పట్టుచీరలపై అదిరే హారాలు...
ABN , Publish Date - Nov 08 , 2026 | 03:18 AM
దీపావళి పండుగ రోజున సాయంత్రం పూట లక్ష్మీ పూజకు మహిళలంతా చక్కని పట్టుచీరలు కట్టుకుని మురిసిపోతుంటారు. వాటిపై పొడవాటి హారాలు వేసుకుంటే...
దీపావళి పండుగ రోజున సాయంత్రం పూట లక్ష్మీ పూజకు మహిళలంతా చక్కని పట్టుచీరలు కట్టుకుని మురిసిపోతుంటారు. వాటిపై పొడవాటి హారాలు వేసుకుంటే మరింత అందంగా కనిపిస్తారు. పెద్ద పెద్ద జరీ బోర్డర్లు ఉండే కాంజీవరం, బెనారస్ తదితర పట్టుచీరలమీద గ్రాండ్‌గా కనిపించే హారాలపై ఓ లుక్కేద్దామా!
కాసులపేరు
లక్ష్మీకాసులను ఒకదానిపై మరోటి పేర్చి కూర్చిన ఈ కాసులపేరు... ఎరుపు, పసుపు, ఆకుపచ్చ, నీలం రంగు పట్టుచీరలపై చక్కగా నప్పుతుంది. ధర్మవరం, గద్వాల, ఉప్పాడ చీరలమీద దీన్ని ఎంపిక చేసుకోవచ్చు. అలాగే మ్యాచింగ్ నెక్లెస్, పెద్ద జుంకాలు పెట్టుకుని బంగారు గాజులు వేసుకుంటే ఎలిగెంట్ లుక్ వచ్చేస్తుంది. కాసుల మధ్య సీజెడ్‌లు, పచ్చలు, కెంపులు పొదిగిన డిజైన్లు కూడా ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి.
గుత్త పూసల హారం
గుత్తులుగా వేలాడే ముత్యాలే ఈ హారం ప్రత్యేకత. ముదురు రంగు పట్టుచీరలన్నింటి మీద దీన్ని ధరించవచ్చు. చెవులకు ముత్యాల హ్యాంగింగ్స్ లేదా చాంద్‌బాలీలను ఎంపిక చేసుకుంటే మరింత అందంగా కనిపించవచ్చు.
రాయల్ పెండెంట్ హారం
లక్ష్మీ దేవి, రామ పరివారం, రాధాకృష్ణులు, జంట నెమళ్లు లేదా హంసలతో రూపొందించిన భారీ పెండెంట్‌లతో కూడిన హారాలు పట్టుచీరలమీద రాయల్ లుక్‌నిస్తాయి. ముత్యాలు, పచ్చలు, కెంపులు, పగడాలను వరుసలుగా పేర్చి నక్షీ బాల్స్‌ను చేర్చి డిజైన్ చేసిన రాయల్ పెండెంట్ హారాలను మహిళలు ఇష్టంగా కొనుగోలు చేస్తున్నారు.
చంద్రహారం
ఏ పట్టుచీరమీదనైనా చంద్రహారం అద్భుతంగా నప్పుతుంది. ప్రస్తుతం పెండెంట్ చంద్రహారాలు ట్రెండింగ్‌లో ఉన్నాయి. దీనితోపాటు మెడలో సింపుల్ చోకర్, మ్యాచింగ్ జుంకాలతోపాటు చేతులకు గోట్ మోడల్ బ్యాంగిల్స్ ఎంపిక చేసుకుంటే గ్రేస్‌ఫుల్‌గా కనిపించవచ్చు.
మామిడి పిందెల హారం
యాంటిక్ ఫినిషింగ్‌తో అందంగా కనిపించే మామిడి పిందెల హారం.. జరీ బుటాలతో నిండిన పట్టుచీరలమీద చక్కగా నప్పుతుంది. సీజెడ్‌లు, కుందనాలు, గుట్టపూసలు చేర్చి రూపొందించిన డిజైన్లకు డిమాండ్ అధికంగా ఉంటోంది. లైట్ వెయిట్ క్రోచ్ వర్క్‌తో రూపొందించిన మామిడి పిందెల హారాలు ఎక్కువసేపు ధరించడానికి అనువుగా ఉంటాయి.
ఈ వార్తలు కూడా చదవండి
రష్యా-ఉక్రెయిన్ యుద్ధానికి ముగింపు.. భారీ ఒప్పందం రాబోతోందన్న ట్రంప్..
ఉత్తరాఖండ్ మంత్రి రేఖా ఆర్య భర్త అరెస్ట్.. నిందితుడిపై 44 కేసులు..