బౌద్ధం పల్లవించిన నేల
ABN , Publish Date - May 01 , 2026 | 05:23 AM
వైశాఖ పౌర్ణమి ఎంతో ప్రత్యేకమైన రోజు. గౌతమ బుద్ధుడు జన్మించిన రోజే కాదు, ఆయన జ్ఞానోదయం పొందినదీ, మహా పరినిర్వాణాన్ని పొందినదీ ఈ రోజే. ఈ పవిత్రమైన..
నేడు బుద్ధ జయంతి
ధర్మపథం
వైశాఖ పౌర్ణమి ఎంతో ప్రత్యేకమైన రోజు. గౌతమ బుద్ధుడు జన్మించిన రోజే కాదు, ఆయన జ్ఞానోదయం పొందినదీ, మహా పరినిర్వాణాన్ని పొందినదీ ఈ రోజే. ఈ పవిత్రమైన రోజును ప్రపంచవ్యాప్తంగా బౌద్ధులు ‘వేసాక్’ పండుగగా భక్తి శ్రద్ధలతో జరుపుకొంటారు.
రాజకుమారుడైన సిద్ధార్థుడు జీవితంలో దుఃఖాలను చూసి, వాటిని సంపూర్ణంగా రూపుమాపాలని సంకల్పించాడు. సర్వ సౌఖ్యాలను పరిత్యజించి, తపోధ్యాన నిష్టలతో... బుద్ధ గయలో సాధన చేసి, చివరకు సమాధానాన్ని కనుక్కోగలిగాడు. బుద్ధునిగా మారాడు. లోకానికి అహింస, సత్యం, శాంతి, దయా మార్గాలను చూపించాడు. చతురార్య సత్యాలతో, అష్టాంగ మార్గం ద్వారా మనిషి ఉత్కృష్ట జీవితం ఎలా గడపాలో తను ఆచరించాడు, ఉపదేశించాడు.
జ్ఞానపిపాసి బావరి...
ప్రాచీన కాలంలో ఆంధక దేశంగా విఖ్యాతి పొందిన ఈ తెలుగు భూమి... బౌద్ధ ధర్మ చరిత్రలో ఒక దివ్య అధ్యాయంగా నిలిచింది. ఈ నేల బుద్ధుని బోధలను ఆహ్వానించడమే కాదు... వాటిని ఆత్మలో నిలుపుకొంది. తాత్త్విక వికాసానికి, ఆధ్యాత్మిక ప్రసారానికి కేంద్రబిందువయింది. గోదావరి తీరంలో తపస్సంపన్నుడైన బావరి మహర్షి నుంచి శూన్యతాతత్త్వాన్ని విశదీకరించిన నాగార్జునుడి వరకు... ఈ ప్రాంతం బౌద్ధంతో అంతర్లీనంగా అనుసంధానమయింది. బావరి కథ ఆ అనుబంధానికి తొలి సాక్ష్యంగా నిలుస్తుంది. గోదావరి నదీ తీరాన ఆశ్రమవాసిగా నివసించిన బావరి... జ్ఞానపిపాసతో నిండిన మహర్షి. బుద్ధుడు బోధి సంపూర్ణుడై వెలుగొందిన వార్త విని... తన శిష్యులను ఆయన సన్నిధికి పంపించాడు. వారు బుద్ధుని దర్శించి, బుద్ధ వాక్యామృతాన్ని ఆస్వాదించి, సత్య సాక్షాత్కారాన్ని పొందారు. ఈ ఘట్టం ద్వారా... బుద్దుని జీవిత కాలంలోనే ఆంధక దేశానికి బౌద్ధ ధర్మ ప్రవాహం చేరినట్టు స్పష్టమవుతుంది. తరువాత ఈ ప్రాంతం బౌద్ధ సంస్కృతికి పుష్టిని ఇచ్చిన పుణ్యభూమిగా పరిణమించింది. కృష్ణా, గోదావరి నదుల సస్యశ్యామల తీరాలు సంపన్న జీవన విధానాన్ని ప్రసాదించి... విహారాలు, స్తూపాలు, చైత్యాల నిర్మాణానికి దోహదపడ్డాయి. అమరావతి, నాగార్జున కొండ, ధూలికట్ట లాంటి క్షేత్రాలు నేటికీ ఆ వైభవానికి సాక్ష్యాలుగా నిలుస్తున్నాయి. అక్కడి శిలాశాసనాలు, శిల్ప కళాకృతులు, విహారావశేషాలు... ఇవన్నీ కలిసి బౌద్ధం ఈ నేలపై ఎంతగా విస్తరించిందో మౌనంగా వివరిస్తున్నాయి.
