Share News

ఆ తాళం తెరుద్దాం

ABN , Publish Date - Feb 06 , 2026 | 03:48 AM

ప్రతిరోజూ ఆసుపత్రుల్లో ఒక నిశ్శబ్దమైన సత్యాన్ని మేము గమనిస్తున్నాం. చాలామంది రోగులు బాధపడుతున్నది వారికి మందులు సరిపడక కాదు, క్రమశిక్షణ వారి జీవితాల్లోంచి నెమ్మదిగా...

ఆ తాళం తెరుద్దాం

యోగా

ప్రతిరోజూ ఆసుపత్రుల్లో ఒక నిశ్శబ్దమైన సత్యాన్ని మేము గమనిస్తున్నాం. చాలామంది రోగులు బాధపడుతున్నది వారికి మందులు సరిపడక కాదు, క్రమశిక్షణ వారి జీవితాల్లోంచి నెమ్మదిగా నిష్క్రమించడం వల్ల. ఆధునికమైన అనారోగ్యాలు చాలావరకూ హఠాత్తుగా సంభవించిన ప్రమాదాలు కావు. అవి క్రమరాహిత్యమైన జీవనం, ఒత్తిడిని నిర్వహించుకోకపోవడం, భావోద్వేగపరమైన అసమతుల్యత, అంతర్గత శ్రేయస్సును నిర్లక్ష్యం చెయ్యడం లాంటి వాటివల్ల క్రమంగా సంభవించిన పరిణామాలు. వైద్య శాస్త్రం అపారంగా పురోగమించినప్పటికీ, మానవుల జీవన నాణ్యతని నిర్ణయించే ఒక శాశ్వత సూత్రం ఎప్పటికీ కొనసాగుతుంది

అదే క్రమశిక్షణ.

గుండె నేర్పే పాఠం

క్రమశిక్షణను తరచుగా శిక్షగానో, నియంత్రణగానో, కఠినమైన జీవన నియమాలుగానో అపోహపడుతూ ఉంటారు. వాస్తవానికి, క్రమశిక్షణ స్వీయ సంరక్షణకు ఒక రూపం. అది మనల్ని బలహీనపరిచేవాటికి బదులు బలపరిచేవాటిని ఎంపిక చేసుకొనే సామర్థ్యం. క్రమశిక్షణ భారం కాదనీ, దీర్ఖకాలిక ఆరోగ్యాన్ని, ఆనందాన్ని అందించే రహస్యమైన తాళం చెవి అనీ కార్డియాలజిస్టుగా, ‘హార్ట్‌ఫుల్‌నెస్‌’ ధ్యాన అభ్యాసకుడిగా నా అనుభవం ద్వారా గ్రహించాను. మనిషి గుండె రోజూ విరామం లేకుండా, విసుక్కోకుండా అద్భుతమైన కచ్చితత్వంతో రోజుకు దాదాపు లక్షసార్లు కొట్టుకుంటుంది. పరిపూర్ణమైన లయ ప్రాణాల్ని నిలబెడుతుంది. ఆ లయలో చిన్న అంతరాయం కలిగినా మనుగడకి ముప్పు కలుగుతుంది. గుండె మనకు ఒక ముఖ్యమైన పాఠాన్ని నిశ్శబ్దంగా నేర్పుతోంది - ఎక్కడ లయ, క్రమశిక్షణ ఉంటాయో అక్కడ జీవితం వర్ధిల్లుతుంది.

సహజ సమతుల్యత కోసం

దురదృష్టవశాత్తూ ఆధునిక జీవన శైలి సహజసిద్ధమైన లయకు దూరమయ్యాయి. వేళాపాళాలేని నిద్ర, అనారోగ్యమైన ఆహార అలవాట్లు, నిశ్చలమైన జీవితం, తీవ్రమైన ఒత్తిడి లాంటివి రక్తపోటు, మధుమేహం, గుండె జబ్బుల్లాంటి జీవనశైలి వ్యాధుల మహమ్మారిని సృష్టిస్తున్నాయి. సహజసిద్ధమైన సమతుల్యతను పునరుద్ధరించుకోవడానికి ‘హార్ట్‌ఫుల్‌నెస్‌’ ధ్యానం సాయపడుతుంది. ధ్యానం ఒత్తిడిని తగ్గిస్తుందని, గుండె లయను స్థిరపరుస్తుందని, సమగ్ర శ్రేయస్సును ప్రోత్సహిస్తుందని పరిశోధన, వైద్యపరమైన పరిశీలనలు చెబుతున్నాయి. మనం మన జీవనశైలిని క్రమబద్ధీకరించుకుంటే శరీరం, మనస్సు సహజంగా సామరస్యానికి తిరిగి వస్తాయని ‘హార్ట్‌ఫుల్‌నెస్‌’ రచనలు స్పష్టం చేస్తున్నాయి. ఈ రోజుల్లో మనిషి మెదడు నిరంతరం అతి ప్రేరేపణకు గురి అవుతోంది. సోషల్‌ మీడియా, పోటీ, ఉరుకుల పరుగుల జీవనం మెదడును నిరంతర ఆందోళన స్థితిలో ఉంచుతున్నాయి. ఒత్తిడి, ఆందోళన, నిస్పృహ, అలసట నిత్యజీవిత వాస్తవాలుగా మారాయి.


