Share News

శరణం గచ్ఛామి

ABN , Publish Date - May 01 , 2026 | 05:20 AM

మానవ పరిణామ క్రమంలో అత్యంత ముఖ్యమైన వ్యక్తిగా, ఒక గొప్ప అవతారంగా గౌతమ బుద్ధుణ్ణి సహజయోగ స్థాపకురాలు శ్రీమాతాజీ నిర్మలాదేవి అభివర్ణించారు. మానవ శరీరంలోని...

శరణం గచ్ఛామి

నేడు బుద్ధ జయంతి

సహజయోగ

మానవ పరిణామ క్రమంలో అత్యంత ముఖ్యమైన వ్యక్తిగా, ఒక గొప్ప అవతారంగా గౌతమ బుద్ధుణ్ణి సహజయోగ స్థాపకురాలు శ్రీమాతాజీ నిర్మలాదేవి అభివర్ణించారు. మానవ శరీరంలోని ఆజ్ఞాచక్రానికి కుడివైపున ఉండే బుద్ధుడు మనలోని అహంకారాన్ని నియంత్రించే శక్తి. మనల్ని ఆలోచనారహితమైన, నిర్విచారమైన స్థితికి ఆయన తీసుకువెళ్తాడు.

మనుషులకు ఉన్న అతి పెద్ద సమస్య ‘అహంకారం’ అని బుద్ధుడు గుర్తించాడు. ‘అన్ని పనులను నేనే చేస్తున్నాను’ అని అహంకారంతో మనం అనుకున్నప్పుడు... అది మన సూక్ష్మ శరీరంలోని పింగళా నాడిని, మన మెదడును ప్రభావితం చేస్తుంది. అంతేకాదు... ‘మన కోరికలే మన దుఃఖానికి కారణం’ అని కూడా బుద్ధుడు చెబుతాడు. ప్రాపంచికమైన విషయాల మీద మనం విపరీతమైన కోరికలు పెంచుకున్నప్పుడు... మన చిత్తం ఎప్పుడూ బాహ్యపరంగానే ఉంటుంది. కోరికలను విడిచిపెట్టినప్పుడే చిత్తం లోపలికి మళ్ళుతుంది. తద్వారా మనలోని కుండలినీ శక్తి జాగృతం అవుతుంది. జీవనంలో మధ్యేమార్గం ఉత్తమం. అంటే అతిగా విలాసాల్లో మునిగిపోకూడదు. అలాగని శరీరాన్ని హింసించే కఠినమైన సాధనలు చేయకూడదు. జీవితంలో సమతుల్యతే ఆధ్యాత్మికమైన ఎదిగుదలకు పునాది. అది బుద్ధుడు చూపించిన మార్గం. బుద్ధుడు అవతార పురుషుడు. మానవునిగా పుట్టి, సత్యాన్ని అన్వేషించడం ద్వారా మనకు మార్గదర్శిగా నిలిచాడు. ఆయన బోధనలు కేవలం మేధస్సుకు సంబంధించినవి కాదు... అవి హృదయపూర్వకమైన కరుణతో కూడుకున్నవి.

