ధర్మం... ఒక జీవన సూత్రం
ABN , Publish Date - Jan 30 , 2026 | 05:36 AM
ఉరుకుల పరుగుల నేటి ఆధునిక ప్రపంచంలో చాలామంది వ్యక్తులు నిరంతరం ఒత్తిడికి, నైతికమైన గందరగోళానికి, భావోద్వేగపరమైన అలసటకు గురవుతున్నారు. సాంకేతికంగా అపూర్వమైన పురోగతిని...
యోగా
ఉరుకుల పరుగుల నేటి ఆధునిక ప్రపంచంలో చాలామంది వ్యక్తులు నిరంతరం ఒత్తిడికి, నైతికమైన గందరగోళానికి, భావోద్వేగపరమైన అలసటకు గురవుతున్నారు. సాంకేతికంగా అపూర్వమైన పురోగతిని సాధించినప్పటికీ, అంతర్గతమైన శాంతి చాలా అరుదయిపోయింది. ఇలాంటి సమయంలోనే ‘ధర్మం’ అనే ప్రాచీన భావన ఆరోగ్యవంతంగా, అర్థవంతంగా జీవించడానికి ఒక ఆచరణాత్మకమైన సూత్రంగా సమయోచితమైన మార్గదర్శకత్వాన్ని అందిస్తుంది. ధర్మం అంటే కఠినమైన నియమాలు లేదా సామాజికమైన నిర్బంధాలు అని తరచూ పొరపడుతూ ఉంటారు. వాస్తవానికి, తమతో, ఇతరులతో, ప్రకృతితో సామరస్యంగా జీవించడం గురించి అది సూచిస్తుంది. అది నిశ్శబ్దమైన అంతర్గత అవగాహన. మనల్ని రోజువారీ జీవితంలో నిజాయితీ, బాధ్యత, సమతుల్యత దిశగా అది నడిపిస్తుంది.
అంతర్గత సమన్వయం
ఒక కార్డియాలజిస్టుగా, తీవ్రమైన ఒత్తిడి, పరిష్కారం కాని అంతర్గతమైన ఘర్షణ, జీవితానికి లక్ష్యం లేకపోవడం అనేవి హైపర్‌టెన్షన్‌గా గుండె జబ్బులుగా, నిస్సత్తువగా ఎలా మారతాయనేది నేను నిత్యం గమనిస్తున్నాను. ఈ పరిస్థితులు కేవలం శారీరకమైనవి కావు. ఒక వ్యక్తి తన అంతర్గత విలువలకు దూరం అయిన స్థితిని అవి ప్రతిఫలిస్తాయి. మన చర్యలు నిరంతరం మనస్సాక్షిని ఉల్లంఘించినప్పుడు... హృదయం శారీరకంగా, మానసికంగా భారాన్ని మోయాల్సి వస్తుంది. గుండె లయను, రక్తపోటును, మొత్తంగా హృదయసంబంధమైన ఆరోగ్యాన్ని భావోద్వేగ స్థాయిలు తీవ్రంగా ప్రభావితం చేస్తాయని ఆధునిక సైన్స్ గుర్తించింది. ఆలోచనలు, అనుభూతులు, చర్యలు సమరేఖలో ఉన్నప్పుడు... శరీరం ఒక సమన్వయ స్థితిలోకి ప్రవేశిస్తుంది. ధర్మం ఒక కోణంలో అంతర్గత సమన్వయాన్ని సూచిస్తుంది. అది సరైన క్రియ సహజంగా ఉద్భవించే ఒక స్థితి. ధర్మం అనేది ఒక స్థిరమైన నియమావళి కాదు, అది ఒక వ్యక్తి పాత్ర, పరిస్థితి బట్టి పరిణామం చెందుతుంది. ఒక విద్యార్థి ధర్మం తల్లిదండ్రులు, వృత్తి నిపుణులు లేదా నాయకుడి ధర్మం కంటే భిన్నంగా ఉంటుంది. కానీ నిర్ణయాలు తీసుకునేటప్పుడు అవగాహన, సున్నితత్వం, బాధ్యత అవసరం అనే అంశం మాత్రం స్థిరంగా ఉంటుంది.
కాలం చెల్లిన భావన కాదు
ఆచరణాత్మకంగా చెప్పాలంటే, ధర్మం చిన్నవైన, చేతనతో కూడిన ఎంపికల ద్వారా వ్యక్తమవుతుంది. నిజాయితీగా మాట్లాడడం, నిజాయితీగా పనిచేయడం, న్యాయంగా వ్యవహరించడం, ఒత్తిడిలో కూడా దయను చూపించడం... ఇలాంటి చర్యలు అనిశ్చితమైన బాహ్య పరిస్థితులలో కూడా అంతర్గతమైన స్థిరత్వాన్ని సృష్టిస్తాయి. నిరాడంబరత్వం, అంతర్గతమైన నిశ్చలత ద్వారా హృదయాన్ని శుద్ధి చేసుకోవడం గురించి ‘హార్ట్‌ఫుల్‌నెస్’ ధ్యానం నొక్కిచెబుతుంది. భావోద్వేగపరమైన భారాలనుంచి విముక్తి పొందితే స్పష్టత పెరుగుతుంది, నైతికమైన ప్రవర్తన అప్రయత్నంగానే అలవడుతుంది. ఈ అంతర్గత స్థితి నుంచి ధర్మం మనమీద బలవంతంగా రుద్దినట్టు కాకుండా... సహజంగాసిద్ధంగానే మనలో ప్రవహిస్తుంది. కాగా, కేవలం చట్టాల ద్వారా మాత్రమే కొనసాగే సమాజం చివరకు దుర్బలంగా మారుతుంది. వ్యక్తులు భయంతో కన్నా అంతర్గత బాధ్యతతో వ్యవహరిస్తే నమ్మకం బలపడుతుంది, సామరస్యం ఏర్పడుతుంది. పరివర్తన చెందిన వ్యక్తుల ద్వారానే స్థిరమైన సామాజిక మార్పు ప్రారంభం అవుతుంది. ధర్మం కాలం చెల్లిన, వేరే యుగానికి చెందిన భావన కాదు. అది ఒక జీవన సూత్రం. ఆధునిక ప్రపంచంలో ఆరోగ్యం, సమగ్రత, శాంతికి అది దోహదం చేస్తుంది. ధర్మంగా జీవిస్తున్నప్పటికీ సవాళ్ళు ఎదురుకావచ్చు, కానీ ధర్మం అంతర్గత ఘర్షణ నుంచి విముక్తి కలిగిస్తుంది. అది అందించే గొప్ప బలం... అంతర్గతమైన సామరస్యం.
డాక్టర్ శరత్‌రెడ్డి, కార్డియాలజిస్ట్,
ట్రైనర్, హార్ట్‌ఫుల్‌నెస్. 9440087532
ఇవి కూడా చదవండి..
సిట్ అధికారులకు లేఖ రాసిన కేసీఆర్.. విచారణ వాయిదా వేయాలని విజ్ఞప్తి..
కిందపడినా.. వీడియో ఆగకూడదు.. ఈ ఫొటొగ్రాఫర్ పనితనం చూస్తే..