Share News

విశ్వాసులకు నిరాశ ఉండదు

ABN , Publish Date - Jun 19 , 2026 | 04:37 AM

అల్లా్‌హపై నిర్మలమైన విశ్వాసానికి సంబంధించిన కథ ఇది. ఒక ప్రాంతంలో ఆ సంవత్సరం తీవ్రమైన కరువు వచ్చింది. నెలలు గడుస్తున్నా వర్షాలు కురియలేదు. పొలాలు ఎండిపోయాయి...

విశ్వాసులకు నిరాశ ఉండదు

సందేశం

అల్లా్‌హపై నిర్మలమైన విశ్వాసానికి సంబంధించిన కథ ఇది. ఒక ప్రాంతంలో ఆ సంవత్సరం తీవ్రమైన కరువు వచ్చింది. నెలలు గడుస్తున్నా వర్షాలు కురియలేదు. పొలాలు ఎండిపోయాయి. ప్రజలు నిరాశలో మునిగిపోయారు. ఒక రోజు ఒక గ్రామంలోని మసీదులో ఇమామ్‌ అందరినీ పిలిచి ‘‘మనం అల్లాహ్‌ ముందు తౌబా (పశ్చాత్తాపం) వ్యక్తపరచి ప్రార్థన చేద్దాం’’ అని చెప్పారు. మరుసటిరోజు గ్రామస్తులందరూ ఒక బహిరంగ ప్రదేశానికి చేరుకొని ‘నమాజ్‌ ఎ ఇస్తిస్కా’ (వర్షం కోసం ప్రత్యేక ప్రార్థన) చేశారు.

అక్కడికి ఒక చిన్న బాలుడు గొడుగు పట్టుకొని వచ్చాడు. అది చూసి జనం అందరూ నవ్వారు. ‘‘మేఘాలు ఎక్కడా లేవు. వర్షం పడే సూచనలు లేవు. ఇలాంటి సమయంలో గొడుగు ఎందుకు తెచ్చావు?’’ అని అడిగారు. ‘‘మనం అల్లా్‌హను వర్షం కోసం అడగడానికి వచ్చాం కదా! అల్లాహ్‌ తప్పకుండా వర్షాన్ని కురిపిస్తాడు. అందుకే గొడుగు తీసుకు వచ్చాను’’ అని చెప్పాడు ఆ బాలుడు. ఆ బాలుడి విశ్వాసాన్ని గమనించి అందరూ ముగ్ధులయ్యారు. కొద్దిసేపటికే ఆకాశం మేఘాలతో నిండిపోయింది. భారీ వర్షం కురిసింది.

ఈ కథ మనకు ఒక గొప్ప పాఠాన్ని నేర్పుతుంది. అల్లా్‌హను అడిగేటప్పుడు సంపూర్ణ విశ్వాసంతో అడగాలి. నిజమైన ఈమాన్‌ (అల్లా్‌హపై విశ్వాసం) ఉన్న హృదయం ఎన్నడూ నిరాశ చెందదు. వారిపై అల్లాహ్‌ కరుణ కురుస్తూనే ఉంటుంది.


‘అల్లాహ్‌ మానవులకు ప్రసాదించిన అనేక వరాల్లో వర్షం ఒకటి’ అని ఇస్లాం ధర్మం చెబుతోంది. ఎండాకాలంలో ఎండిపోయి నిర్జీవంగా కనిపించే భూమి... వర్షం కురిసాక పచ్చదనంతో కళకళలాడుతుంది. దీన్ని పునరుత్థానానికి ఉదాహరణగా దివ్యఖుర్‌ఆన్‌ పేర్కొంది. ‘‘అల్లాహ్‌ ఆకాశం నుంచి నీటిని కురిపించాడు. నిర్జీవంగా పడి ఉన్న భూమికి... దాని ద్వారా ప్రాణం పోశాడు’’ అని పేర్కొంటూ... ఎండిపోయిన భూమికి జీవాన్ని ఇచ్చిన అల్లాహ్‌... మరణించిన మానవులను కూడా మళ్ళీ సజీవులను చేయగలడనే సందేశాన్ని ఇస్తోంది. ‘‘పచ్చని పంటలకు దోహదం చేసేది, సమస్త జీవరాశుల దాహాన్ని తీర్చే నీటిని అందించేది వర్షమే. మేము ఆకాశం నుంచి పవిత్రమైన నీటిని కురిపించాము’’ అని ఖుర్‌ఆన్‌లోని ఒక ఆయత్‌లో అల్లాహ్‌ ప్రకటించాడు. వర్షం తాలూకు పవిత్రతను ఆ ఆయత్‌ తెలియజేస్తోంది.

ప్రతి వర్షపు చుక్కలోనూ అల్లాహ్‌ దయ దాగి ఉంది. ఎంతటి శక్తిమంతుడైనా ఒక వర్షపు చుక్కను సృష్టించలేడు. వర్షం కేవలం ఒక ప్రకృతిపరమైన సంఘటన కాదు... అల్లాహ్‌ అపార కరుణకు నిదర్శనం. కాబట్టి వర్షం కురిసినప్పుడు మానవ హృదయాలలో కృతజ్ఞతా భావం కలగాలి. నమాజ్‌ కోసం పిలుస్తూ చేసే ప్రార్థన (అజాన్‌), వర్షం కోసం చేసే ప్రార్థన ఎన్నటికీ తిరస్కరణకు గురికావని దైవప్రవక్త మహమ్మద్‌ చెబుతూ వర్షం పడుతున్నప్పుడు అల్లా్‌హను స్మరించాలని, కుటుంబం కోసం, సమాజం కోసం దేశం కోసం ప్రార్థన చేయాలని సూచించారు. ‘‘ఓ అల్లాహ్‌! ఈ వర్షాన్ని మాకు ప్రయోజనకరమైనదిగా చెయ్యి’’ అని ఆయన ప్రార్థించేవారు. వర్షం కురిసినప్పుడు అల్లా్‌హకు కృతజ్ఞత తెలపాలి. కరువు వచ్చినప్పుడు నిరాశ చెందకుండా అల్లా్‌హపై నమ్మకం ఉంచాలి. వర్షం వల్ల పంటలు బాగా పండినప్పుడు పేదలకు సాయం చేయాలి. ప్రతి వర్షపు చుక్కలో అల్లాహ్‌ కరుణ దాగి ఉంది. దాన్ని కళ్ళతో చూసేవారు చాలామంది ఉంటారు. కానీ హృదయంతో చూసేవారే నిజమైన విశ్వాసులు.

మహమ్మద్‌ వహాదుద్దీన్‌

ఇవి కూడా చదవండి..

కేబినెట్ భేటీలో రైతు భరోసా నిధుల విడుదలకు ముహూర్తం ఫిక్స్

పంట గిట్టుబాటు ధరలపై సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఉన్నతస్థాయి సమీక్ష

Read Latest TG News And Telugu News

Updated Date - Jun 19 , 2026 | 04:37 AM