మూడు సూత్రాలు... అంతరార్థాలు

బౌద్ధ మతంలో మూడు ముఖ్యమైన సూత్రాలు లేదా మంత్రాలు ఉన్నాయి. వాటిని ‘బుద్ధ స్తోత్రం’ అని కూడా అంటారు. అవి: బుద్ధం శరణం గచ్ఛామి, ధమ్మం శరణం గచ్ఛామి, సంఘం శరణం గచ్ఛామి. వాటి అంతరార్థాన్ని తెలుసుకుందాం. మొదటిది: బుద్ధం శరణం గచ్ఛామి. ‘నేను బుద్ధుణ్ణి శరణు వేడుకుంటున్నాను’ అనేది సాధారణమైన అర్థం. కాగా... ఇక్కడ ‘బుద్ధ’ అంటే జాగృతి చెందిన స్థితి లేదా జ్ఞానోదయం పొందిన ఆత్మ.... అంటే ‘నాలోని ఆత్మను నేను శరణు వేడుకుంటున్నాను’ అని అర్థం. రెండోది: ధర్మం శరణం గచ్ఛామి. ‘నేను ధర్మాన్ని శరణు వేడుకుంటున్నాను’ అనేది సాధారణ అర్థం. ‘ధర్మం’ అంటే కేవలం మతం కాదు. అది మనలోని సమతుల్య స్థితి. మన సూక్ష్మ శరీరంలోని నాభీ చక్రానికి సంబంధించినది మానవుడు ధార్మికతతో ఎలా జీవించాలో తెలిపే అంతర్గత నియమమే అర్థం. మనం ధర్మబద్ధంగా ఉన్నప్పుడే కుండలినీ శక్తి పైకి ప్రవహిస్తుంది. కాబట్టి ‘నేను విశ్వజనీనమైన ధర్మాన్ని, నాలోని సమతుల్యతను శరణు వేడుకుంటున్నాను’ అనేది దీని అంతరార్థం. మూడోది: సంఘం శరణం గచ్ఛామి. అంటే ‘నేను సంఘాన్ని, సామూహికతను శరణు వేడుకుంటున్నాను’ అని అర్థం. ఇక్కడ ‘సంఘం’ అంటే సామూహిక చైతన్యం. ఇది విశుద్ధ చక్రానికి సంబంధించినది.


మనం ఒంటరిగా కాకుండా, అందరితో కలిసి ఉన్నప్పుడే ఆధ్యాత్మికంగా మన ఎదుగుదల పరిపూర్ణమవుతుంది. ‘నేను సాధువుల లేదా సత్యాన్ని కోరేవారి సమష్టి చైతన్యాన్ని శరణు వేడుకుంటున్నాను’ అని దీని అర్థం. సూక్ష్మంగా చెప్పాలంటే... బుద్ధం: మీలోని అహంకారాన్ని విడనాడి జ్ఞానాన్ని పొందడం. ధమ్మం: మీ జీవితంలో క్రమశిక్షణను, సమతుల్యతను పాటించడం. సంఘం: అందరిలోనూ దైవత్వాన్ని చూస్తూ... సమష్టిగా ఎదగడం. బుద్ధుణ్ణి ఆరాధించాలంటే కేవలం మంత్రాలను ఉచ్చరించడం మాత్రమే కాదు... వాటిని అనుభూతి చెంది మనలో అన్వయించుకోవడం చాలా ముఖ్యం. అలా అన్వయించుకోవడం ద్వారా ఒక వ్యక్తి సంపూర్ణమైన ఆధ్యాత్మిక ఉన్నతిని పొందగలడని శ్రీమాతాజీ నిర్మలాదేవి వివరించారు.

రాజ్యం వదిలి అన్వేషకుడై...

