Share News

కేన్స్‌లో చెరిగిన సౌందర్యపు సరిహద్దులు

ABN , Publish Date - May 27 , 2026 | 03:37 AM

ప్రపంచ సినీ, ఫ్యాషన్‌ రంగాల్లో అత్యంత ప్రతిష్ఠాత్మకమైన కేన్స్‌ రెడ్‌కార్పెట్‌పై ఈ ఏడాది ఒక సరికొత్త సంచలనం నమోదైంది. తమిళ మూలాలున్న మోడల్‌, కంటెంట్‌ క్రియేటర్‌...

కేన్స్‌లో చెరిగిన సౌందర్యపు సరిహద్దులు

ప్రపంచ సినీ, ఫ్యాషన్‌ రంగాల్లో అత్యంత ప్రతిష్ఠాత్మకమైన కేన్స్‌ రెడ్‌కార్పెట్‌పై ఈ ఏడాది ఒక సరికొత్త సంచలనం నమోదైంది. తమిళ మూలాలున్న మోడల్‌, కంటెంట్‌ క్రియేటర్‌... తబితా మేరీ తన అద్భుతమైన లుక్‌, ఆత్మవిశ్వాసంతో అందరి దృష్టినీ ఆకర్షించారు. అంతర్జాతీయ వేదికపై తన తొలి అడుగుతోనే ప్రపంచ ఫ్యాషన్‌ ప్రియులను ఆకట్టుకున్నారు.

బ్రిటి్‌ష-బంగ్లాదేశ్‌ ఫ్యాషన్‌ లేబుల్‌ ‘ఖానుమ్స్‌’ రూపొందించిన ప్రత్యేకమైన ‘లిక్విడ్‌ సిల్వర్‌’ మెటాలిక్‌ గౌనులో తబిత రెడ్‌కార్పెట్‌పై నడిచివచ్చారు. గ్రీక్‌ శైలిని ప్రతిబింబించేలా ఉన్న వన్‌ షోల్డర్‌ డిజైన్‌ ఆమెకు రాజసం తెచ్చిపెట్టింది. ఆమె గౌన్‌పై ఉన్న రన్‌ షోల్డర్‌ డీటెయిలింగ్‌, ముత్యాలు పొదిగిన నడుము భాగం ఆమె అందాన్ని రెట్టింపు చేశాయి. దక్షిణాసియా యాజమాన్యంలోని బ్రాండ్‌ను అంతర్జాతీయ వేదికపై ధరించడం ద్వారా ఆమె తన సాంస్కృతిక వారసత్వం పట్ల ఉన్న గర్వాన్ని చాటుకున్నారు.

రీఫ్రెషింగ్‌ లుక్‌

ఎలాంటి ఆర్భాటాలు లేని సహజమైన మేకప్‌, పొడవాటి నల్లటి జుట్టుతో తబిత లుక్‌ ఎంతో రీఫ్రెషింగ్‌గా ఉందంటూ ఫ్యాషన్‌ నిపుణులు ప్రశంసలు కురిపిస్తున్నారు. హెవీ స్టైలింగ్‌ జోలికి పోకుండా.. ఆమె తన నేచురల్‌ గ్లోను ప్రదర్శించిన తీరు అందరినీ ఆకట్టుకుంది. తబిత కేన్స్‌ అప్పియరెన్స్‌ ఒక ఫ్యాషన్‌ స్టేట్‌మెంట్‌గా మాత్రమే మిగిలిపోలేదు. ఇది అంతర్జాతీయంగా పాతకాలపు సౌందర్య ప్రమాణాలు, వర్ణ వివక్ష, సరైన ప్రాతినిధ్యం వంటి ముఖ్యాంశాలపై లోతైన చర్చను రేకెత్తించింది.

అరంగేట్రంలోనే...

2018లో కేవలం ఒక చిన్న అడ్వర్టైజింగ్‌ రంగంలో మక్కువతో మొదలైన ఆమె ప్రయాణం.. కొవిడ్‌ లాక్‌డౌన్‌ సమయంలో డిజిటల్‌ ప్లాట్‌ఫామ్‌గా రూపాంతరం చెందింది. ఈరోజు అది ప్రపంచవ్యాప్తంగా ఉన్న దక్షిణాసియా కమ్యూనిటీలకు గర్వకారణంగా మారింది. ఈ కేన్స్‌ ఫెస్టివల్‌లో తన అరంగేట్రంతో తబితా మేరీ కేవలం ఒక ఫ్యాషన్‌ క్రియేటర్‌గానే కాకుండా.. అంతర్జాతీయ ఫ్యాషన్‌, సినిమా రంగాల్లో వైవిధ్యాన్ని, సమసమాజ సౌందర్యాన్ని చాటిచెప్పే ఒక సరికొత్త గ్లోబల్‌ ఐకాన్‌గా అవతరించింది.


చిన్న పట్టణం నుంచి...

జర్మనీలోని ఒక చిన్న పట్టణంలో తమిళ అమ్మాయిగా పెరిగిన తబిత.. గతంలో కొన్ని ఇంటర్వ్యూలలో తనలాంటి వారు మీడియాలో కనిపించడం చాలా అరుదుగా ఉండేదని చెప్పారు. అలాంటిది ఇప్పుడు అదే అమ్మాయి ప్రపంచ వేదికపై తళుక్కుమనడం ఎంతోమందికి స్ఫూర్తిగా నిలిచింది. ఈ ఈవెంట్‌ ముగిసిన తర్వాత ‘నా లైఫ్‌లోనే బెస్ట్‌ మూమెంట్‌ను ఎంజాయ్‌ చేస్తున్నాను’ అంటూ ఆనందం పంచుకున్నారు. ఆమెను చూసిన నెటిజనం.. ‘వెండితెరపై మిమ్మల్ని చూడాలి’ అంటూ కామెంట్ల వర్షం కురిపించారు.

ఇవి కూడా చదవండి..

కర్ణాటకలో అధికార మార్పిడి కాదు, రాజ్యసభ ఎన్నికలపైనే చర్చించా... కాంగ్రెస్ అధిష్టానం

చొరబాట్లతో అసహజ జనాభా మార్పుపై కేంద్రం ఉన్నతస్థాయి కమిటీ.. అమిత్‌షా

Updated Date - May 27 , 2026 | 03:37 AM