Share News

విధిని ఎదిరించి విజేతగా..

ABN , Publish Date - Feb 09 , 2026 | 01:15 AM

సాధారణ జలుబు, జ్వరానికే చాలామంది బెంబేలెత్తుతారు. కాలుతీసి బయటపెట్టడానికి కూడా జంకుతారు. అలాంటిది ఒకటి కాదు రెండుసార్లు మూత్రపిండాల మార్పిడి జరిగినా...

విధిని ఎదిరించి విజేతగా..

సాధారణ జలుబు, జ్వరానికే చాలామంది బెంబేలెత్తుతారు. కాలుతీసి బయటపెట్టడానికి కూడా జంకుతారు. అలాంటిది ఒకటి కాదు రెండుసార్లు మూత్రపిండాల మార్పిడి జరిగినా ఆత్మస్థైర్యంతో అంటార్కిటికా సర్కిల్‌ను దాటి సరికొత్త రికార్డును సొంతం చేసుకున్నారు స్నేహ భూపతిరాజు. నాగార్జున కన్‌స్ట్రక్షన్స్‌ కంపెనీ కార్పొరేట్‌ కమ్యూనికేషన్స్‌ విభాగం డిప్యూటీ హెడ్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న అమ్మాయి పర్వాతారోహణ ప్రయాణం తాలూకూ విశేషాలు నవ్యతో పంచుకున్నారిలా!

‘‘ఎవరెస్టు బేస్‌ క్యాంపు దరిదాపుల వరకు వెళ్లొచ్చాను. ఇంకొక్క పూటలో లక్ష్యాన్ని చేరుకుంటాను అనుకున్న సమయంలో వాతావరణం అనుకూలించక తప్పనిసరి పరిస్థితుల్లో వెనక్కి రావాల్సి వచ్చింది. అదీ ఒకటి కాదు రెండుసార్లు. వైఫల్యాలతో యుద్ధం చేయడం నాకు కొత్తేమీ కాదు. ఊహతెలిసిన నాటి నుంచి విధితో నిత్య పోరాటం నా జీవితంలో భాగమైంది. ఈ సారి అలా కాదని, ఖర్చుతో కూడుకున్నా మరొక సాహసయాత్రకు బయరుదేరాను. అంటార్కిటికా ఖండంలో అడుగుపెట్టా. సవాళ్లతోకూడిన పదిరోజుల సాహస యాత్ర దిగ్విజయమైంది. సముద్ర మార్గాన భీకరమైన అలలు, గాలలుకు వెరవకుండా అంటార్కిటిక్‌ సర్కిల్‌ను దాటి డీటెయిల్‌ ఐలాండ్‌పై అడుగుపెట్టాను. పర్వతారోహణ ఇవాళ రేపు సహజమేకదా! మరి నా యాత్రలో వింత ఏముంది? అనుకుంటున్నారేమో! నాకు మాత్రం ఈ ప్రయాణం కేవలం సాహసం మాత్రమే కాదు అతి పెద్ద విజయం కూడా. ఎందుకంటే, రెండు సార్లు మూత్రపిండాల మార్పిడి శస్త్రచికిత్స చేయించుకున్న ఓ వ్యక్తి దేశాలు కాదు, ఖండాలు దాటి పర్వతాలు అధిరోహించడం అసాధారణమే కదా!


మొదటిసారి కిడ్నీ మార్పిడి...

మాది సంపన్నుల కుటుంబం. మా తాతయ్య(పితామహుడు) బీవీఎస్‌ రాజు గారు రాజమండ్రిలో పేరున్న వైద్యుడు. నాగార్జున కన్‌స్ట్రక్షన్‌ కంపెనీ వ్యవస్థాపకుడు ఏవీఎస్‌ రాజు గారు కూడా నాకు తాత గారే!(మాతామహుడు) గొప్ప ఇంట పుట్టిన నేను అదృష్టవంతురాలినే! కాకపోతే అంతా సాఫీగా సాగితే జీవితానికి అర్థమేముంది. అమెరికాలో పుట్టిన నాకు మూడేళ్ల వయసులో గొంతు ఇన్‌ఫెక్షన్‌ వచ్చింది. అదికాస్తా కొద్దిరోజుల్లోనే మూత్రపిండాలకు పాకింది. దాన్నే నెఫ్రాటిక్‌ సిండ్రోమ్‌ అంటారట. రెండు మూత్రపిండాలు ఫెయిలయ్యాయి. వారానికి రెండుసార్లు డయాలసిస్‌ తప్పనిసరి అయింది. ఆడుతూ పాడుతూ స్కూలుకు వెళ్లాల్సిన వయసులో ఆస్పత్రిచుట్టూ తిరగడం. ఎమర్జెన్సీ వార్డు నాకు తరగతి గది. ఆయాలు, నర్సులే నాకు స్నేహితులు. పూటకు పదిమాత్రలేమో చాక్‌లెట్లు. బహుశా! నాది అంత చిన్నవయసు కావడం వల్లేమో డయాలసిస్‌ చికిత్స జీవితంలో భాగమనుకున్నాను. మా డాక్టరు తాతయ్య ఆదేశాలతో కొన్నాళ్లకు ఇండియాకు వచ్చేశాం. ఏడేళ్ల వయసులో అంటే 1999లో నాకు కామినేని ఆస్పత్రిలో డాక్టర్‌ శాస్త్రి గారి పర్యవేక్షణలో కిడ్నీమార్పిడి జరిగింది. ప్రత్యేకంగా నాకు శస్త్రచికిత్స చేయడం కోసమే ఆస్ట్రేలియా నుంచి డాక్టర్‌ మోహన్‌రావును పిలిపించారు. ఇంత తక్కువ వయసులో కిడ్నీ మార్పిడి జరిగింది దక్షిణ భారతదేశంలోనే మొట్టమొదట నాకే అనుకుంటా.

