Share News

వెయ్యి జ్యోతులు వెలిగిద్దాం

ABN , Publish Date - Nov 06 , 2026 | 06:04 AM

ఒక ప్రమిదలో దీపం వెలగాలంటే... వత్తిలో కొంత భాగం నూనెలో మునిగి ఉండాలి. ఒకవేళ వత్తి పూర్తిగా నూనెలో మునిగిపోతే... అది వెలుగును ఇవ్వలేదు....

వెయ్యి జ్యోతులు వెలిగిద్దాం

చింతన

ఒక ప్రమిదలో దీపం వెలగాలంటే... వత్తిలో కొంత భాగం నూనెలో మునిగి ఉండాలి. ఒకవేళ వత్తి పూర్తిగా నూనెలో మునిగిపోతే... అది వెలుగును ఇవ్వలేదు. జీవితం కూడా ఆ వత్తిలాంటిదే. మీరు ఈ ప్రపంచంలోనే ఉంటూ... అదే సమయంలో దాని ప్రభావానికి లోనవకుండా ఉండాలి. లౌకిక విషయాల్లో పూర్తిగా మునిగిపోతే... మీ జీవితంలో ఆనందాన్ని, జ్ఞానాన్ని పొందలేరు. ప్రపంచంతో కలిసి సాగుతూనే... అందులోని లౌకిక విషయాల్లో నిమగ్నం కాకుండా ఉండడం ద్వారా... ఆనందానికి, జ్ఞానానికి ప్రతీకగా, వెలుగులా మనం మారవచ్చు.

అమేయ శక్తి... కాళీ

దీపావళికి సంబంధించి ఎన్నో కథలు ఉన్నాయి. అవి ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కో విధంగా ఉంటాయి. ప్రతి కథలోనూ మనం నేర్చుకోవాల్సిన ఒక గొప్ప సందేశం దాగి ఉంది. దీపావళి ముందురోజును ‘కాళీ చౌదస్‌’ లేదా ‘నరక చతుర్దశి’గా జరుపుకొంటారు. ‘కాళీ’ అంటే జ్ఞానానికి ప్రతీక. అమె మనలోని జ్ఞానాన్ని మేలుకొలిపి, సృష్టి తాలూకు అనంతమైన విశాలత్వాన్ని తెలియజేస్తుంది. వేలాది నక్షత్రాలను మనం రాత్రివేళ మాత్రమే చూడగలం. రాత్రి లేకపోతే... ఎన్నో గ్రహాలు, నక్షత్ర మండలాలతో నిండిన విశ్వం ఎంత విశాలమైనదో మనకు ఎప్పటికీ తెలిసేది కాదు. పగటిపూట మనకు కనిపించేవి సాపేక్షంగా చిన్న విషయాలే. కానీ రాత్రివేల మనకు కనిపించేది బ్రహ్మాండం... మొత్తం విశ్వం, పాలపుంత, ఈ సృష్టి తాలూకు వైభవం. చిన్న చిన్న విషయాల మీద దృష్టిని తగ్గించినప్పుడే మరింత గొప్ప విషయాలను చూడగలుగుతాం. మన కంటిలోని నల్లని కనుపాప కూడా చీకటిగానే ఉంటుంది. దాన్ని కూడా ‘కాళీ’ అంటారు. అది మన కంటిలో లేకపోతే... మనం దేన్నీ చూడలేం. కాళీమాతను మాటల్లో వర్ణించలేం. ఆమె బుద్ధికి, వాక్కుకు అతీతమయినది. అందుకే ఆమెను నాలుక బయటకు చాపిన రూపంలో చిత్రిస్తారు. ఆమె శివుడిపై నిలబడి ఉంటుంది. శివుడు నిశ్శబ్దానికి, అనంతమైన చైతన్యానికి ప్రతీక. మనలోని ఆత్మస్వరూపమైన శివతత్త్వాన్ని, అద్వైత స్థితిని, పరమ నిశ్శబ్దాన్ని మనం అనుభవించినప్పుడు... మనలో మేల్కొనే అమేయమైన శక్తే కాళీ. ఆ శక్తి మనల్ని అంధకారం నుంచి వెలుగువైపు, ఉన్నతమైన జ్ఞానం వైపు నడిపిస్తుంది.


