Share News

వెండితెరపై గ్రీకు కావ్యం... ఒడిస్సీ!

ABN , Publish Date - Jul 19 , 2026 | 03:04 AM

ఇంగ్లీషు సినిమాలంటే చాలామందికి యాక్షన్‌, సైన్స్‌ ఫిక్షన్‌, ‘అవతార్‌’లాంటి కొత్త ప్రపంచాలు గుర్తుకొస్తాయి. అయితే కొత్త ఒరవడిని సృష్టించడంలో హాలీవుడ్‌ ఎప్పుడూ ముందు ఉంటుంది...

వెండితెరపై గ్రీకు కావ్యం... ఒడిస్సీ!

ఇంగ్లీషు సినిమాలంటే చాలామందికి యాక్షన్‌, సైన్స్‌ ఫిక్షన్‌, ‘అవతార్‌’లాంటి కొత్త ప్రపంచాలు గుర్తుకొస్తాయి. అయితే కొత్త ఒరవడిని సృష్టించడంలో హాలీవుడ్‌ ఎప్పుడూ ముందు ఉంటుంది. అలాంటి ఒక ప్రయోగమే- ‘ఒడిస్సీ’. గ్రీకు పురాణ గ్రంథమైన ‘ఒడిస్సీ’ని ప్రముఖ హాలీవుడ్‌ దర్శకుడు క్రిస్టోఫర్‌ నోలన్‌ తనదైన రీతిలో తెరకెక్కించారు. శుక్రవారం విడుదలయిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. ఒక మానవుడు మహనీయునిగా మారి, చరిత్ర గతిని మార్చడమే ఈ ‘ఒడిస్సీ’ కథాంశం. ‘‘మనుషుల్లో దేవుడిని చూడాలనుకోకు.. నిరాశ చెందుతావు’’ లాంటి డైలాగులు ప్రేక్షకుల మనస్సులో నేరుగా చేరుతున్నాయి. అందరూ ఇంతగా మాట్లాడుకుంటున్న ఈ ‘ఒడిస్సీ’ కథేమిటి? దీనికి మన రామాయణానికి మధ్య ఉన్న సారూప్యాలేమిటి? అనే విషయాలు తెలుసుకుందాం.

పాశ్చాత్య సాహిత్యంలో మొట్టమొదటి మహత్తర గ్రంథాలుగా గ్రీకు పురాణాలైన ‘ఇలియడ్‌’, ‘ఒడిస్సీ’లను చరిత్రకారులు పేర్కొంటారు. క్రీస్తుపూర్వం 1200-1300 మధ్య జరిగిన చారిత్రక గాథల సమాహారంగా నిలిచిన ఈ అమర కావ్యాలను ‘హోమర్‌’ అనే అంధ గ్రీకు మహాకవి పద్యరూపంలో అద్భుతంగా రచించారు. నాటి కాలంలో లిపి లేకపోవడం వల్ల ఇవన్నీ జానపద గేయాల రూపంలో ఒక తరం నుంచి మరొక తరానికి అందుతూ వచ్చి కాలక్రమేణా గ్రంథస్థం అయ్యాయి.

ట్రాయ్‌ యుద్ధం.. ఇలియడ్‌ గాథ

స్పార్టన్‌ యువరాజు మెనెలా్‌సను ప్రపంచ సుందరి హెలెన్‌ పెళ్లాడి స్పార్టా రాజ్యంలో ఉంటుంది. అయితే, ఆమెను ట్రాయ్‌ యువరాజు ప్యారిస్‌ మోహించి, ఆమె ఇష్టంతోనే తన దేశానికి తీసుకెళ్లడంతో ‘ఇలియడ్‌’ కథ ప్రారంభం అవుతుంది. దీన్ని అవమానంగా భావించిన గ్రీకు సైన్యం పదివేల పడవలపై ప్రస్తుతం టర్కీలో ఉన్న ‘ట్రాయ్‌’ నగరంపై దండెత్తుతుంది. పదేళ్లపాటు యుద్ధం చేసినా ‘ట్రాయ్‌’ లొంగకపోవడంతో ఇథాకా రాజు ‘ఒడిస్సియస్‌’ ఒక అద్భుత వ్యూహం రచిస్తాడు. గ్రీకులు ఓడిపోయి వెనుదిరిగారనే భ్రమ కల్పిస్తూ... వారి కోట ద్వారం వద్ద ఒక భారీ కొయ్య గుర్రాన్ని (ట్రోజన్‌ హార్స్‌)ను వదిలి వెళ్తారు. ట్రాయ్‌ నగరవాసులు దాన్ని విజయోత్సవ చిహ్నంగా భావించి కోట లోపలికి తీసుకెళ్తారు. ఆ రాత్రి నగరమంతా నిద్రమత్తులో ఉన్నప్పుడు.. ఆ గుర్రం కడుపులో దాక్కున్న ఒడిస్సియస్‌, అతని సైనికులు బయటకు వచ్చి కోట తలుపులు తెరుస్తారు. దీంతో ఒక్కసారిగా చొరబడిన గ్రీకు సైన్యం ట్రాయ్‌ నగరాన్ని సర్వనాశనం చేస్తుంది. ప్యారి్‌సను హతమార్చి హెలెన్‌ను వెనక్కి తీసుకురావడంతో ఇలియడ్‌ ముగుస్తుంది.


