లేకపోవడంతో ఉపాధి కూలీగా మారి, మట్టి పనులకు వెళ్లాను. ఆ సమయంలోనూ నా దినచర్యలో గ్రూప్-2 ప్రిపరేషన్‌ను భాగం చేసుకున్నాను. ఇతరుల నుంచి తీసుకున్న న్యూస్ పేపర్లను, అకాడమీ పుస్తకాలను చదివేదాన్ని. ఆన్‌లైన్‌లో చూసి సొంతంగా నోట్స్ తయారు చేసుకొనేదాన్ని. డిప్యూటీ తహసీల్దార్ కావాలనేది నా లక్ష్యం. దానికోసం రోజూ 8 గంటలకు పైగా చదువు మీదనే దృష్టి పెట్టాను. తొలి ప్రయత్నంలోనే గ్రూప్-2 సాధించాను. రాష్ట్ర సచివాలయంలో అసిస్టెంట్ సెక్షన్ అధికారి (ఏఎ్‌సఓ)గా కొలువు సంపాదించాను.’’
చల్లా నవీన్ కుమార్ చౌదరి, కర్నూలు

ఎప్పటిలాగానే పనికి వెళ్తున్నా...
ఒకప్పుడు ఎక్కడ అవమానాలు ఎదుర్కొన్నానో ఇప్పుడు అక్కడే ప్రశంసలు అందుకుంటున్నాను. మా గ్రామస్తులు నన్ను సన్మానించారు. ప్రతి ఇంటికీ నన్ను పిలిచి... నన్ను ఆదర్శంగా తీసుకోవాలని పిల్లలకు చెబుతున్నారు. తమతో కలిసి పని చేసిన వ్యక్తి ఉన్నత ప్రభుత్వోద్యోగం సాధించిందంటూ నా తోటి కూలీల ఆనందానికి అవధులు లేవు. నా భర్త సహకారంతోనే అది సాధ్యమయింది. అతని కళ్లలో ఆనందం కోసం, నా తల్లిదండ్రులకోసం ఇదంతా చేశాను. జీవితంలో ఇబ్బందులు సహజం. ఇబ్బందులను ఎదుర్కొని, లక్ష్యాన్ని చేరుకున్నప్పుడు కష్టాలన్నిటినీ మరచిపోతాం. కష్టం వచ్చినప్పుడు కుంగిపోవడం, గెలిచినప్పుడు పొంగిపోవడం కాదు... ఎప్పుడూ ఒకేలా ఉండాలి. నాకు ఉద్యోగం వచ్చినట్టు సమాచారం అందినా... ఎప్పటిలాగానే పనికి వెళ్తున్నాను. ఉద్యోగంలో చేరేవరకూ కొనసాగిస్తాను. ఆ తరువాత కూడా ఖాళీ దొరికినప్పుడు వ్యవసాయ పనులు చేస్తూనే ఉండాను.’’
ఈ వార్తలు కూడా చదవండి..
పాల వ్యాన్‌లో రేషన్ బియ్యం తరలింపు.. కేసు నమోదు
మున్సిపల్ ఎన్నికలు... సెలవు ప్రకటించిన సర్కార్..
For More AP News And Telugu News