రెండవసారి కిడ్నీమార్పిడి...

భగవంతుడి రాతను సైతం మార్చే శక్తి డాక్టర్లకు మాత్రమే సొంతమని స్వీయ అనుభవం ద్వారా గ్రహించిన నేనూ పెద్దయ్యాక డాక్టరు అవ్వాలనుకున్నాను. అంత ఒత్తిడి మంచిది కాదని ఇంట్లోవాళ్లు వద్దని వారించారు. నా మనసుకు నేను నచ్చచెప్పుకొని బెంగుళూరులోని ఓ పెద్ద కాలేజీలో బీబీఎం కోర్సులో చేరాను. జీవితమంతా సాఫీగా ముందుకు వెళుతుంది. ఇంకేమీ ఫర్వాలేదు! అనుకుంటున్న సమయంలో మళ్లీ పెద్ద కుదుపు. దోమకాటు వల్ల సెలెబ్రియల్‌ మలేరియా వచ్చింది. కిడ్నీ ఫెయిల్యూర్‌ అన్నారు డాక్టర్లు. మళ్లీ కొన్నాళ్లు డయాలసిస్‌ తప్పలేదు. డిగ్రీ ఫైనలియర్‌లో ఉండగా బెంగుళూరులోనే ఓ పెద్ద ఆస్పత్రిలో రెండోసారి 2013లో నాకు కిడ్నీ మార్పిడి జరిగింది. చికిత్స సమయంలో స్టెరాయిడ్స్‌ వాడడంవల్ల సహజంగానే బరువు పెరుగుతాం. బరువును సమతుల్యం చేసుకోడం కోసం రోజూవారీ జీవితంలో వ్యాయామం, యోగా తప్పనిసరి చేసుకున్నాను. అప్పుడే క్యాన్సర్‌ను జయించిన వాళ్లు, దివ్యాంగులు పర్వతారోహణ చేస్తున్న వార్తలు చదివి స్ఫూర్తిపొందాను. మరి మూత్రపిండాల మార్పిడి చేసుకున్న వారెవరైనా ఇలాంటి సాహసయాత్రలు పూర్తిచేసిన దాఖలాలున్నాయా అని శోధిస్తే చాలా చాలా తక్కువని తెలిసింది. అప్పుడే అనుకున్నాను పర్వతాలను అధిరోహించాలని.


అంటార్కిటికా అసాధారణ ప్రయణం...

మనాలి నుంచి 50కిలోమీటర్ల దూరంలోని రోతన్‌ పాస్‌ పర్వతమార్గ ప్రయాణమే నాలో పర్వతారోహణ ఆసక్తిని కలిగించింది. తర్వాత ఉత్తరాఖండ్‌లో ట్రెక్కింగ్‌కు వెళ్లాను. కలా పత్తర్‌, కశ్మీర్‌ గ్రేట్‌ లేక్స్‌ యాత్రలు విజయవంతంగా పూర్తి చేశాను. అప్పుడు నా మీద నాకు మరింత నమ్మకం కలిగింది. ఏడు ఖండాల్లోని ఎత్తైన శిఖరాలను అధిరోహించాలన్న ఆలోచన నాలో మెదిలింది. అత్యంత కఠినమైనా చాదర్‌ టెక్కింగ్‌కు బయలుదేరాను. రోజుకు 7నుంచి 8గంటలకుపైగా మంచు పర్వతాల మీద నడుస్తూ పదిరోజులు సాఫీగానే ప్రయాణం సాగింది. ఇక ఎవరెస్టు బేస్‌ క్యాంపు చేరడానికి ఒకరోజు ఉందనగా వాతావరణం అనుకూలించకపోవడంతో హెలికాఫ్టర్‌ సాయంతో మమ్మల్ని వెనక్కితీసుకెళ్లారు. అదివరకు కూడా ఇలానే జరిగింది. ఎవరెస్టు ఎక్కలేనేమో అని నాలోనేను బాధపడ్డాను. అయినా ఆగిపోకూడదని బలంగా అనుకున్నాను. అంటార్కిటికా ప్రయాణం అసాధారణమని తెలిసినా... వెళ్లాలని నిశ్చయించుకున్నాను. దక్షిణ అమెరికాలోని ఉషువాయా నుంచి గతేడాది డిసెంబరు17న యాత్ర ప్రారంభమైంది. ప్రమాదకరమైన డ్రేక్‌ పాసేజ్‌ దాటి అంటార్కిటికా చేరుకున్నాం. క్రూజ్‌ ప్రయాణంలో భయంకరమైన అలలతాకిడి వల్ల కుదుపులతో బాగా ఇబ్బందులు పడ్డాను. సీసిక్‌నెస్‌ వల్ల కడుపులో వికారం... వాంతులు.. మింగిన మాత్రలు బయటకు వస్తాయేమోనన్న ఆందోళనతో రెండు రోజులు తీవ్ర అవస్థలు ఎదురైనా వాటన్నింటినీ తట్టుకున్నాను. ఒకవేళ అత్యవసర పరిస్థితి తలెత్తినా హెలికాప్టర్‌ ఎమర్జెన్సీ లాంటి సౌకర్యాలు, వైద్యులు అందుబాటులో ఉన్న క్రూజ్‌నే ముందుజాగ్రత్తగా ఎంపిక చేసుకున్నాను. గడ్డకట్టే చలిలో వాతావరణం ఎంతమాత్రం సానుకూలంగా లేని పరిస్థితుల్లో అంటార్కిటిక్‌ సర్కిల్‌ను దాటి డీటెయిల్‌ ఐల్యాండ్‌పై అడుగుపెట్టడం నా జీవితంలో మరిచిపోలేని గొప్ప మధురానుభూతి.

