Share News

పరిష్కారం ఆయనదే!

ABN , Publish Date - Jul 24 , 2026 | 05:05 AM

అది నీనెవె పట్టణం. అక్కడ తోబితు అనే వ్యక్తి ఉండేవాడు. అతను నీతిమంతుడు, పేదలకు సాయం చేసేవాడు. అతను యుక్తవయసు నుంచి సామాజిక కార్యక్రమాలలో..

పరిష్కారం ఆయనదే!

దైవమార్గం

అది నీనెవె పట్టణం. అక్కడ తోబితు అనే వ్యక్తి ఉండేవాడు. అతను నీతిమంతుడు, పేదలకు సాయం చేసేవాడు. అతను యుక్తవయసు నుంచి సామాజిక కార్యక్రమాలలో నిమగ్నమయ్యేవాడు. మరణించిన వారిని పాతి పెట్టడం కోసం ఒక రోజు అతను శ్మశానానికి వెళ్ళాడు. ఒక చెట్టు కింద నిలబడి, దానిపై ఉన్న పిట్టలను చూస్తున్నాడు. ఇంతలో ఆ పిట్టలు రెట్ట వేశాయి. ఆ రెట్ట అతని కంటిలో పడి చూపును కోల్పోయాడు. అందరూ అతణ్ణి ‘గుడ్డివాడు’ అని హేళన చేసేవారు. అతని మనసు నొచ్చుకొనేది.

తోబితు భార్య నేత పని చేసేది. ఆ పనిని మెచ్చుకున్న ఒక ధనికుడు మేకపిల్లను ఆమెకు బహుమానంగా ఇచ్చాడు. కానీ బహుమానాలను తీసుకోకూడదనీ, ఇతరుల దానాలకు, ఐశ్వర్యాలకు మోజు పడకూడదని భార్యకు తోబితు హితవు చెప్పాడు.

తోబితుకు ఒక కుమారుడు. అతని పేరు తోబియా. తండ్రి చేసే మంచి పనుల్లో అతను భాగం పంచుకొనేవాడు. అతని ఎదుట రెండు సమస్యలు ఉన్నాయి. మొదటిది... తండ్రికి కళ్ళు రప్పించడం. రెండోది... సారా అనే మహిళను పీడిస్తున్న దెయ్యాన్ని తరిమికొట్టడం. సారా కథేమిటంటే... ఆమెకు ఒకేసారి ఏడుగురితో వివాహమయింది. పెళ్ళి రోజే ఆ ఏడుగురినీ ఒక దెయ్యం చంపేసింది. దాంతో ఇక తాను బతకడం దేనికని... మరణం కోసం దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉండేది.

ఇదిలా ఉండగా... ఒక రోజు తనకు రావలసిన డబ్బును తీసుకురావాలని తోబియాను తండ్రి తోబితు వేరే ప్రాంతానికి పంపించాడు. దారిలో తోబియాకు ఒక వ్యక్తి పరిచయమయ్యాడు. తన పేరు అజర్యా అని చెప్పాడు. నిజానికి ఆ వ్యక్తి ఒక మహా శక్తి... దేవదూత రఫాయేలు. మనిషి రూపంలో తోబియాకు తోడుగా బయలుదేరాడు. వారిద్దరూ కలిసి ప్రయాణిస్తూ ఉండగా... దారిలో టైగ్రిస్‌ నది ఎదురయింది. అందులో ఒక పెద్ద చేప కనిపించింది. ఉపాయంగా వాళ్ళు దాన్ని పట్టుకున్నారు. ఈ చేప గుండె, కాలేయం... దయ్యాలను తరమడానికి కంటి చూపు రప్పించడానికి పనికొస్తాయని తోబియాకు రఫాయేలు చెప్పాడు.

వారిద్దరూ సారా ఇంటికి చేరుకున్నారు. సారాను తోబియా వివాహం చేసుకున్నాడు. ఇంతలో దెయ్యం వచ్చింది. రఫాయేలు సూచన మేరకు చేప కాలేయాన్ని తోబియా కాల్చాడు. వెంటనే ఆ దెయ్యం పారిపోయింది. సారాకు పూర్తి రక్షణ లభించింది.


ఆ తరువాత భార్యతో, దేవదూతతో కలిసి తోబియా తమ ఇంటికి వెళ్ళాడు. తన రాక ఆలస్యం కావడంతో ఆందోళన చెందుతున్న తల్లిదండ్రులకు ఊరట కలిగించాడు. చేప నుంచి ద్రవాన్ని తీసి తండ్రి కళ్ళకు పూశాడు. తోబితుకు చూపు వచ్చింది. అలా తోబియా రెండో సమస్య కూడా పరిష్కారమయింది. ‘‘సంఘం నీతిగా ఉండాలంటే వ్యక్తులు విలువలను కాపాడుకోవాలి. దేవుడు నీతిమంతులను విడిచిపెట్టడు. ప్రార్థన, దానం, ఉపవాసం విశ్వాసులకు రక్షణ కలిగిస్తాయి. సమస్య మనదే అయినా దానికి పరిష్కారం అందించేది దేవుడే’’ అనే సందేశం ఇచ్చి దేవదూత రఫాయేలు అదృశ్యమయ్యాడు. దేవదూతను పంపి తమను అనుగ్రహించిన దేవుణ్ణి తోబితు కుటుంబమంతా స్తుతించింది. ఇది కథోలిక బైబిల్‌లోని కథ.

డాక్టర్‌ యం. సోహినీ బెర్నార్డ్‌

9866755024

ఇన్‌స్టా స్టోరీలో 'కాక్రోచ్' పోస్ట్.. వివాదంలో ఆర్ఏఎఫ్ ఆఫీసర్ సోనియా!

ప్రధాని నివాసం ముందు కాంగ్రెస్ నిరసన.. వాంగ్‌చుక్ భార్య విమర్శలు

Updated Date - Jul 24 , 2026 | 05:05 AM