Share News

విశ్వాసానికి పునాది

ABN , Publish Date - Nov 13 , 2026 | 01:46 AM

సువార్తను గ్రహించడం, దానిని ఆచరించడం విశ్వాసానికి పునాది. ఒక వ్యక్తి నేలను లోతుగా తవ్వాడు. బండరాయి మీద పునాది వేశాడు. ఇల్లు కట్టాడు. ఆ తరువాత వరద ముంచుకొచ్చింది....

విశ్వాసానికి పునాది

దైవమార్గం

సువార్తను గ్రహించడం, దానిని ఆచరించడం విశ్వాసానికి పునాది. ఒక వ్యక్తి నేలను లోతుగా తవ్వాడు. బండరాయి మీద పునాది వేశాడు. ఇల్లు కట్టాడు. ఆ తరువాత వరద ముంచుకొచ్చింది. ప్రవాహం ఆ ఇంటిని చాలా బలంగా తాకింది. కానీ ఆ ఇల్లు కదలలేదు, చెదరలేదు. ఎందుకంటే ఆ ఇంటి నిర్మాణం పటిష్టంగా జరిగింది. మరో వ్యక్తి పునాది లేకుండా ఇసకలో ఇల్లు కట్టుకున్నాడు. వరద ప్రవాహం రాగానే ఆ ఇల్లు కూలిపోయింది. పూర్తిగా నాశనమైపోయింది.

ఈ ఉపమానాన్ని ఏసు ప్రభువు చెబుతూ... ‘‘నా దగ్గరకు వచ్చి, నా మాటలను ఆలకించి, ఆచరణలో పెట్టేవారు రాతిపై ఇల్లు కట్టేవారిలా ఉంటారు. నా మాటలు విని కూడా వాటిని ఆచరణలో పెట్టనివారు... ఇసకలో ఇల్లు నిర్మించుకున్న వారిలా మిగులుతారు’’ అని స్పష్టం చేశాడు. మత్తయి, లూకా సువార్తలలో కనిపించే ఈ ఉపమానం గొప్ప నీతిని బోధిస్తుంది. దేవుని వాక్యాలను కేవలం వింటే సరిపోదు. వాటిని ఆచరణలో పెట్టినప్పుడే జీవితానికి రక్షణ, స్థిరత్వం లభిస్తాయి. రాతి బండ మీద ఇల్లు కట్టుకున్న వ్యక్తి బుద్ధిమంతుడు. అతను దేవుని వాక్యాన్ని విని, దానికి అనుగుణంగా జీవించేవాడు. కష్టాలు, పరీక్షలు సమస్యలు ఎదురైనా... అతని విశ్వాసం చెక్కుచెదరదు. ఎందుకంటే అతని ‘జీవితం’ అనే ఇల్లు ‘దేవుని వాక్యం’ అనే బలమైన పునాది మీద ఆధారపడి ఉంటుంది. ఇక... దేవుని వాక్యాన్ని విని కూడా దాన్ని నిర్లక్ష్యం చేస్తూ... తన ఇష్టానుసారం బతికేవాడు ఇసుక మీద ఇల్లు కట్టిన మూర్ఖుడితో సమానం. ఇల్లు పైకి అందంగా కనిపించవచ్చు, కానీ కష్టాలు, పరీక్షలు వచ్చినప్పుడు అది కూలిపోతుంది. నష్టం చాలా దారుణంగా ఉంటుంది. సమస్యలు అందరికీ సమానమే. కానీ విశ్వాసం, ఆచరణ అనే పునాది ఉన్నవారే వాటిని తట్టుకొని నిలబడగలరు.

ఈ వార్తలనూ చదవండి:

ఎన్విడియా సీఈఓ ఎఫైర్ గురించి కూతురికి ముందే తెలుసా?

ఎన్విడియా సీఈవో జెన్సెన్ హువాంగ్‌కు పదవీ గండం.. తెరపైకి మరో అఫైర్..

Updated Date - Nov 13 , 2026 | 01:46 AM