సాంత్వన్‌

ఫొటోలు : అశోకుడు


జీవితాన్ని ప్రేమించాలి...

ఈ మధ్యకాలంలో ఆత్మహత్యల వార్తలు నన్ను తీవ్రంగా బాధిస్తున్నాయి. కన్నంతమాత్రాన పిల్లల జీవితంపై కూడా తమకే సర్వాధికారాలున్నట్టు కొంతమంది తల్లిదండ్రులు అభం శుభం తెలియని చిన్నారుల ఉసురుకూడా తీస్తున్నారు. చనిపోవాలన్న ఆలోచన మనసులో మొదలైన వెంటనే దగ్గర్లోని క్యాన్సర్‌ ఆస్పత్రి ఐసీయూ వార్డులోకి వెళ్లి ఒక్క రెండు నిమిషాలు గమనించండి. బతకడం కోసం విధితో పోరాడుతున్న ఎంతోమంది ధీమంతులు కనిపిస్తారు. జీవితం విలువ ఏమిటో మాకు బాగా తెలుసు. ఆత్మవిశ్వాసంతో కాలపరీక్షలకు నెగ్గి నిలిచిన మాలాంటి వాళ్లు కోకొల్లలు. ఆత్మహత్య వల్ల అవయవదానం చేసే గొప్ప అవకాశాన్ని కోల్పోతారు. మనం మరణించినా ఇతరులకు సరికొత్త జీవితాన్ని ప్రసాదించాలంటే మాత్రం జీవితాన్ని అమితంగా ప్రేమించండి. చనిపోవాలన్న ఆలోచనను చంపేయండి. అవయవదానం చేయండి.

విధి పరీక్షలో నన్ను విజేతగా నిలిపింది నా కుటుంబమే. ముఖ్యంగా మా అమ్మ రాత్రింబవళ్లు నావెంటే ఉన్నారు. నన్ను కంటికి రెప్పలా కాపాడుకున్నారు. మాది చాలా పెద్ద కుటుంబం. అమ్మ తోబుట్టువులు, నాన్న తోబుట్టువులు... నా కజిన్స్‌ అందరూ నన్ను ఎప్పుడూ ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా చూడలేదు. అందుకు కారణం కూడా డాక్టర్‌ శాస్త్రిగారి సూచనలు, సలహాలే.

బహుశా! నన్ను మిగతాపిల్లల్లాగే పెంచడంవల్లనేమో ఇంత ధైర్యంగా ప్రయాణాలు చేస్తున్నాను. ప్రస్తుతం నేను నాగార్జున కన్‌స్ట్రక్షన్‌ కంపెనీ కార్పొరేట్‌ కమ్యూనికేషన్స్‌ విభాగం డిప్యూటీ హెడ్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నాను. అవరోధాలను సైతం అనుకూలంగా మార్చుకొని ముందుకెళ్లడమే జీవితం. ఇదే నేను తెలుసుకున్నది. మూత్రపిండాలు మార్పిడి చేసుకున్నంత మాత్రాన గాజు బొమ్మలా ఇంటికే పరిమితం కానక్కర్లేదు. మన ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ అనుకున్న లక్ష్యాన్ని సాధించవచ్చు .

ఈ వార్తలు కూడా చదవండి..

జగన్‌కు సూటి ప్రశ్నలు వేసిన నాగబాబు..

సైబర్ నేరగాళ్లపై ఉక్కు పాదం.. రూ. 65 కోట్ల లావాదేవీల గుట్టు రట్టు

Read Latest Telangana News And AP News

Updated Date - Feb 09 , 2026 | 01:15 AM