Share News

ఫాబ్యులస్‌... ‘ఫర్షి’

ABN , Publish Date - Apr 22 , 2026 | 05:05 AM

ఒకప్పుడు మహారాణులకే పరిమితమైన ఫర్షి షల్వార్‌ నేడు తాజా ఫ్యాషన్‌గా మారిపోయింది.పెళ్లిళ్లు, పుట్టినరోజులు మొదలైన వేడుకల్లో ధరించడానికి తగిన ఈ...

ఫాబ్యులస్‌... ‘ఫర్షి’

ఫ్యాషన్‌

ఒకప్పుడు మహారాణులకే పరిమితమైన ఫర్షి షల్వార్‌ నేడు తాజా ఫ్యాషన్‌గా మారిపోయింది.పెళ్లిళ్లు, పుట్టినరోజులు మొదలైన వేడుకల్లో ధరించడానికి తగిన ఈ విలాసవంతమైన షల్వార్‌ కథ గురించీ, ఎంపికలో అనుసరించవలసిన కిటుకుల గురించి తెలుసుకుందామా?

ఫర్షి... పర్షియన్‌ పదమైన ‘ఫార్ష్‌’ నుంచి వచ్చింది. ఫార్ష్‌ అంటే నేల అని అర్థం. ఈ డ్రస్‌ కూడా పేరుకు తగ్గట్టే నేల మీద జీరాడే పొడవుంటుంది. వెడల్పుగా, నేలను తాకే ప్యాంటు ఈ డ్రస్‌ ప్రత్యేకత. 17, 18వ శతాబ్దం నాటి మొఘల్‌ ఆస్థానంలో ప్రత్యేకించి ఉత్తరప్రదేశ్‌ సాంస్కృతిక రాజధాని, లక్నో, హైదరాబాద్‌ లాంటి ప్రాంతాల ఉన్నత వస్త్ర సంప్రదాయాలు, నేటికీ దక్షిణాసియా, గల్ఫ్‌లలోని వివాహ వస్త్రధారణను ప్రభావితం చేస్తూనే ఉన్నాయి. రాజకుటుంబ మహిళలు, ఉన్నత వర్గాలకు చెందిన మహిళలు మాత్రమే ధరించే ఫర్షి షల్వార్‌, హోదాకు చిహ్నంగా మారింది. ఆరు నుంచి పది మీటర్ల పొడవైన ఈ వస్త్రాన్ని పట్టు, బ్రొకేడ్‌, జమావర్‌, వెల్వెట్‌లతో రూపొందించి, వాటి మీద జర్దోజీ, గోటా పట్టి, సంక్లిష్టమైన బంగారు దారాల పనితనంతో అలంకరించేవారు. ఫర్షి షల్వార్‌ ధరించడం వస్త్రధారణలో భాగంగా కాకుండా, సంపదకు, కళాత్మకతకు, హోదాకు ప్రపంచంలో స్త్రీ స్థానానికి చిహ్నంగా మారింది.

ఎంపిక ఇలా...

దేశ విభజన, స్వాతంత్య్రం తదనంతరం ఫర్షి షల్వార్‌ చురిదార్‌గా మారిపోయింది పెళ్లిళ్లు, మెహంది వేడుకల్లో ప్రత్యేక ఆకర్షణగా స్థానం పొందింది. ఆలియా భట్‌, కరీనా కపూర్‌, ఖుషి కపూర్‌, సోనమ్‌ బజ్వా మొదలైన బాలీవుడ్‌ భామలు, ఈ దుస్తులకు కొత్త హంగులు జోడించి, ధరించడంతో ఇవి ప్రపంచ దృష్టిని ఆకర్షించాయి. అయితే ఈ ఫర్షి షల్వార్‌ ట్రెండ్‌ను అనుసరించాలనుకుంటే కొన్ని కిటుకులు పాటించాలి. అవేంటంటే...

  • సున్నితమైన ఎంబ్రాయిడరీ, తేలిక రంగుల్లో ఫర్షి షల్వార్‌ను పగటి వేళ పెళ్లి వేడుకలు, మెహంది ఫంక్షన్ల కోసం ఎంచుకోవాలి

  • ముదురు రంగులతో కూడిన బరువైన ఫ్యాబ్రిక్‌ ఫర్షి షల్వార్‌ను సాయంకాల వేడుకలకు పరిమితం చేయాలి

  • వినూత్నంగా కనిపించాలనుకుంటే, ఫుల్‌ లెంగ్త్‌ అనార్కలిని ఫర్షి బేస్‌తో జోడించాలి

  • ఆధునికంగా కనిపించాలనుకుంటే, లైట్‌ వెయిట్‌ టస్సర్‌ లేదా కాటన్‌, స్వల్ప హంగులతో కూడి ఫర్షి షల్వార్‌ ఎంచుకోవాలి

  • క్యాజువల్‌ లుక్‌ కోసం, బ్లాక్‌ ప్రింట్‌, స్కాలప్‌ ప్రింట్‌, డిజిటల్‌ ఫ్లోరల్స్‌ను ఎంచుకోవాలి

  • సంప్రదాయబద్ధమైన ఫర్షి లుక్‌ కోసం... జాల్‌ ప్యాటర్న్‌, బ్రొకేడ్‌ సిల్క్‌, బంగారు దారాల మోటిఫ్స్‌ బాగుంటాయి

ఇవి కూడా చదవండి:

ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్.. టీమిండియా మహిళల స్థానాలివే!

కండరాల గాయం.. ఐపీఎల్ నుంచి ఆయుశ్ మాత్రే ఔట్

Updated Date - Apr 22 , 2026 | 05:05 AM