‘క్లీనింగ్‌’తో స్పష్టత, స్వచ్ఛత

‘హార్ట్‌ఫుల్‌నెస్‌’ ఒక సున్నితమైన మార్గాన్ని మనకు అందిస్తోంది. క్రమం తప్పకుండా ధ్యానం చేయడం ద్వారా... సహజసిద్ధంగా స్థిరపడడాన్ని మనసు క్రమంగా నేర్చుకుంటుంది. ఆలోచనలు స్పష్టంగా మారుతాయి, భావోద్వేగాలు సమతుల్యం అవుతాయి, నిర్ణయ సామర్థ్యం మెరుగుపడుతుంది. మనసుకు నిజమైన క్రమశిక్షణ బలవంతపు నియంత్రణ ద్వారా కాదు, సరైన దిశానిర్దేశం ద్వారా వస్తుందని షాజహాన్‌పూర్‌కు చెందిన శ్రీ రామ్‌చంద్ర చెప్పారు. మానవ సంబంధాలు ఎక్కువగా భావోద్వేగ సమతుల్యత మీద ఆధారపడతాయి. ‘క్లీనింగ్‌’ అనే సరళమైన అభ్యాసాన్ని ‘హార్ట్‌ఫుల్‌నెస్‌’ ప్రవేశపెట్టింది, ఇది పేరుకుపోయిన భావోద్వేగ ముద్రలను, మానసిక భారాన్ని తొలగించడానికి ఇది సాయపడుతుంది. హృదయం అనే అద్దం మీద పేరుకుపోయిన దుమ్మును ‘క్లీనింగ్‌’ తొలగిస్తుందని, స్పష్టత, స్వచ్ఛత ఉద్భవించడానికి దోహదపడుతుందని ‘హార్ట్‌ఫుల్‌నెస్‌’ గైడ్‌ దాజీ వివరించారు. శారీరకమైన, భావోద్వేగపరమైన అభివృద్ధికి మాత్రమే కాదు, ఆధ్యాత్మికమైన ఎదుగుదలకు కూడా క్రమశిక్షణ దోహదం చేస్తుంది. వ్యక్తులు తమ అంతరాత్మతో అనుసంధానం కావడానికి ‘హార్ట్‌ఫుల్‌నెస్‌’ ధ్యానం సాయపడుతుంది, అందులో శాంతి, సంతృప్తి సహజంగానే ఉంటాయి. స్వీయ అభివృద్ధి కోసం ప్రేమలోంచి పుట్టిన క్రమశిక్షణ శ్రమలేనిదిగా, ఆనందదాయకంగా మారుతుంది.


స్థిరమైన దశలతో...

మార్పు అనేది రోజువారీ ధ్యానం, క్రమబద్ధంగా నిద్రపోయే అలవాట్లు, శారీరక శ్రమ, భావోద్వేగ శుద్ధి, స్వీయ పర్యావలోచన లాంటి సరళమైన, స్థిరమైన చర్యలతో ప్రారంభమవుతుంది. క్రమశిక్షణ నిర్మాణం ఒక రోజులో జరిగిపోదు, అది నిత్యం కొనసాగుతుంది. ఆధునిక సమాజం వేగాన్ని, విజయాన్ని ఆనందిస్తోంది. అయితే, క్రమశిక్షణ లేకపోతే ఈ ప్రగతి ఒత్తిడికి, అనారోగ్యానికి దారితీస్తుంది. క్రమశిక్షణ... చికిత్స అవసరం కావడానికి ఎంతో ముందుగానే బాధలను నివారిస్తుంది. క్రమశిక్షణ తరచుగా నియంత్రణలా కనిపిస్తుంది, కానీ నిజానికి అది స్వేచ్ఛను... వ్యాధుల నుంచి, భావోద్వేగపరమైన కల్లోలం నుంచి, అంతర్గత ఘర్షణ నుంచి స్వేచ్ఛను సృష్టిస్తుంది. ‘హార్ట్‌ఫుల్‌నెస్‌’ అభ్యాసాల ద్వారా క్రమశిక్షణాయుతమైన జీవనాన్ని అనుసరిస్తే... ఆరోగ్యాన్ని, ఆనందాన్ని అందించే రహస్యమైన తాళాన్ని వ్యక్తులు తెరవగలుగుతారు.

డాక్టర్‌ శరత్‌రెడ్డి, కార్డియాలజిస్ట్‌,

ట్రైనర్‌, హార్ట్‌ఫుల్‌నెస్‌. 9440087532

ఈ వార్తలు కూడా చదవండి

తిరుమల లడ్డూ వ్యవహారంలో ఏక సభ్య కమిషన్ ఏర్పాటు: సీఎం

ఏపీ హైకోర్టును ఆశ్రయించిన మాజీ మంత్రి అంబటి రాంబాబు

Updated Date - Feb 06 , 2026 | 03:48 AM