Share News

శ్రమ దినాలు

ABN , Publish Date - Feb 20 , 2026 | 03:58 AM

క్రైస్తవులు పాటించే శ్రమ దినాలు ప్రస్తుతం కొనసాగుతున్నాయి. వీటిని ‘తపఃకాల ఘడియలు’, ‘ఉపవాస ప్రార్థనలు’... ఇలా రకరకాలుగా పిలుస్తారు. మొన్న బుధవారం మొదలైన ఈ శ్రమదినాలు...

శ్రమ దినాలు

దైవమార్గం

క్రైస్తవులు పాటించే శ్రమ దినాలు ప్రస్తుతం కొనసాగుతున్నాయి. వీటిని ‘తపఃకాల ఘడియలు’, ‘ఉపవాస ప్రార్థనలు’... ఇలా రకరకాలుగా పిలుస్తారు. మొన్న బుధవారం మొదలైన ఈ శ్రమదినాలు 40 రోజులపాటు జరుగుతాయి. ఏప్రిల్‌ మూడో తేదీతో ముగుస్తాయి. నలభై సంఖ్య... మరణించే సమయానికి ఏసు వయసును సూచిస్తుంది. శ్రమదినాల సందర్భంగా... మానవాళి కోసం క్రీస్తు శిలువ మోసుకుంటూ పడిన శ్రమలను విశ్వాసులు ధ్యానిస్తారు. ఉపవాస దినాలు... ఇంద్రియ సౌఖ్యాలను వీడి, క్రీస్తుకోసం త్యాగమయ జీవితాన్ని గడుపుతూ, క్రీస్తువాక్కుపై ధ్యానాన్ని కొనసాగించాలనీ, తపఃకాలం... క్రీస్తు శిలువపై పడిన యాతనను, క్రైస్తవులు చేసిన త్యాగ కృత్యాలను గుర్తు చేసుకోవాలనీ సూచిస్తాయి.

ప్రార్థించడం, ఉపవాసం పాటించడం, దాతృత్వం ప్రకటించడం అనే మూడు సూత్రాలు ఈ తపఃకాలానికి మూడు స్తంభాలు. మొదటిది దైవ సంబంధమైనది. రెండోది పంచేంద్రియాలను అదుపులో పెట్టుకొని దేవుడికోసం పరితపించడం. మూడోది దాతృత్వంతో, దయాదాక్షిణ్యాలతో సమాజంలోని తోటివారికి సహాయ సహకారాలు అందించడం. క్రైస్తవులు తాము చేసిన పాపాలకు పశ్చాత్తాపపడుతూ, మారిన హృదయంతో కొత్త నిర్ణయాలు తీసుకోవడానికి అవకాశం కలిగించే రోజులు కాబట్టి వీటిని ‘పరిణామ దినాలు’గా కూడా కొందరు భావిస్తారు. ఉపవాసంతో శరీరాన్ని శుష్కింపజేసుకోవడం అనేది కేవలం మనిషిలోని అహంకారం తగ్గడానికి, దేవుడికి దగ్గర కావడానికి మాత్రమే. నిరశన దీక్షతో నీరసించి అనారోగ్యానికి గురి కావడానికి కాదు.


క్రీస్తు శిలువపై మరణించింది శుక్రవారం కాబట్టి... సాధారణంగా ఈ శిలువ మార్గం ఘట్టాలన్నిటినీ భక్తి శ్రద్ధలతో.. ఈ నెల రోజులపాటు, ప్రతి శుక్రవారం స్మరించుకుంటారు. నిర్దోషి అయిన క్రీస్తుకు అన్యాయంగా మరణశిక్ష విధించడం, ఆయన శిరసుపై ముళ్ళ కిరీటాన్ని పెట్టడం, రాతి స్తంభానికి కట్టి, కొరడాలతో కొట్టడం, శిలువ భారం మోయలేక ఆయన మూడుసార్లు పడిపోవడం, కొయ్య శిలువపై ప్రభువు కాళ్ళకు, చేతులకు మేకులు కొట్టడం. ఆయన శిలువ పైనుంచి మాట్లాడడం, మరణించడం లాంటి సంఘటనలను ధ్యానించడం, ఇతర కార్యక్రమాలను ప్రతి మందిరంలో నిర్వహించడం సంప్రదాయం.

డాక్టర్‌ యం. సోహినీ బెర్నార్డ్‌

9866755024

ఇవి కూడా చదవండి..

బిల్‌గేట్స్ AI సమ్మిట్ ప్రసంగం: ఉత్కంఠకు తెర.. స్పష్టతనిచ్చిన ఫౌండేషన్!

సర్వజన క్షేమానికి పరిష్కారాలు కనుగొందాం

Updated Date - Feb 20 , 2026 | 03:58 AM