కీర దోసకాయలతో పసందుగా..
ABN , Publish Date - Jun 06 , 2026 | 03:29 AM
వేసవి కాలంలో శరీరానికి చలువదనాన్నివ్వడంతోపాటు పలు ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి కీర దోసకాయలు. వీటిని ముక్కలుగా కోసుకుని నేరుగా తింటుంటాం. అలాగే...
వంటిల్లు
వేసవి కాలంలో శరీరానికి చలువదనాన్నివ్వడంతోపాటు పలు ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి కీర దోసకాయలు. వీటిని ముక్కలుగా కోసుకుని నేరుగా తింటుంటాం. అలాగే సలాడ్స్‌లో కూడా చేర్చుకుంటుంటాం. కాస్త కొత్తగా ఆస్వాదించాలనుకుంటే వీటితో రకరకాల వంటకాలు ప్రయత్నించవచ్చు. అందరూ ఇష్టపడేలా కీర దోసకాయలతో సులువుగా తయారుచేసే విభిన్న రుచులు మీకోసం...
కీర బైట్స్
కావాల్సిన పదార్థాలు
కీర దోసకాయ- ఒకటి, కేరట్ తురుం- పావు కప్పు, క్యాబేజీ తురుం- పావు కప్పు, క్యాప్సీకమ్ తరుగు- పావు కప్పు, నల్ల ఉప్పు- అర చెంచా, మిరియాల పొడి- అర చెంచా, పచ్చి కొబ్బరి తురుం- పావు కప్పు, వేయించి కచ్చా పచ్చాగా పొడి చేసిన పల్లీలు- పావు కప్పు, చిక్కటి పెరుగు- పావు కప్పు, నువ్వులు- అర చెంచా, కలోంజి గింజలు- పావు చెంచా, నూనె- కొద్దిగా, కొత్తిమీర తరుగు- కొద్దిగా
తయారీ విధానం
స్టవ్ మీద గిన్నె పెట్టి కొద్దిగా నూనె వేసి అది వేడయ్యాక కేరట్ తురుం, క్యాబేజీ తురుం, క్యాప్సీకమ్ తరుగు వేసి కలపాలి. తరువాత పల్లీల పొడి, మిరియాల పొడి, పచ్చి కొబ్బరి తురుం, నల్ల ఉప్పు, కొత్తిమీర తరుగు వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని చల్లారనివ్వాలి. కీర దోసకాయను లావుపాటి చక్రాల్లా కోయాలి. ఒక్కోదానిపై చెంచా పెరుగు రాసి ఆపైన కూరగాయల మిశ్రమాన్ని కొద్దిగా ఉంచాలి. పైన నువ్వులు, కలోంజి గింజలు చల్లి మరో కీర చక్రాన్ని ఉంచాలి. అంతే కీర బైట్స్ రెడీ...
కీర తంబులి
కావాల్సిన పదార్థాలు
కీర దోసకాయ ముక్కలు- ఒక కప్పు, చిక్కటి పెరుగు- ఒక కప్పు, పచ్చి కొబ్బరి తురుం- పావు కప్పు, పచ్చి మిర్చి- రెండు, జీలకర్ర- చెంచా, మిరియాలు- అర చెంచా, నువ్వులు- అర చెంచా, కొత్తిమీర తరుగు- పావు కప్పు, ఉప్పు- తగినంత, నూనె- చెంచా, ఆవాలు- అర చెంచా, ఎండు మిర్చి- ఒకటి, వెల్లుల్లి రెబ్బలు- రెండు, కరివేపాకు- రెండు రెమ్మలు
తయారీ విధానం
బ్లెండర్‌లో కీర దోసకాయ ముక్కలు, పచ్చి కొబ్బరి తురుం, పచ్చి మిర్చి, అర చెంచా జీలకర్ర, మిరియాలు, నువ్వులు, ఉప్పు, కొత్తిమీర తరుగు వేసి అర కప్పు నీళ్లు పోసి మెత్తగా గ్రైండ్ చేయాలి. వెడల్పాటి కుండ లేదా గిన్నెలో పెరుగు వేసి పావు కప్పు నీళ్లు పోసి బాగా బీట్ చేయాలి. తరువాత మిక్సీ గిన్నెలో ఉన్న మిశ్రమాన్ని వేసి బాగా కలపాలి. స్టవ్ మీద చిన్న గిన్నె పెట్టి నూనె వేసి వేడయ్యాక ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు వేసి తయారుచేసిన పోపుని కీర-పెరుగు మిశ్రమంలో వేసి కలపాలి. ఉప్పు సరిచూసుకుని కొద్దిగా కొత్తిమీర తరుగు చల్లితే కీర తంబులి రెడీ..! దీన్ని అన్నంలో కలుపుకుని తింటే రుచిగా ఉంటుంది.
