Share News

దయ, శాంతి, సహనం అత్యవసరం

ABN , Publish Date - Jan 23 , 2026 | 03:36 AM

అసహనంతో నిండిపోయిన సామాజిక వాతావరణం. ఉక్కిరిబిక్కిరి జీవితాలు, స్పష్టత లేని ఆలోచనలు, పెరిగిన నేర ప్రవృత్తి, అదుపులేని కోరికలు, అదుపు తప్పుతున్న భావోద్వేగాలను చుట్టూ చూస్తూ...

దయ, శాంతి, సహనం అత్యవసరం

సంభాషణ

అసహనంతో నిండిపోయిన సామాజిక వాతావరణం. ఉక్కిరిబిక్కిరి జీవితాలు, స్పష్టత లేని ఆలోచనలు, పెరిగిన నేర ప్రవృత్తి, అదుపులేని కోరికలు, అదుపు తప్పుతున్న భావోద్వేగాలను చుట్టూ చూస్తూ ఉంటాం. వీటిని అదుపులో పెట్టుకొనే మార్గం చూపడానికి, ప్రజలలో శాంతి, కరుణలను పెంపొందిచడానికి కృషి చేస్తున్నారు తూర్పు గోదావరి జిల్లా ఉండ్రాజవరం మైత్రేయ బుద్ధ విహార్‌ ట్రస్ట్‌ (బౌద్ధ ధమ్మ పీఠం) పీఠాధిపతి బంతే అనలయో. బుద్ధగయలోని మహాబోధి ఆలయం మాదిరిగానే ఉండ్రాజవరంలో కూడా ఒక నిర్మాణాన్ని ఆయన చేపట్టారు. దాని కలశ స్థాపన కార్యక్రమం ఈ నెల 25వ తేదీన జరగనుంది. ఈ నేపథ్యంలో ఆయన ‘నివేదన’తో మాట్లాడారు.

‘‘నేను ఏమిటి? ఏం మాట్లాడుతున్నాను? ఏం ఆచరిస్తున్నాను? మాటకు, ఆచరణకు ఎందుకు సంబంధం ఉండడం లేదు? జీవితం అంటే ధన సంపాదన ఒక్కటేనా? అంతర్లీనంగా జరుగుతున్న సంఘర్షణకు, బాహ్య ప్రపంచంలో ఆచరణకు ఎందుకు సంబంధం ఉండడం లేదు? నన్ను నేను సరిగ్గా అర్థం చేసుకోవడంలో ఎందుకు విఫలమవుతున్నాను’’- ఇలాంటి ప్రశ్నలు ఎన్నో నన్ను చిన్నతనం నుంచి వేధిస్తూ ఉండేవి. నిద్రపోయినా, కూర్చున్నా, నిలుచున్నా, చదువుతున్నా, పనిచేస్తున్నా అవే ఆలోచనలు పదే పదే వచ్చేది. యుక్తవయసు వచ్చేసరికి ప్రపంచంలోని మతాలు, వివిధ తాత్త్విక సిద్ధాంతాల గురించి తెలుసుకున్నా. ప్రతి మతంలోనూ ఏదో అసమగ్రత ఉందనిపించేది. మన ఎదుర్కొనే సమస్యలకు మూలాలు అర్థమయ్యేవి కావు. అలాంటి పరిస్థితులో ఒక సారి బెంగళూరులో జరిగిన ఒక బౌద్ధ సన్యాసుల సమ్మేళనానికి హాజరయ్యా. ఈ సమ్మేళనంలో నాకు అనేక సమాధానాలు దొరికాయి. బౌద్ధమే మానవాళి ముక్తికి మార్గమని గ్రహించా. బౌద్ధంలో ఉన్న జ్ఞాన ప్రక్రియలు, ఎన్నో తాత్విక రహస్యాలు తెలుసుకున్నాను. జీవన విధానంలో ఎదురయ్యే సవాళ్ళకు బౌద్ధంలో చక్కని పరిష్కార మార్గాలు కనిపించాయి. దీనితో కాషాయ వస్త్రాలు ధరించి సన్యాసిగా మారాను.


పరిపక్వత కోసం..

