Share News

ఈ గోప్యత ఏ గుట్టు దాచడానికి?

ABN , Publish Date - Jan 29 , 2026 | 05:07 AM

తెలుగు చలనచిత్ర పరిశ్రమలో క్యాస్టింగ్‌ కౌచ్‌ వివాదం మరొకసారి తెరమీదకు వచ్చింది. దీనిపై భిన్నాభిప్రాయాలు, విభిన్న వాదనలు సామాజిక మాధ్యమాల వేదికగా వెలువడుతున్నాయి...

ఈ గోప్యత ఏ గుట్టు దాచడానికి?

వేదిక

తెలుగు చలనచిత్ర పరిశ్రమలో క్యాస్టింగ్‌ కౌచ్‌ వివాదం మరొకసారి తెరమీదకు వచ్చింది. దీనిపై భిన్నాభిప్రాయాలు, విభిన్న వాదనలు సామాజిక మాధ్యమాల వేదికగా వెలువడుతున్నాయి. తెలుగు సినిమా రంగంలో మహిళలు ఎదుర్కొంటున్న లైంగిక దాడి లాంటి సమస్యలపై అధ్యయనం చేసిన ‘తెలంగాణ మహిళా ట్రాన్స్‌జెండర్‌ జాయింట్‌ యాక్షన్‌ కమిటీ’ ప్రతినిధుల్లో ఒకరైన అచ్యుత సునీత ఈ సందర్భంగా పలు విషయాలు ‘నవ్య’తో పంచుకున్నారు. ‘2022లో మహిళా సంఘాలు ప్రాతినిధ్యం వహించి, ఇచ్చిన సబ్‌ కమిటీ నివేదికను బహిర్గతం చేయకపోవడానికి కారణం ఏమిటి?’ అని ఆ కమిటీలో భాగమైన తెలుగు సినిమా పెద్దలను, తెలంగాణ ప్రభుత్వాన్ని ఆమె నిలదీస్తున్నారు.

‘‘తెలుగు చలనచిత్ర పరిశ్రమలో క్యాస్టింగ్‌ కౌచ్‌ అత్యంత బలంగా వేళ్లూనుకొని ఉంది. అది అన్ని విభాగాల్లోనూ సర్వసాధారణంగా కొనసాగుతోంది. ఆ హింసను భరించలేక ఎవరైనా ఒకరిద్దరు ధైర్యం చేసి ఫిర్యాదు ఇస్తే... వాళ్లకు ఇక ఆ పరిశ్రమలో పని దొరకకుండా చేస్తున్న దుర్మార్గ పరిస్థితులు చూస్తున్నాం. దానికితోడు బాధితురాలి మీదే బండలు వేస్తున్న ఉదంతాలు మరెన్నో. కేవలం తెలుగు సినిమా రంగానికే పరిమితమైన సమస్య కాదు ఇది. హాలీవుడ్‌, బాలీవుడ్‌, కోలీవుడ్‌, శాండల్‌వుడ్‌... ఇలా ప్రతిచోటా మహిళలు ఎదుర్కొంటున్న శ్రమ దోపిడి, వివక్ష, లైంగిక హింసపై పెద్దఎత్తున నిరసనలు వెల్లువెత్తున్నాయి. తెలుగు సినీ పరిశ్రమ అంతా ఒకే కుటుంబమనీ, ఇక్కడ అలాంటి వేధింపులకు ఆస్కారమే లేదనీ అనుకోవడం

ఉత్త వంచనే. సమాజంలో అన్ని రంగాల్లో ఉన్నట్టే సినీ

పరిశ్రమలోనూ మహిళల అభ్యున్నతికి అవరోధాలు ఉన్నాయనే వాస్తవాన్ని మొదట సినిమా పెద్దలు అంగీకరించాలి. ‘మహిళల శరీరాలు తమకు లోబడి ఉండాలి. ఎవరైనా దాన్ని ధిక్కరిస్తే, వారి మీద రకరకాల నిందలు మోపి, ఆత్మన్యూనతలోకి నెట్టేయాలి. అంతిమంగా భవిష్యత్తు లేకుండా చేయాలి’ లాంటి మగస్వామ్య భావాలు బలంగా నాటుకొని ఉన్న సినీ రంగంలో మార్పు మొదలు కావాలంటే సమస్యలను గుర్తించకుండామాత్రం సాధ్యం కాదు.


