ఫ్యాషన్ ఫొటోతో రెట్రో జర్నీ
ABN , Publish Date - Sep 13 , 2026 | 12:46 AM
కొట్టొచ్చినట్టు కనిపించే ఆహార్యం... అలనాటి సినీ సౌందర్యం... మురిపించే ఆ పాత రూపం... ‘80వ దశకం ట్రెండ్’ ఇప్పుడు అంతర్జాలాన్ని ఊపేస్తోంది. హాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకు... సెలబ్రిటీల నుంచి సామాన్యుల వరకు...
కొట్టొచ్చినట్టు కనిపించే ఆహార్యం... అలనాటి సినీ సౌందర్యం... మురిపించే ఆ పాత రూపం... ‘80వ దశకం ట్రెండ్’ ఇప్పుడు అంతర్జాలాన్ని ఊపేస్తోంది. హాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకు... సెలబ్రిటీల నుంచి సామాన్యుల వరకు... ఓసారి ఆ పాత రోజుల్లోకి వెళ్లి వస్తున్నారు. ‘చాట్ జీపీటీ’ మహత్యంతో... ఏఐ చేసే అద్భుతంతో... వైవిధ్యమైన తమ లుక్స్‌ను చూసుకొని ఆసాంతం ఆస్వాదిస్తున్నారు.
ఇన్‌స్టాగ్రామ్ పేజీ తెరిస్తే... కుప్పలుతెప్పలుగా వింటేజ్ లుక్స్ చిత్రాలే. ‘చాట్ జీపీటీ’ 80ల ఫొటోస్ ట్రెండ్ సృష్టించిన సునామీ ఇది. రోజువారీ సెల్ఫీలను, ఫొటోలను రెట్రో శైలి పోస్టర్లుగా మారుస్తోంది. 1980ల నాటి బోల్డ్ హెయిర్ స్టయిల్స్, వింటేజ్ దుస్తులు, సాఫ్ట్ స్టూడియో లైటింగ్, ఒత్తయిన పొడవాటి జుట్టు... నేపథ్యంలో ఫొటోలు వెల్లువలా సామాజిక మాధ్యమాలను నింపేస్తున్నాయి. ఈ నెల ఆరంభంలో అంటుకున్న ఈ ట్రెండ్ 2026లో అతిపెద్ద ఏఐ ట్రెండ్స్‌లో ఒకటిగా ప్రపంచమంతా పాకేస్తోంది.
ఏమిటీ ట్రెండ్...
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ఇమేజ్ జనరేషన్‌ను ఉపయోగించి, ఆధునిక సెల్ఫీని 1980ల నాటి శైలి, బాలీవుడ్ స్ఫూర్తితో పోట్రెయిట్‌గా మారుస్తుంది. యూజర్లు ఒక ఫొటోను అప్‌లోడ్ చేసి, తమ ముఖ కవళికలు మార్చకుండా, రెట్రో స్టయిల్‌లో ఒక కొత్త చిత్రాన్ని సృష్టించమని ‘చాట్ జీపీటీ’ని అడుగుతారు. వారు కోరిన ఫీచర్స్‌ను దృష్టిలో పెట్టుకొని, ఒత్తయిన జుట్టు, పాత కాలపు దుస్తులు, యాక్ససరీస్, సంధ్యా సమయంలో కాంతిలో, డిస్కోలు లేదా స్టూడియోను తలపించే క్లాసిక్ బ్యాక్‌డ్రాప్‌లతో కూడిన ఒక సినిమా తరహా ఊహాజనిత పోస్టర్‌ను ఏఐ రూపొందిస్తుంది. అది చూసి యూజర్లు మురిసిపోతూ తమ ఇన్‌స్టాగ్రామ్ పేజీల్లో పోస్ట్ చేస్తున్నారు. ‘యాడ్ యువర్స్’ స్టిక్కర్‌ను జత చేసి, ఇతరులనూ ఆహ్వానిస్తున్నారు.
ఎందుకు ఇంత క్రేజ్...
పాతకాలపు ఫ్యాషన్, సినిమాలపై మనకు ఉండే ఇష్టం, వేరొక యుగంలో మనల్ని మనం చూసుకోవాలనే ఉత్సుకత, అందులో ఉండే కొత్తదనం, అత్యంత స్టయిల్‌గా సిద్ధమవుతున్న రూపం... ఇవే 80ల ట్రెండ్ ఇంతగా వ్యాప్తి చెందడానికి కారణం అనేది సాంకేతిక నిపుణుల మాట. అంతేకాదు... సులభంగా ఉపయోగించగల ఏఐ టూల్, ఊహల్లో చిత్రం క్షణాల్లో కళ్ల ముందు ప్రత్యక్షం కావడం కూడా ఈ పోకడను మరో స్థాయికి తీసుకువెళ్లింది. గత స్టూడియో గిబ్లీ ఏఐ ట్రెండ్ యానిమేటెడ్ చిత్రాల శైలిని కూడా అనుకరిస్తూ యూజర్లకు సరికొత్త అనుభూతిని పంచుతోంది. ముఖ్యంగా సినీ తారలు దీనికి ఆకర్షితులు కావడం, నాటి తమ ఊహాజనిత లుక్స్‌ను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేయడంతో తక్కువ సమయంలోనే ఊహించని రీతిలో పాపులర్ అయింది.