బౌద్ధం మనిషిలో పరిపక్వతను సాధించి పెడుతుంది. మనకు మనం హాని చేసుకోకుండా, ఇతరులకు హాని చేయకుండా ఎలా జీవించాలో నేర్పుతుంది. బౌద్ధ ధర్మం భారతదేశంలో పుట్టి ప్రపంచానికి శాంతి సందేశాన్ని ఇచ్చిన అద్భుతతత్త్వం. గౌతమ బుద్ధుడు ప్రతిపాదించిన అష్టాంగిక మార్గం నేటి సమకాలీన జీవిత సందేహాలకు సమాధానం. మానవాళికి దుఃఖ నివారణ మార్గం. కుల వివక్షలను తిరస్కరించి, అందరికీ సమాన హక్కులను కల్పించడంలో బుద్ధుని పాత్ర అసామాన్యం.

బుద్ధుని ధ్యాన పద్ధతులు, బోధలను ప్రచారం చేసేందుకు నేను పుట్టి, పెరిగిన ఉండ్రాజవరానికి 2015లో వచ్చేశాను. బౌద్ధ ధమ్మ పీఠాన్ని నెలకొల్పాను సామాజికంగా, సాంస్కృతికంగా, ఆధ్యాత్మికంగా, విద్యాపరంగా సేవ మొదలుపెట్టాను. మనకు ప్రకృతి, సమాజం ఎంతో అవసరం. ఈ రెండూ లేకుండా మానవుల మనుగడ సాధ్యం కాదు. ఈ రెండింటి పట్ల కృతజ్ఞతా భావం కలిగినప్పుడే జీవితంలో క్రమశిక్షణ అలవడుతుంది. ప్రకృతి పరిరక్షణ, జీవిత క్రమశిక్షణలను అందరూ ఆచరిస్తే చక్కటి ఆనందమయ సమాజం ఏర్పడుతుంది. ఇలాంటి సమాజ స్థాపనకు బుద్ధుడు సూచించిన ఽమార్గాన్ని అనుసరిస్తే అందరికీ మేలు జరుగుతుంది.

దేవగళ్ల రామకృష్ణ, 99854 11542

22-navya.jpg

కొత్త విహారం

ఈ మధ్యనే బౌద్ధ ధమ్మ పీఠాన్ని ‘మైత్రేయ బుద్ధ విహార్‌’గా మార్పు చేశాం. 5 ఎకరాలలో బుద్ధగయలోని మహాబోధి ఏ విధంగా వుందో అదే మాదిరి బుద్ధ విహారాన్ని తీర్చిదిద్దుతున్నాం. ఇందులో ధ్యాన మందిరం, సభా మందిరం, కొన్ని ప్రత్యేక గదులు, మూగ జీవాల కోసం ప్రత్యేక షెడ్డు లాంటి కట్టడాలు నిర్మిస్తున్నాం. ఈ నెల 25న కలశ స్థాపన కార్యక్రమం జరగనుంది. దీనిలో బౌద్ధ భిక్షువుల సహా ప్రజలతో తణుకు నుంచి ఉండ్రాజవరం బౌద్ధ విహార్‌ వరకు 130 మీటర్ల బౌద్ధ పతాకంతో శాంతి ర్యాలీ నిర్వహిస్తున్నాం. మే ఒకటో తేదీ బుద్ధ పూర్ణిమ రోజున ఈ విహారాన్ని ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం.

బుద్ధ భగవానుడిని ఏదో కోణంలో అనుసరించే వారి సంఖ్య తక్కువేమీ కాదు. తెలుగు నేలపై ఇప్పుడిప్పుడే బౌద్ధం మళ్ళీ విస్తరిస్తోంది. ఆలోచనాపరులు, మేధావులు ఆసక్తి చూపుతున్నారు. ఈ కోణంలో ఆలోచన చేసి మన తెలుగు నేలపై నడయాడిన ధమ్మాన్ని తిరిగి నేటి కాలానికి పరిచయం చేసేందుకు అనేక మంది ప్రయత్నిస్తున్నారు. బౌద్ధం భారతదేశానికి ఓ తాత్త్విక వరం మాత్రమే కాదు. అది భారత ఆత్మకు శాంతియుత ప్రతిబింబం.

Also Read:

గుడ్‌న్యూస్.. తెలుగు రాష్ట్రాల మీదుగా మరో అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్..

అదృష్టం కలిసి రావాలంటే ఇంట్లో ఈ మొక్కలు నాటండి.!

బడ్జెట్ 2026: పన్ను చెల్లింపుదారులకు గుడ్‌న్యూస్ చెబుతారా.. ఈ 4 అంశాలపై సానుకూలంగా స్పందిస్తారా.?

Updated Date - Jan 23 , 2026 | 03:36 AM