Share News

సార్థకతకు అయిదు సూత్రాలు

ABN , Publish Date - Sep 25 , 2026 | 03:12 AM

మానవులు అయిదు విషయాల్లో అప్రమత్తంగా ఉండాలని దివ్య ఖుర్‌ఆన్‌ చెబుతోంది. అవి... వార్ధక్యానికి ముందున్న యవ్వనం, అనారోగ్యానికి ముందున్న ఆరోగ్యం, లేమికి ముందున్న కలిమి, పనికి...

సార్థకతకు అయిదు సూత్రాలు

సందేశం

మానవులు అయిదు విషయాల్లో అప్రమత్తంగా ఉండాలని దివ్య ఖుర్‌ఆన్‌ చెబుతోంది. అవి... వార్ధక్యానికి ముందున్న యవ్వనం, అనారోగ్యానికి ముందున్న ఆరోగ్యం, లేమికి ముందున్న కలిమి, పనికి ముందున్న తీరిక, మరణానికి ముందున్న జీవితం. మనిషి జీవితంలో యవ్వన దశ చాలా విలువైనది. వృద్ధాప్యం వచ్చి, ఏదీ చేయలేని స్థితిలోకి చేరుకోవడానికి ముందే మంచి పనులు చేయాలి. వయసు మళ్ళిన తరువాత... ఇదివరకే ఎందుకు ఈ ఆలోచన రాలేదని ఎంత చింతించినా ప్రయోజనం ఉండదు. రెండోది ఆరోగ్యం. ఆరోగ్యం ఒకసారి చెడిపోతే... దాన్ని పూర్తిగా బాగుచేసుకోవడం చాలా కష్టం. ఆరోగ్యంగా ఉన్నప్పుడు ఉండే చురుకుదనం అస్వస్థులైనప్పుడు ఉండదు. నిస్సహాయతకు, నిరాశకు గురవుతాం. ఏ పనినీ సక్రమంగా చేయలేం. జీవితంలో ఉన్నత శిఖరాలను అందుకోవడంలోనే కాదు... ధార్మిక ఉన్నతికి సాధించడంలో కూడా ఆరోగ్యం కీలకపాత్ర పోషిస్తుంది. ఆరోగ్యవంతుడు ఏదైనా నేర్చుకోగలడు. పదిమందికి నేర్పగలడు. నలుగురికి సహాయపడగలడు. కాబట్టి దురలవాట్లకు దూరంగా ఉండి, రోగాలపాలు కాకుండా ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. మూడోది... లేమికి ముందు కలిమి. మానవ జీవితంలో కలిమిలేములు అత్యంత సహజం. దేవుడు ప్రసాదించిన సంపదను సన్మార్గంలో ఖర్చు చేయాలి. చాలామంది ఎలాంటి దానధర్మాలు, పుణ్యకార్యాలు చేయకుండా... తమ సంపదను చెడ్డ పనులకు, వ్యసనాలకు ఖర్చు చేస్తారు. ఉన్నదంతా పోయాక... మంచి పనులు చేయలేకపోయామని బాధపడతారు. కాబట్టి లేమి ముంచుకురాకముందే.... ఉన్న కలిమిని సద్వినియోగం చేయాలి. నాలుగోది... ఏ పనిలోనైనా నిమగ్నం కావడానికి ముందు దొరికే తీరిక. అలాంటి సమయం దొరికినప్పుడు దాన్ని దైవ చింతన కోసం, సత్కార్యాల కోసం వినియోగించాలి. అనవసరమైన వాటికోసం సమయం వృధా చేయకూడదు. చివరిది... మరణానికి ముందున్న జీవితం. పరలోకంలో దైవానుగ్రహానికి బాటలు వేసుకోవాలంటే... ఈ లోకంలో మరణానికి ముందే ప్రయత్నించాలి. ఈ జీవితాన్ని ప్రసాదించిన దేవునికి కృతజ్ఞతలు తెలుపుకోవాలి. వీలైనన్నిసార్లు నమాజ్‌ చేయాలి. తోటివారిని ఆదుకోవాలి. పుణ్యకార్యాలు చేయాలి. ఈ అయిదు సూత్రాలు ఇహలోక జీవితాన్ని సార్థకం చేస్తాయి. పరలోకంలో దేవుని కృపను పొందేలా చేస్తాయి.

మహమ్మద్‌ వహీదుద్దీన్‌

ఈ వార్తలనూ చదవండి

వృద్ధురాలి పాలిట మృత్యువులా వచ్చిన కోతి.. వీడియో చూస్తే షాకవ్వాల్సిందే..

అహ్మదాబాద్ విషాదం.. విద్యార్థినిపైకి దూసుకెళ్లిన క్రేన్.. వీడియో వైరల్

Updated Date - Sep 25 , 2026 | 03:12 AM