భగవంతుడి లీలల్లో భాగమవుదాం
ABN , Publish Date - Nov 06 , 2026 | 06:07 AM
పండుగలను మనం ఆనందంగా, ఉత్సాహంగా జరుపుకొంటాం. కానీ ఆ పండుగలకు, భగవంతుడికి ఉన్న సంబంధమేమిటో తెలుసుకోవడం ప్రధానం...
హరేకృష్ణ
పండుగలను మనం ఆనందంగా, ఉత్సాహంగా జరుపుకొంటాం. కానీ ఆ పండుగలకు, భగవంతుడికి ఉన్న సంబంధమేమిటో తెలుసుకోవడం ప్రధానం. ఆ భగవత్సంబంధాన్ని తెలుసుకొని, సరైన అవగాహనతో, భక్తిభావనతో వాటిని నిర్వహించుకోవాలి. తద్వారా ఎంతో ఆధ్యాత్మిక ప్రయోజనాన్ని పొంది, ఆ భగవంతుడి లీలల్లో మనం కూడా భాగమయ్యే భాగ్యాన్ని పొందగలం. ఉత్సవాల్లోని ఆంతర్యాన్ని గ్రహించినప్పుడు... ఎలాంటి అహంకారాలకు, గొడవలకు తావులేకుండా సామరస్యంగా వేడుకలు చేసుకోగలం.
దీపావళి పర్వదినం వెనుక ఎన్నో కథలున్నాయి. వాటిలో... రావణ సంహారం తరువాత అయోధ్య నగరంలోకి శ్రీరాముడు ప్రవేశించి, సింహాసనాన్ని అధిష్టించడం, అల్లరి పిల్లవాడైన చిన్ని కృష్ణుణ్ణి యశోదమ్మ రోలుకు కట్టివేయడం... ఈ రెండిటి గురించి వివరంగా తెలుసుకుందాం.
శ్రీరాముడి ఆగమనం
శ్రీరామచంద్రుడు అయోధ్యకు తిరిగి వచ్చిన సందర్భాన్ని ‘భ్రాత్రాభినన్దితః సోథ సోత్సవాం ప్రావిశత్ పురీమ్’ అనే శ్లోకంలో ‘శ్రీమద్భాగవతం’ వర్ణించింది. సోదరుడైన భరతుడు ఆహ్వానించగా, ఉత్సవశోభితమైన అయోధ్యలోకి శ్రీరాముడు ప్రవేశించాడని పేర్కొంది. ఆనాటి ఆ ఉత్సవమే.. నేటికీ దీపావళిగా కొనసాగుతోంది. శ్రీరామచంద్రుడి రాకతో అయోధ్య పురవాసులు ఎంతగానో పులకించిపోయారు. అప్పుడే గాఢ నిద్ర నుంచి మేలుకున్నట్టు భావించారు. వీధులన్నిటినీ వైభవంగా అలంకరించారు. ఇళ్ళ ముంగిళ్ళలో రంగురంగుల ముగ్గులు వేశారు. వీధుల చివర తోరణాలు కట్టారు. మంగళవాయిద్యాలతో రాముణ్ణి స్వాగతించారు. ఆ విధంగా త్రేతాయుగంలో ఆరంభమైన దీపావళి... వేల సంవత్సరాలుగా కొనసాగుతోంది.
దామోదర లీల
ఈ ఉత్సవానికి ఉన్న మరో విశేషం దామోదర లీల. కార్తికమాసంలో దీపావళి రోజున సంభవించిన ఆ లీల కారణంగానే... కార్తిక మాసాన్ని ‘దామోదర మాసం’ అంటారు. కృష్ణుడికి ‘దామోదరుడు’ అనే పేరు ఎలా వచ్చిందో ‘హరివంశం’ గ్రంథం ‘స చ తేనైవ నామ్నా తు కృష్ణో వై దామ బంధనాత్/ గోష్టే దామోదర ఇతి గోపీభిః పరిగీయతే’ అనే శ్లోకంలో వివరించింది. సంస్కృతంలో ‘దామం’అంటే తాడు అని, ‘ఉదరం’ అంటే పొట్ట అని అర్థం. కొంటె చేష్టలు చేస్తున్న చిన్ని కృష్ణుడి ఉదరాన్ని తల్లి యశోద తాడుతో రోకలికి కట్టి వేసింది. ఆ లీలా వృత్తాంతం కారణంగా శ్రీకృష్ణుడికి ఏర్పడిన నామమే... దామోదర. ‘దీపావళి’ లేదా ‘దీప-మాలిక’ తిథి నాడే దామోదర లీల కూడా జరిగిందని శ్రీల సనాతన గోస్వామి రచించిన ‘బృహద్వైష్ణవ తోషని’ అనే గ్రంథం ఆధారంగా ఆచార్య శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్ వెల్లడించారు. దీపావళి అంటే ‘దీపాల వరుస’ అని అర్థం. ఆ రోజున ప్రజలందరూ దీపాలను వెలిగించి, భగవంతుడికి సమర్పిస్తారు. ఆ తరువాత వాటిని ఇంటి లోపల, ఇంటి ప్రాంగణాల్లో వరుసలలో అమరుస్తారు. కొన్ని చోట్ల దీపావళిని నూతన సంవత్సర ప్రారంభదినంగా కూడా పాటిస్తారు.
ఇలా చేయండి
ఇంటి ముందు శుభ్రం చేసి ముగ్గులు వేయండి. ముగ్గులలో తామరలు, నెమలి పింఛాలు, మంగళకరమైన ఆకృతులను చేర్చుకోవచ్చు.
దామోదరుడికి నేతి దీపాన్ని సమర్పించండి. ఇంటి ముంగిళ్ళను దీపాలతో అలంకరించండి.
శ్రీరామచంద్రుడి పట్టాభిషేక మహోత్సవాన్ని బాణాసంచాతో, దీపాలు వెలిగించి జరుపుకోండి.
పాలు, వెన్న, నెయ్యితో చేసిన మిఠాయిలను శ్రీకృష్ణుడికి నివేదించండి. వాటిని కుటుంబ సభ్యులకు, బంధువులకు ఇరుగుపొరుగు వారికి పంచిపెట్టండి. ప్రసాద వితరణ శ్రీకృష్ణునికి ఎంతో ప్రీతికరం.
శ్రీసత్యగౌర చంద్రదాస ప్రభూజీ
అధ్యక్షుడు, హరే కృష్ణ మూవ్‌మెంట్,
హైదరాబాద్, 9396956984
ఈ వార్తలూ చదవండి
ఏపీ సీఎంఆర్ఎఫ్‌కు విట్ యూనివర్సిటీ రూ.కోటి విరాళం..
ఏపీ ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు.. మధ్యాహ్నం 1 గంట వరకు పోలిం