తాళ వనంలో రాక్షస గాడిద
ABN , Publish Date - Nov 20 , 2026 | 03:17 AM
బలరామకృష్ణుల స్నేహితులైన శ్రీదాముడు, సుబలుడు తదితరులు ఒకసారి వారి దగ్గరకు వచ్చి ‘‘మన బృందావనానికి సమీపంలోనే తాటిచెట్ల వనం ఒకటి ఉంది. వాటి పండ్లు...
బలరామకృష్ణుల స్నేహితులైన శ్రీదాముడు, సుబలుడు తదితరులు ఒకసారి వారి దగ్గరకు వచ్చి ‘‘మన బృందావనానికి సమీపంలోనే తాటిచెట్ల వనం ఒకటి ఉంది. వాటి పండ్లు భలే రుచిగా ఉంచాయి. వెళ్ళి తిందాం పదండి’’ అని తొందర చేశారు. వారు ‘‘సరే’’ అన్నారు. నేస్తా లందరూ జట్టుగా బయలుదేరారు. తీరా అక్కడికి వెళ్ళాక తెలిసింది... ఆ వనంలో ఒక రాక్షసుడు గాడిద రూపంలో ఉన్నాడని. మహా బలశాలి అయిన ఆ రాక్షసుడి పేరు ధేనుకాసురుడు. అతణ్ణి పోలిన అనేకమంది గార్దభ రాక్షసులు అక్కడ ఉన్నారు. ఆ వనంలోకి వెళ్ళినవారిని చంపుతున్నారు.
పీడ వదిలింది...
అయినా బలరామకృష్ణులు భయడకుండా... స్నేహితులతో కలిసి ఆ వనంలోకి వెళ్ళారు. బలరాముడు తాటి చెట్లను బలంగా ఊపి... చెట్లకు ఉన్న పండ్లన్నిటినీ రాల్చేశాడు. పండ్లు రాలిన శబ్దం విని ఎక్కడ్నించో ఊడిపడిన ధేనుకాసురుడు ఓండ్ర పెడుతూ బలరాముడి గుండెల మీద బలంగా తన్నాడు. బలరాముడికి పట్టలేనంత కోపం వచ్చింది. ధేనుకాసురుడు గార్దభ రూపంలో ఉన్నాడు కాదా... ఆ గార్దభం నాలుగు కాళ్ళూ కలిపి, గట్టిగా పట్టుకొని, గిరగిర తిప్పుతూ పక్కనే ఉన్న పెద్ద తాళ వృక్షానికేసి కొట్టాడు. దానితో ధేనుకాసురుడు గిలగిల తన్నుకుంటూ నెత్తురు కక్కుతూ ప్రాణం వదిలాడు. అదే సమయంలో... ధేనుకాసురుడి తాకిడికి ఒక పెద్ద తాటి చెట్టు మరో తాటి చెట్టు మీద పడింది. అది కూలింది. అది వెళ్ళి మరో చెట్టు మీద పడింది. అదీ కూలింది. అలా ఒకదాని మీద ఒకటి పడి అన్ని చెట్లూ నేల వాలాయి. ఆ శబ్దాలు విని రాక్షసులందరూ పరుగు పరుగున వచ్చారు. అందరినీ బలరామకృష్ణులు హతమార్చారు. దాంతో తాళ వనానికి రాక్షస పీడ వదిలింది. పిల్లలూ, పెద్దలూ అందరూ స్వేచ్ఛగా వెళ్ళి తీయని పండ్లు తింటున్నారు. గోవులకు కూడా పచ్చని పచ్చిక బయళ్ళు దొరికాయి. వాటికి కావలిసినంత మేత!
సాహసికుడికి శాప విముక్తి
ఇంతకీ ఎవరీ ధేనుకాసురుడు? అతను దానవుడైన బలి కుమారుడు. పేరు సాహసికుడు. అతను గంధమాదన పర్వతం మీద స్త్రీలతో యథేచ్ఛగా విహరిస్తూ ఉండేవాడు. ఆ పర్వతం పక్కనే ఒక గుహలో దుర్వాస మహర్షి తపస్సు చేసుకొనేవాడు. సాహసికుడి కార్యకలాపాలు ఆ మహర్షి ధ్యానానికి భంగం కలిగిస్తూ ఉండేవి. ఒకసారి ఆయన తీవ్రంగా కోపగించి ‘‘నువ్వు గాడిదవై పుడతావు’’ అని శపించాడు. అలా దుర్వాసుడి శాపానికి గురైన సాహసికుడు... గార్దభ రూపంలో తాళవనంలో ప్రవేశించాడు. కాలక్రమాన బలరామకృష్ణులతో పోట్లాడి హతుడై... శాపవిముక్తి పొందాడు.
ప్రకృతి ఏ ఒక్కరి సొత్తూ కాదు. ప్రకృతి ప్రసాదించిన వాటిని తాము తప్ప వేరెవ్వరూ అనుభవించరాదనే స్వార్థం, సంకుచితత్వం ఎవరికీ మంచిది కాదు. ‘నా చిన్ని పొట్టకు శ్రీరామరక్ష’ అనుకొనే వాళ్ళు లోభులూ, మత్సరులూ, దుర్మార్గులూ! అలాంటివారు తప్పక నశిస్తారు.
ప్రయాగ రామకృష్ణ
ఈ వార్తలనూ చదవండి:
చెన్నైలో భారీగా హెరాయిన్ పట్టివేత.. రూ.710 కోట్ల విలువైన డ్రగ్స్ స్వాధీనం..
నైలాన్ తాడుతో చిన్నారి చేతులు కట్టేసి కొట్టిన టీచర్.. తమిళనాడు స్కూల్లో ఘటన