ఒడిస్సియస్‌ క్లిష్ట ప్రయాణమే... ఒడిస్సీ

ట్రాయ్‌ యుద్ధం ముగిశాక ఒడిస్సియస్‌ తిరిగి తన దేశానికి చేరుకోవడానికి చేసిన పదేళ్ల సంక్లిష్ట ప్రయాణమే ‘ఒడిస్సీ’. ఈ కారణంగానే జీవితంలో ఎదురయ్యే ఏదైనా సుదీర్ఘమైన ప్రయాణాన్ని ‘ఒడిస్సీ’ అని పిలవడం వాడుకలోకి వచ్చింది. తిరుగు ప్రయాణంలో ఒడిస్సియస్‌ ఒక ద్వీపంలో ఒంటికన్ను రాక్షసుడిని హతమారుస్తాడు. ఇది గ్రహించిన ఆ రాక్షసుడి తండ్రి, సముద్ర దేవుడు ‘పొసిడియన్‌’ ఆగ్రహంతో ఊగిపోతాడు. ఒడిస్సియస్‌ మాతృభూమికి చేరకుండా భీకర తుపాన్లతో పదేళ్ల పాటు సముద్రంపైనే అల్లాడేలా శపిస్తాడు. ఈ ప్రయాణంలో ‘కాలిప్సో’ అనే మంత్రగత్తె ఏడేళ్ల పాటు ఒడిస్సియ్‌సను బంధిస్తుంది. ఆ తర్వాత గ్రీకు దేవత ఎథేనా అనుగ్రహంతో ఒడిస్సియస్‌ ఎథికా రాజ్యానికి చేరుకుంటాడు.

ఇథికాలో స్వయంవరం

ఇలా ఇరవై ఏళ్ల తర్వాత (పదేళ్ల యుద్ధం, పదేళ్ల ప్రయాణం) ఒడిస్సియస్‌ యాచకుడి వేషంలో ఇథికాకు వస్తాడు. అప్పటికే అతడి భార్య పెనెలొపేని వివాహం చేసుకోవడానికి 108 మంది రాజులు ఆమె కోటలోనే మకాం వేసి ఉంటారు. వారి పీడ వదిలించుకోవడానికి పెనెలోపి స్వయంవరం ప్రకటిస్తుంది. గతంలో ఒడిస్సియస్‌ మాత్రమే ఎక్కుపెట్టగలిగిన భారీ విల్లును వంచి, ఒకే బాణంతో వరుసగా ఉన్న 12 గొడ్డళ్ల కన్నాల గుండా సంధించిన వాడినే వరిస్తానని చెబుతుంది. రాజులంతా విఫలమవగా, యాచకుడి వేషంలో ఉన్న ఒడిస్సియస్‌ ఆ విల్లును వంచి, బాణాన్ని విజయవంతంగా సంధించి తన నిజరూపాన్ని ప్రకటిస్తాడు. వెంటనే ఆ 108 మంది రాజులను వధించి, భార్యనూ, పుత్రుడిని చేరి తిరిగి రాజ్యాధికారాన్ని చేపడతాడు. ‘ఒడిస్సీ’ చిత్రాంశం కూడా ఇదే! ఇలాంటి అద్భుత కావ్యాన్ని క్రిస్టోఫర్‌ నోలన్‌ అతి తక్కువ గ్రాఫిక్స్‌తో రూపొందించడం ఒక విశేషమనే చెప్పాలి. ఇప్పటి దాకా ఎప్పుడూ చూడని సుందరమైన ప్రదేశాలు మనకు ఈ సినిమాలో కనిపిస్తాయి.