నాగార్జునుడి ‘శూన్యతా’ సూత్రం
ఈ ఆధ్యాత్మిక వేదికపై ప్రకాశించిన మహామేధావి నాగార్జునుడు. ఆయన మహాయాన బౌద్ధంలో మాధ్యమిక తత్త్వానికి రూపకల్పన చేసి... ‘శూన్యత’ అనే సూత్రాన్ని లోతుగా ప్రతిపాదించాడు. సర్వ ధర్మాలకూ స్వతంత్ర రూపం లేదని, పరస్పరాధారితత్వమే సత్యమనీ ఆయన బోధించాడు. ఈ తాత్త్విక దృక్పథం బౌద్ధాన్ని మరింత విశాలంగా, లోతుగా విస్తరింపజేసింది. ఆయన శిష్యుల్లో ఆర్యదేవుడు లాంటి ఆచార్యులు కూడా ఈ తత్త్వ జ్ఞానాన్ని మరింత ప్రచారం చేశారు.
మళ్ళీ మళ్ళీ జన్మించడమే దుఃఖం
ఈనాడు కొందరు బౌద్ధాన్ని వారు నమ్మిన సిద్ధాంతాలతో జోడించి... తదనుగుణంగా బుద్ధుడి బోధనలను వ్యాఖ్యానించడం విచారకరం. అసలు బుద్ధుడు ఏ విషయాలను వివరించాడో తెలుసుకోకుండా... సామ్యవాది అని కొందరు అంటే, మరికొందరు వర్ణ వ్యవస్థను నిర్మూలించడానికి మాత్రమే అవతరించిన సామాన్య సమాజోద్ధారకుడిగా వర్ణించడం శోచనీయం. బౌద్ధం ఆచార ప్రధానమైనది. వ్యక్తి నైతిక సదాచారాలతోనే మోక్ష మార్గంలోకి ప్రవేశించగలుగుతాడని బుద్ధుడు వివరించాడు. దుఃఖ నిరోధమే నిర్వాణం. ‘దుక్ఖా జాతి పునప్పునంఖ’ (మళ్ళీ మళ్ళీ జన్మించడమే దుఃఖం) అన్న బుద్ధుడి తాత్త్వికోపదేశమే శంకరుల ద్వారా ‘పునరపి జననం పునరపి మరణం’ అనిపించింది. బౌద్ధ సాహిత్యం సంస్కృత, పాళీ భాషలలో సమృద్ధమై విలసిల్లింది. కాని నేడు రెండు కారణాలవల్ల ఆ అద్భుత సాహిత్యం మరుగునపడింది. అందులో మొదటిది... ఇంత విశాలమైన సాహిత్యాన్ని చదివే నాథులే లేరు, రెండోది... ఈ అద్భుత సాహిత్యాన్ని చదవకుండానే ఇది నాస్తికమని, సనాతన విరుద్ధమని భావించడం. ఇది దురదృష్టకరం. బుద్ధుని బోధనలను అందరూ చదివి తీరాలి.
ఆంధక దేశంలోని విహారాలు ప్రార్థనాలయాలుగానే కాకుండా... జ్ఞాన కేంద్రాలుగా, తాత్త్విక సంభాషణలకు వేదికలుగా వికసించాయి. వాణిజ్య మార్గాల సామీప్యం ఈ ప్రాంతాన్ని శ్రీలంక, దక్షిణాసియా దేశాలతో అనుసంధానించింది, బౌద్ధ ధర్మాన్ని సముద్రాలు దాటి విస్తరింపజేసింది. అమరావతి శిల్ప కళలో బుద్ధుని జీవగాథలు, జాతక కథలు సజీవ చిత్రాల్లా ఆవిష్కృతమై, దర్శనార్థులను ధ్యాన ముగ్ధుల్ని చేస్తాయి. ఆ శిల్ప రేఖల్లో తత్త్వం పలుకుతుంది. ఆ కళలో కరుణ నిండుగా కనిపిస్తుంది.
పవిత్రమైన బుద్ధ జయంతిరోజున మనం మనలోని కోపం, ద్వేషం, అసూయలను వదిలిపెట్టాలి, ప్రేమ, దయ, సహనంతో జీవించడానికి ప్రయత్నించాలి. పేదలకు సహాయం చేయాలి. ఇతరులకు సంతోషం కలిగించాలి. అదే బుద్ధుడికి నిజమైన నివాళి.
ఆచార్య చౌడూరి ఉపేంద్రరావ్,
జేఎన్‌యు, న్యూఢి ల్లీ,
98189-69756
ఇవి కూడా చదవండి
స్పెషల్ ఎక్స్‌ప్రెస్ రైలు రెగ్యులర్‌గా మార్పు
చైల్డ్ ట్రాఫికింగ్.. ఫెర్టిలిటీ సెంటర్లపై గుజరాత్ పోలీసుల దాడులు