Share News

దావీదు విశ్వాసం

ABN , Publish Date - Sep 25 , 2026 | 03:09 AM

బైబిల్‌లో మహాయోధుడిగా, అచంచలమైన దైవభక్తుడిగా దావీదు కనిపిస్తాడు. ఇశ్రాయేలు, యూదా సమైక్య రాజ్యానికి అతను రెండో పాలకుడు. దావీదు గొప్ప కీర్తనకారుడు. ముఖ్యంగా...

దావీదు విశ్వాసం

దైవమార్గం

బైబిల్‌లో మహాయోధుడిగా, అచంచలమైన దైవభక్తుడిగా దావీదు కనిపిస్తాడు. ఇశ్రాయేలు, యూదా సమైక్య రాజ్యానికి అతను రెండో పాలకుడు. దావీదు గొప్ప కీర్తనకారుడు. ముఖ్యంగా... బైబిల్‌లోని 23వ కీర్తన ‘యెహోవా నా కాపరి’ అనేది అత్యంత ప్రాచుర్యం పొందింది. దానిలోని ప్రతి పంక్తి... దైవం పట్ల అతని విశ్వాసాన్ని ప్రతిఫలిస్తుంది.

యోధుడిగా గుర్తింపు పొంది, తదనంతరం రాజు కావడానికి ముందు... దావీదు గొర్రెల కాపరి. అయితే ఈ లోకంలోని మానవులందరినీ కాచేవాడు, కాపాడేవాడు ఆ దైవమేనని దావీదు గట్టిగా నమ్మాడు. అందుకే తనను గొర్రెగా, దేవుణ్ణి కాపరిగా పోల్చుకున్నాడు. కాపరి గొర్రెలను ఒంటరిగా వదిలిపెట్టడు. వాటికి ఆహారం ఇస్తాడు. ప్రమాదం నుంచి రక్షిస్తాడు. ‘ఆ ప్రభువు నా చెంత ఉన్నప్పుడు నాకు కొదువ కలగదు’ అన్నాడు దావీదు. అంటే అవసరమైన సమయంలో మనకు కావలసినవన్నీ ఆయన సమకూరుస్తాడు. అలాగే ‘పచ్చిక బయళ్ళలో నన్ను పరుండజేయును’ చెప్పాడు. అంటే ‘సురక్షితమైన స్థలాన్ని వెతికి... అక్కడ మనకు విశ్రాంతి దొరికేలా చేస్తాడు. కలతలు, కల్లోలాల మధ్య ప్రశాంతతను అందిస్తాడు. వేగంగా ప్రవహించే నీటిని చూసి మూగజీవులు భయపడతాయి. కాబట్టి ‘నిశ్చలమైన జలముల దగ్గరకు...’ అంటే శాంతివైపు, ఆత్మీయమైన తృప్తివైపు నడిపిస్తాడు. అందుకే ఆ ప్రభువు కాపలాగా ఉన్నప్పుడు ‘మరణఛాయ లోయలో నడిచినా అపాయానికి భయపడను’ అని అతను ప్రకటించాడు. ‘‘నా ఈ జీవితాన్ని ఒంటరిగా గడపాల్సిన అవసరం లేదు. దేవుడు నన్ను కాపాడతాడు. అవసరంలో ఆదుకుంటాడు. చివరివరకూ నాతోనే ఉంటాడు’’ అంటూ దావీదు ప్రదర్శించిన నమ్మకాన్ని ప్రతి విశ్వాసి ఆదర్శంగా తీసుకోవాలి. అలాంటి నమ్మకాన్ని పెంపొందించుకున్నవారు శాంతితో జీవిస్తారు. సమాజానికి శాంతిని పంచుతారు.

ఈ వార్తలనూ చదవండి

వృద్ధురాలి పాలిట మృత్యువులా వచ్చిన కోతి.. వీడియో చూస్తే షాకవ్వాల్సిందే..

అహ్మదాబాద్ విషాదం.. విద్యార్థినిపైకి దూసుకెళ్లిన క్రేన్.. వీడియో వైరల్

Updated Date - Sep 25 , 2026 | 03:09 AM