రామాయణంతో సారూప్యత

రామాయణం, ఒడిస్సీ... ఒక సంస్కృతికి చెందినవి కావు. ఒక కాలానికీ చెందినవి కావు. రెండు వేర్వేరు భౌగోళిక ప్రాంతాలలో... వేర్వేరు సంస్కృతి, సంప్రదాయాల నేపథ్యాలకు సంబంధించిన కథలు. కానీ ఈ రెండింటి మధ్య చాలా సారూప్యతలు మనకు కనిపిస్తాయి.

సుదూర ప్రయాణాలు: ఇథికా రాజు ఒడిస్సియస్‌ పదేళ్ల పాటు యుద్ధం చేస్తాడు. విజయం తర్వాత తిరిగి వచ్చే క్రమంలో అనేక సవాళ్లు ఎదుర్కొని తన సామ్రాజ్యానికి చేరుకుంటాడు. రాముడు వనవాసానికి వెళ్తాడు. ఆ సమయంలో సీత అపహరణకు గురవుతుంది. రావణాసురుడిని వధించిన తర్వాత సీతతో తిరిగి తన సామ్రాజ్యానికి చేరుకుంటాడు. ఈ రెండిటిలోను రాజ్యాన్ని వదిలి వెళ్లడం, మళ్లీ తిరిగి వచ్చే క్రమంలో రకరకాల సమస్యలు ఎదుర్కొని విజయం సాధించడం ముఖ్య ఇతివృత్తం.


అతీత శక్తులతో పోరాటం: ‘ఒడిస్సీ’లో ఒక ప్రాంతంలో పాటలు పాడే శక్తులు- నావికులను ఆకర్షిస్తూ ఉంటాయి. వాటి వలలో పడిన వారి మార్గాన్ని మార్చేస్తాయి.‘ రామాయణం’లో బంగారు లేడి కూడా రాముడిని సీతకు దూరం గా తీసుకువెళ్లిపోతుంది. రాముడు రాక్షస శక్తులను ఎదుర్కొన్నట్టే... ఒడిస్సియస్‌ తన ప్రయాణంలో సైక్లోప్స్‌, చేరిబిడ్స్‌, సైరన్స్‌ లాంటి దుష్టశక్తులను ఎదుర్కొంటాడు.

వింటి నారిని సంధించి: ధనస్సు ఈ రెండిటిలోను కీలక పాత్ర పోషిస్తుంది. ‘ఒడిస్సీ’లో పెనెలొపే (ఒడిస్సియస్‌ భార్య) పునర్‌వివాహానికి ధనస్సు పరీక్ష పెడుతుంది. ఒడిస్సియ్‌సకు చెందిన ధనస్సు నారిని బిగించిన వారిని పెళ్లి చేసుకుంటానని స్వయవరం ప్రకటిస్తుంది.. కానీ ఎవ్వరూ ఆ పరీక్షలో నెగ్గరు. బిచ్చగాడి వేషంలో వచ్చిన ఒడిస్సియస్‌ ధనస్సు నారిని బిగిస్తాడు. ఇదే విధంగా ‘రామాయణం’లో సీతా స్వయంవరంలో రాముడు మాత్రమే శివధనస్సును విరుస్తాడు.

నేడు మనం కంప్యూటర్‌ రంగంలో వాడుతున్న ‘ట్రోజన్‌ వైరస్‌’, ‘ఎజాక్స్‌’.. అలాగే నిత్య జీవితంలో వాడే ‘మెంటార్‌’ (మార్గదర్శి), ‘ఎకిలియస్‌ హీల్‌’ (బలహీనత) లాంటి పదాలన్నీ ఈ గ్రీకు ఇతిహాసాల నుంచి ఉద్భవించినవే.

రవి పాడి

9701370954

ఇవి కూడా చదవండి

దేశ అంతరిక్ష కలలకు చిరునామాగా తెలంగాణ: సీఎం రేవంత్ రెడ్డి

గంజాయి పండిస్తున్న సాధువు.. అరెస్ట్ చేసిన పోలీసులు

Updated Date - Jul 19 , 2026 | 03:05 AM