నరకాసుర సంహారం

దీపావళికి సంబంధించిన మరో ప్రసిద్ధమైన కథ... నరకాసుర సంహారం. నరకాసురుడు దుష్టుడైన రాజు. అతని కారణంగా ప్రజలు ఎన్నో కష్టాలు అనుభవించేవారు. మహా శక్తిమంతుడైన అతణ్ణి ఎవరూ ఓడించలేకపోయారు. స్త్రీ చేతిలో మాత్రమే అతనికి మరణం సంభవించాలని వరం కోరుకున్నాడు. స్త్రీలు తనను ఏమీ చేయలేరనేది అతని అహంకారం. చివరకు శ్రీకృష్ణుడి భార్యలలో ఒకరైన సత్యభామ అతనితో యుద్ధం చేసి సంహరించింది. ఈ కథలోని పేర్లలో కూడా గొప్ప ఆధ్యాత్మికమైన అర్థం ఉంది. ‘సత్య’ అంటే నిజం లేదా సత్యం. ‘భామ’ అంటే ప్రియమైనది. ‘నరకం’ అంటే దుఃఖమయమైన స్థితి. సత్యం, ప్రేమ, శరణాగతి ద్వారానే నరకప్రాయమైన స్థితిని నిర్మూలించగలం. ప్రేమ, శరణాగతి అనేవి మహిళల సహజమైన గుణాలు. అందుకే సత్యం, ప్రేమలకు ప్రతిరూపమైన సత్యభామ మాత్రమే నరకాసురుణ్ణి సంహరించి, లోకానికి వెలుగు తీసుకురాగలిగింది. మరణించే సమయంలో నరకాసురుడు ‘‘నా మరణాన్ని ప్రజలందరూ దీపాలు వెలిగించి, మిఠాయిలు పంచుకుంటూ ఆనందంగా జరుపుకోవాలని కోరుకుంటున్నాను. నేను ఎంతో మందికి బాధ కలిగించాను నా నిష్క్రమణను అందరూ ఆనందంగా జరుపుకోవాలి’’ అన్నాడు. అది అతని చివరి కోరిక. అతనిలో కలిగిన జ్ఞానోదయానికి నిదర్శనం.

దీపావళి మన జీవితాల్లో జ్ఞానజ్యోతిని స్మరించుకొనే పండుగ. కొందరిలో సహనం, మరికొందరిలో ప్రేమ, ధైర్యం, శక్తి, ఉదారత లేదా ప్రతి ఒక్కరినీ కలిపి ఉంచే సామర్థ్యం ఉంటుంది. మనం వెలిగించే ప్రతి దీపం ఈ మంచి గుణాలకు ప్రతీక. ఒక దీపంతో సంతృప్తి చెందకండి. వెయ్యి దీపాలు వెలిగించండి. మీ చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరిలో మంచితనాన్ని మళ్లీ మేలుకొలపండి. మీలోని ప్రతి కోణం మీదా మీ జ్ఞానకాంతిని ప్రసరింపజేయండి. మనలోని అన్ని సద్గుణాలు మేలుకున్నప్పుడే... నిజమైన దీపావళి.

శ్రీశ్రీరవిశంకర్‌

ఆర్ట్‌ ఆఫ్‌ లివింగ్‌

ఈ వార్తలూ చదవండి

ఏపీ సీఎంఆర్ఎఫ్‌కు విట్ యూనివర్సిటీ రూ.కోటి విరాళం..

ఏపీ ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు.. మధ్యాహ్నం 1 గంట వరకు పోలిం

Updated Date - Nov 06 , 2026 | 06:04 AM