విచారణలో విస్తుగొల్పే విషయాలు...

ఒకరిద్దరు బాధితురాళ్లు సినిమా పరిశ్రమలోని అమానుషాలను బహిర్గతం చేసిన సమయంలో... తెలంగాణ మహిళా ట్రాన్స్‌జెండర్‌ ఉమ్మడి కార్యాచరణ వేదిక (జాక్‌) వారికి అండగా నిలిచింది. ఈ సమస్యపై క్షేత్రస్థాయి అధ్యయనం ప్రారంభించింది. విచారణ ద్వారా జూనియర్‌, డైలాగ్‌ ఆర్టిస్టులతో సుదీర్ఘంగా చర్చించింది. ఆ క్రమంలోనే ‘జాక్‌’లో భాగమైన మేమంతా సమస్య తీవ్రతను అర్థం చేసుకున్నాం. దీనిపై న్యాయస్థానాన్ని, జాతీయ మానవహక్కుల వేదిక, మహిళా కమిషన్లను సైతం ఆశ్రయించాం. ‘మహిళా, ట్రాన్స్‌జెండర్‌ జాక్‌’ ఒత్తిడితోనే నిర్మాతలు, దర్శకులు, స్టూడియో అధినేతలతో పాటు సామాజికవేత్తలు మొత్తం 44 మందితో హైపవర్‌ కమిటీని 2019లో తెలంగాణ ప్రభుత్వం నియమించింది. అందులోని పెద్దలు ఎక్కువ సమయం కేటాయించకపోవడంతో... నాతో పాటు భూమిక సత్యవతి, అంకురం సుమిత్ర, బి.గిరిజ, న్యాయవాది వసుధా నాగరాజ్‌, సినీ, టెలివిజన్‌ రంగాల నుంచి ఝాన్సీ, ప్రీతినిగంతో పాటు పోలీసు, మహిళా, కార్మిక తదితర ప్రభుత్వ శాఖల బాధ్యులతో కలిపి సబ్‌ కమిటీ అదే ఏడాది ఏర్పాటయింది.

మేమంతా 16 క్రాఫ్ట్‌లకు చెందిన వివిధ యూనియన్ల బాధ్యులు, జూనియర్‌, డైలాగ్‌ ఆర్టిస్టులు, నిర్మాతలు, ఇతర శ్రామికులతో నిరంతర సమావేశాలు నిర్వహించాం. ఒక్క యూనియన్‌లోనూ అంతర్గత ఫిర్యాదుల కమిటీ లేదని మాకు అప్పుడు తెలిసింది. ‘కమిట్‌మెంట్‌’ అనే పేరుతో కింది స్థాయి నుంచి పైస్థాయి వరకు క్యాస్టింగ్‌ కౌచ్‌ ఎంత బలంగా వ్యవస్థీకృతమైందో మాకు అర్థమైంది. నటీనటుల కో-ఆర్డినేటర్‌ వ్యవస్థ ప్రవేశం తర్వాత అది ఎంతగా వికృత రూపం దాల్చిందో కూడా కొంతమంది బాధితులు మాకు ఉదాహరణలతో సహా వివరించారు. ఆడిషన్‌కు పిలిచి అత్యాచారం చేసిన ఘటనలున్నాయి. బూతుల సంస్కృతి, అవమానకరంగా మాట్లాడడం లాంటివాటి గురించి ఇక చెప్పనక్కర్లేదు. ఇలా మహిళలపై సినిమా పరిశ్రమలో కొనసాగుతోన్న దోపిడీ తాలుకూ రూపాలు ఒకటా, రెండా... బహిర్గతం చేయలేని విస్తుగొల్పే విషయాలెన్నో మా దృష్టికి వచ్చాయి. కుటుంబాన్ని ధిక్కరించి మరీ ప్రతిభావంతులైన అమ్మాయిలు అభిరుచితో ఇక్కడకు వచ్చినా... అవమానాలు, హింస భరించలేక వెనక్కి వెళ్లిపోతున్నారు.