శాక్యవంశానికి చెందిన యువరాజు సిద్దార్థుడు. అన్నిటినీ రాజభోగాలను, రాజ్యాన్ని, కుటుంబాన్ని విడిచి వెళ్ళడం సామాన్యమైన విషయం కాదు. కానీ ఆయనలో మొదటి నుంచీ ఏదో తపన ఉండేది. కటిక దరిద్రంలో ఉన్న పేదవాడు, మరణించడానికి సిద్ధంగా ఉన్న వ్యక్తి, మరణించిన వ్యక్తిని శ్మశానానికి తీసుకు వెళ్ళడం.. ఈ దృశ్యాలు ఆయనలో అంతర్మధనం కలిగించాయి. ‘మనుషులు ఇన్ని బాధలు, కష్టాలు పడుతున్నారు. వాటన్నిటికీ కారణమేమిటి? వారు ఎంత ఘోరంగా ఎందుకు జీవిస్తున్నారు? ఈ మానవ జీవితానికి అర్థం ఏమిటి?’ అనే ప్రశ్నలకు సమాధానాల కోసం అన్వేషణ ప్రారంభించాడు. చివరకు తనను తాను తెలుసుకోవడం వల్లనే ఆత్మసాక్షాత్కారం సాధ్యమని తెలుసుకున్నాడు. బోధి వృక్షం కింద విశ్రమించినప్పుడు... అప్రయత్నంగా జ్ఞానోదయం అయింది. సిద్ధార్థుడు... గౌతమ బుద్ధుడు అయ్యాడు. ‘‘ఆధ్యాత్మిక ఉన్నతి సాధించడానికి ఘోర తపస్సులు, మూఢాచారాల ఆచరణ అవసరం లేదు. మనకు బంధరాహిత్యం ఉండాలి. అది అంతర్లీనంగా ఉండాలి ’’అని బోధించాడు సహజయోగ సాధకులు తమ నిత్య ధ్యాన కార్యక్రమంలో... తమ కుడి ఆజ్ఞాచక్రంలో ఉన్న బుద్ధుణ్ణి ధ్యానిస్తూ... బుద్ధుని లక్షణాలైన నిరంహంకారాన్ని, క్షమాతత్వాన్ని స్థిరపరుచుకొనే ప్రయత్నం చేస్తారు. బుద్ధ జయంతిని ప్రపంచవ్యాప్తంగా... సామూహికంగా జరుపుకొంటారు.


బుద్ధుని జీవితంలో క్షమాగుణానికి సంబంధించిన ఒక అద్భుతమైన ఘటన ఉంది. ఒకసారి ఒక వ్యక్తి ఆయన దగ్గరకు వచ్చి... ఏ కారణం లేకుండానే ఆయనను దూషించాడు. బుద్ధుడు ఏమాత్రం చలించకుండా ‘‘నీవు ఇంకా ఏమైనా చెప్పాలనుకుంటున్నవా?’’ అని అడిగాడు. ఆ వ్యక్తి ఆశ్చర్యపడి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. మరుసటిరోజు తన తప్పు తెలుసుకొని వచ్చి బుద్ధుడి పాదాల మీద పడి ‘‘నన్ను క్షమించండి’’ అని వేడుకున్నాడు. అప్పుడు బుద్ధుడు ‘‘నిన్నటి నీవు వేరు. ఈ రోజు పశ్చాత్తావంతో ఉన్న నీవు వేరు. నీవు చేసిన పనికి బాధపడడానికి నిన్నటి బుద్ధుడు కూడా ఈ రోజు లేడు. ‘నిన్న’ అనేది గతించింది. ప్రవహించే నదిలో నీరు ఎలా శాశ్వతం కాదో... కాలం కూడా అలాంటిదే. క్షణక్షణానికీ మారిపోతూ ఉంటుంది. కాబట్టి గడచిపోయినదాని గురించి చింతించకు’’ అని చెప్పాడు. మన హృదయంలో కోపం లేదా పగ పెంచుకుంటే మన ఆజ్ఞాచక్రం అంటే నుదురు భాగం మూసుకుపోతుంది. అప్పుడు కుండలినీ శక్తి పైకి ప్రవహించలేదు. ‘బుద్ధుడిలా నేను అందరినీ హృదయపూర్వకంగా క్షమిస్తున్నాను’ అనుకోవడం వల్ల మనలోని అహంకారం కరిగిపోతుంది. మనశ్శాంతి లభిస్తుంది.

డాక్టర్‌ పి. రాకేష్‌, 8988982200

‘పరమ పూజ్యశ్రీ మాతాజీ నిర్మలాదేవి

సహజయోగ ట్రస్ట్‌’, తెలంగాణ

ఇవి కూడా చదవండి

స్పెషల్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు రెగ్యులర్‌గా మార్పు

చైల్డ్ ట్రాఫికింగ్.. ఫెర్టిలిటీ సెంటర్లపై గుజరాత్ పోలీసుల దాడులు

Updated Date - May 01 , 2026 | 05:20 AM