Share News

న్యాయ ప్రవక్త దెబోరా

ABN , Publish Date - Jun 26 , 2026 | 05:54 AM

ఉషోదయం, పక్షుల కిలకిలలు ఉదయించబోతున్న సూర్యుడికి ఆహ్వాన లేఖలు పంపుతాయి. ఇవి మంగళకరమైన మహోదయానికి సూచనలు. అలాగే క్రీస్తు ఉదయించడానికి...

న్యాయ ప్రవక్త దెబోరా

దైవమార్గం

ఉషోదయం, పక్షుల కిలకిలలు ఉదయించబోతున్న సూర్యుడికి ఆహ్వాన లేఖలు పంపుతాయి. ఇవి మంగళకరమైన మహోదయానికి సూచనలు. అలాగే క్రీస్తు ఉదయించడానికి ముందు కొన్ని సూచనలు వెలువడ్డాయి. అవి అందుకున్నవారు ప్రవక్తలు. వారిలో మహిళలూ ఉన్నారు. న్యాయాధిపతులదే అంతిమ నిర్ణయమైన ఇజ్రాయేలీయుల కాలంలో... వారందరినీ తల్లిలా అక్కున చేర్చుకున్న మహిళా న్యాయ ప్రవక్త దెబోరా. దైవానుగ్రహంతో ఆమె ఇజ్రాయేలీయులకు దిశానిర్దేశం చేసింది. ఆమెకు సింహాసనం, హంగు, ఆర్భాటం లాంటివి ఏవీ లేవు. ఒక ఖర్జూర వృక్షం నీడలో కూర్చొని... ప్రజలకు హితోపదేశం చేస్తూ ఉండేది. ప్రజలు నైతికత మరచినప్పుడల్లా దేవుడు వారికి కష్టనష్టాలు కలిగించేవాడట. అలా ఇజ్రాయేలీయులు కూడా శత్రువుల పాలనలో బానిసలుగా ఉండిపోయేరు. అప్పటికే ఇరవై ఏళ్ళ నుంచి సీసెరా అనే దుష్టరాజు పాలిస్తూ... వారిని బాధలకు గురిచేసేవాడు. కఠినంగా అణచివేసేవాడు. తమ బాధల్ని యెహోవాకు ఇశ్రాయేలీయులందరూ మొరపెట్టుకోగా... దెబోరాను వారికి చూపించాడు. ఆమె దైవమార్గాన్ని ఉపదేశిస్తూ, మహా సేనానులుగా తీర్చిదిద్దింది.

సీసెరా దుష్టుడు, బలవంతుడు. అతనికి ప్రత్యర్థిగా ఇజ్రాయేలీయుల్లో బలహీనుడైన బారాకు... కేవలం పదివేలమందితో యుద్ధానికి సిద్ధమయ్యేడు. ఆ సమయానికి తాబోరు కొండల్లో తలదాచుకున్న బారాకును దెబోరా చైతన్య పరచింది. ‘‘యెహోవా వేంచేసి ఉన్నాడు. ఆ సీసెరాను నీ చేతికి అప్పగిస్తాడు. నువ్వు నిమిత్రమాత్రుడివి. నీ పక్షాన యెహోవాయే యుద్ధం చేస్తాడు. రా! ధైర్యంగా పోరాడు’’ అని ఉద్బోధించింది. ఆమె సూచనల మేరకు పదివేలమందితో తాబోరు కొండ మీద బారాకు నిలిచి ఉన్నాడు. సిసేరా 400 ఇనుప రథాలతో హూంకరిస్తూ వచ్చాడు. దేవుడు వాగులు, వంకల్లో వరదల్ని రప్పించి అతని సేనలకు ఆటంకం కలిగించాడు. చివరికి ఓటమిపాలు చేశాడు. బారాకు విజేత అయ్యాడు. ఈ కార్యం అంతటినీ దెబోరా ద్వారా దేవుడు నెరవేర్చాడు. బైబిల్‌లో ఆమె న్యాయచింతన, ప్రగాఢభక్తి లాంటి సద్గుణాలతో కనిపిస్తుంది. ‘దెబోరా’ అంటే... తేనెటీగ. తేనెటీగలా కష్టపడేది, తెలివైనది, సమాజానికి ఉపయోగపడేది అని అర్థం.

డాక్టర్‌ యం. సోహినీ బెర్నార్డ్‌

9866755024

ఇవి కూడా చదవండి:

పెళ్లి పేరుతో మోసం.. స్టార్ క్రికెటర్‌పై సంచలన ఆరోపణలు!

కన్నీళ్లు పెట్టుకున్న బ్రెజిల్ స్టార్ నెయ్‌మార్!

Updated Date - Jun 26 , 2026 | 05:54 AM