100-Navya.jpg

సినీ పరిశ్రమ అతీతమా?

సినిమా, టెలివిజన్‌ రంగంలోని ప్రతి స్టూడియో, యూనియన్‌, ప్రొడక్షన్‌ యూనిట్‌లతో సహా అన్ని విభాగాల్లో అంతర్గత ఫిర్యాదుల కమిటీని తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని ఆ నివేదికలో స్పష్టం చేశాం. పని ప్రదేశాల్లో లైంగిక వేధింపుల నిరోధక చట్టానికి సినిమా, టెలివిజన్‌, మీడియా పరిశ్రమ అతీతమా? చలనచిత్ర రంగంలోని మహిళల సమస్యలపై చర్చించడానికి సినిమా పెద్దలకే ఆసక్తి లేదని మాకు అర్థమవుతుంది. లేకపోతే, నాలుగేళ్ల కిందట తెలంగాణ మహిళా ట్రాన్స్‌జెండర్‌ జాయింట్‌ యాక్షన్‌ కమిటీ ప్రతినిధులు ఇచ్చిన నివేదికను ఇంతవరకు బహిర్గతం చేయపోవడం వెనుక మతలబు ఏంటి? ఇంతవరకు దానిపై కనీసం వారైనా అంతర్గతంగా చర్చించకపోవడం శోచనీయం. మేము ఆ నివేదికను జనబాహుళ్యంలో పెట్టకపోవడానికి ప్రధాన కారణం... గోప్యతకు భంగం కలిగించారన్న నెపంతో ప్రభుత్వం, సినిమారంగ పెద్దలు ఎక్కడ ఆ నివేదికను బుట్టదాఖలు చేస్తారన్న ఆందోళనే! ఇంకెంతకాలం సమస్యను గుప్పిట దాచి ఉంచుతారు? ఇప్పటికైనా నివేదికను ప్రభుత్వం బహిర్గతం చేయాలి. దీనిమీద చర్చించాలని సినీ పెద్దలకు నా సూచన.’’

సాంత్వన్‌

నిర్ణయాధికారంలో ఒక్కరూ లేరు

సినీ పరిశ్రమలోని 24 క్రాఫ్టులు, యూనియన్లలో సైతం నిర్ణయాధికారాల్లో అరకొర మినహా మహిళలు లేకపోవడం ఆ రంగంలోని మగస్వామ్యానికి నిదర్శనం. డ్యాన్స్‌, మేకప్‌, ఇతర యూనియన్‌ బాధ్యుల్లోని మగవాళ్ల దయాదాక్షిణ్యాల ఆధారంగా మహిళలకు పని అవకాశాలు వస్తాయి. అన్యాయాన్ని ప్రశ్నిస్తే భవిష్యత్తు ప్రశ్నార్థకమే! చిత్రీకరణ ప్రదేశాల్లో దుస్తులు మార్చుకోడానికి అనువైన గది, మరుగుదొడ్లు లాంటి కనీస వసతులను కూడా ఏర్పాటు చేయరు. వీటన్నిటిమీదా క్షుణ్ణంగా పరిశీలించిన సబ్‌ కమిటీ 50 పేజీలకుపైగా నివేదికను తయారు చేసి హైపవర్‌ కమిటీలోని వారందరితో పాటు అప్పటి ప్రభుత్వ ప్రధానకార్యదర్శికి, మిగతా శాఖల అధికారులకు 2022లో అందించాం. ఇప్పటివరకు దాని ఊసేలేదు.

ఇవీ చదవండి

మాకూ హెల్ప్ చేయండి! సుందర్ పిచాయ్‌కు భారతీయ విద్యార్థుల రిక్వెస్ట్

బీటెక్‌లో 17 బ్యాక్‌లాగ్స్.. అయినా వెనక్కు తగ్గలేదు.. ఐదేళ్లు గడిచేసరికి రూ.1.7 కోట్ల శాలరీ

Updated Date - Jan 29 , 2026 | 05:07 AM