కీర కిమ్చి
కావాల్సినపదార్థాలు
కీర దోసకాయలు- రెండు, యాపిల్ ముక్కలు- పావు కప్పు, ఉప్పు- అర చెంచా, ఉల్లికాడల తరుగు- పావు కప్పు, వెల్లుల్లి తరుగు- చెంచా, చిల్లీ ఫ్లేక్స్- చెంచా, కారం- చెంచా, సోయా సాస్- చెంచా, రైస్ వెనిగర్ లేదా నిమ్మరసం- చెంచా, వేయించిన నువ్వులు- రెండు చెంచాలు, ఆలివ్ ఆయిల్- చెంచా, తేనె- చెంచా, అల్లం తురుం- అర చెంచా, నల్ల ఉప్పు- చిటికెడు, పుదీనా తరుగు- అర చెంచా
తయారీ విధానం
కీర దోసకాయలను గుండ్రని చక్రాలుగా కోసి గిన్నెలోకి తీసుకోవాలి. వాటిపై కొద్దిగా ఉప్పు చల్లి పది నిమిషాల తరువాత ఊరిన నీటిని వంపేయాలి.
తరువాత పైన సూచించిన వాటన్నింటినీ వేసి బాగా కలపాలి. అంతే రుచికరమైన కీర కిమ్చి రెడీ!
కీర అట్లు
కావాల్సిన పదార్థాలు
కీర దోసకాయ ముక్కలు- రెండు కప్పులు, బియ్యం- కప్పు, పచ్చి కొబ్బరి తురుం- అర కప్పు, పచ్చి మిర్చి- రెండు, అల్లం- చిన్న ముక్క, జీలకర్ర- చెంచా, ఉప్పు- తగినంత, నూనె లేదా నెయ్యి- తగినంత
తయారీ విధానం
వెడల్పాటి గిన్నెలో బియ్యాన్ని తీసుకుని కడిగి నిండా నీళ్లు పోసి మూడు గంటలపాటు నానబెట్టాలి. మిక్సీలో కీర ముక్కలు, నానిన బియ్యం, ఉప్పు, జీలకర్ర, అల్లం, పచ్చి మిర్చి ముక్కలు, పచ్చి కొబ్బరి తురుం వేసి తగినన్ని నీళ్లు పోసి మెత్తగా గ్రైండ్ చేయాలి. ఈ పిండిని గిన్నెలోకి తీసుకుని బాగా కలిపి ఉప్పు సరిచూసుకోవాలి.
స్టవ్ మీద పెనం పెట్టి నూనె లేదా నెయ్యి రాసి వేడయ్యాక గరిటెతో పిండిని తీసుకొని అట్టులా పోయాలి. దీన్ని రెండు వైపులా ఎర్రగా వేగనిచ్చి పళ్లెంలోకి తీయాలి. ఇలా తయారుచేసిన కీర అట్లను కొబ్బరి లేదా పల్లీ చట్నీతో తింటే రుచిగా ఉంటాయి.
ఈ వార్తలనూ చదవండి:
కీలక వడ్డీరేట్లు యథాతథం.. రెపో రేటులో ఎలాంటి మార్పు లేదన్న ఆర్బీఐ
వరుసగా మూడో రోజూ తగ్గిన బంగారం ధరలు.. వెండి కూడా..