నైపుణ్యంతో పని లేదు...
ఎలాంటి ప్రొఫెషనల్ ఎడిటింగ్ నైపుణ్యాలు అవసరం లేకుండా, నాటి ట్రెండ్‌లో ఫొటోలను సులభంగా సృష్టించుకోవచ్చు. చాట్ జీపీటీలోకి వెళ్లి, స్పష్టమైన ఫొటోను అప్‌లోడ్ చేసి, ఎలాంటి ఫీచర్స్ కావాలో ప్రాంప్ట్ ఇస్తే క్షణాల్లో కోరుకున్న చిత్రం సిద్ధమవుతుంది. నచ్చకపోతే ఎడిటింగ్ చేసుకొనే వెసులుబాటు కూడా ఉంది. ‘ఒక మధ్యతరగతి భారతీయ కుటుంబం ఆల్బమ్, వింటేజ్ వివాహ ఛాయాచిత్రం, రెట్రో డిస్కో యుగం నాటి రూపం’... ఇలా 80లను తలపించే ఏదైనా అడగవచ్చు.
మనసు పారేసుకున్న తారలు...
ఈ కొత్త ట్రెండ్ సినీ ప్రముఖులనూ విపరీతంగా ఆకర్షిస్తోంది. ముఖ్యంగా నేటితరం తారలు కియారా అద్వానీ, సిద్ధార్థ్ మల్హోత్రా, పరిణీతి చోప్రా, రాఘవ్ చద్దా జంటలు, సోనాక్షి సిన్హా, శ్రుతి హాసన్, అమీషా పటేల్, రవి కిషన్, తహీరా కశ్యప్ తదితరులు... ఆనాటి ఫ్యాషన్ ప్రతిబింబించే ఆహార్యం, నేపథ్యంలో తమను తాము సరికొత్తగా చూసుకొంటున్నారు. అలాగే కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ లాంటి రాజకీయ నేతలు, మేరీకోమ్ తదితర క్రీడాకారులు కూడా ట్రెండ్‌ను ఫాలో అవుతున్నారు. ఇక కొంతమంది అభిమానులు సమంత, త్రిష, సాయి పల్లవి, నయనతార, కళ్యాణి ప్రియదర్శన్, అనుపమా పరమేశ్వరన్, తమన్నా తదితర దక్షిణాది కథానాయికల 80ల ఫొటోలను రూపొందించి, ఇన్‌స్టాలో పోస్ట్ చేస్తున్నారు. నుదుట చుక్కలా చిన్న బొట్టు, ముఖానికి తక్కువ మేకప్, భుజానికి పాతకాలపు బ్యాగ్‌లు, స్టోన్ వాష్డ్ జీన్స్‌ల్లో అలరిస్తున్నారు. బ్యాక్‌డ్రాప్‌లో సూర్యరశ్మి ప్రసరించే కాలేజీ కారిడార్లు, పాతబడిన ఇటుక గోడలు, సైకిళ్లు, నాటి సినిమా పోస్టర్లు... ‘ఇది నిజమైన ఫొటో’ అనిపించేంత సహజంగా ఆకట్టుకొంటున్నారీ తారలు. అయితే ఈ నయా ట్రెండ్‌పై విమర్శలు కూడా ఉన్నాయి. ప్రముఖ దర్శకనిర్మాతలు మహేష్ భట్, రామ్‌గోపాల్‌వర్మ ఈ ధోరణిని కొట్టిపారేశారు. దీన్ని ఒక తాత్కాలిక వ్యామోహంగా భట్ అభివర్ణించారు. ఎన్ని విమర్శలు వచ్చినా... రెట్రో ఫొటో ట్రెండ్ మాత్రం వేగంగా వ్యాపిస్తూనే ఉంది.
ఇవీ చదవండి:
ప్రపంచ ఆర్థిక వృద్ధి కంటే రెండింతల వేగంతో 'బ్రిక్స్' వృద్ధి: మోదీ
పుతిన్-మోదీ ప్రయాణించిన కారు చలించే ఓ ఉక్కుకోట!