చామదుంపలతో వెరైటీగా
ABN , Publish Date - Jun 27 , 2026 | 01:48 AM
చామదుంపలతో పులుసు, వేపుడు, కూర చేసుకుని ఇష్టంగా తింటూ ఉంటాం. వీటితోపాటు రకరకాల మాంసాహార రుచులు, విభిన్నమైన స్నాక్స్ కూడా తయారుచేసుకుని...
వంటిల్లు
చామదుంపలతో పులుసు, వేపుడు, కూర చేసుకుని ఇష్టంగా తింటూ ఉంటాం. వీటితోపాటు రకరకాల మాంసాహార రుచులు, విభిన్నమైన స్నాక్స్ కూడా తయారుచేసుకుని ఆస్వాదించవచ్చు. చామదుంపలతో ఇంట్లోనే సులువుగా వండే వెరైటీ రుచులు మీ కోసం...
చామదుంపల మటన్ కర్రీ
కావాల్సిన పదార్థాలు: చామదుంపలు- పావు కేజీ, మటన్ ముక్కలు- అర కేజీ, నూనె- నాలుగు చెంచాలు, ఉల్లిపాయ ముక్కలు- ఒక కప్పు, టమాటా ముక్కలు- అర కప్పు, అల్లం వెల్లుల్లి పేస్టు- చెంచా, పసుపు- అర చెంచా, కారం- రెండు చెంచాలు, ఉప్పు- తగినంత, ధనియాల పొడి- చెంచా, గరం మసాలా పొడి- చెంచా, కొత్తిమీర తరుగు- కొద్దిగా
తయారీ విధానం: చామ దుంపలను శుభ్రంగా కడిగి మధ్యకు కోసి కుక్కర్‌లో వేసి గ్లాసు నీటిని పోసి రెండు విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలి. తరువాత వాటిని చల్లార్చి తొక్కతీసి పెట్టుకోవాలి. స్టవ్ మీద పాన్ పెట్టి మూడు చెంచాల నూనె వేసి చామదుంపల ముక్కలు వేసి దోరగా వేయించాలి.
స్టవ్ మీద కుక్కర్ పెట్టి నూనె వేసి వేడయ్యాక ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్టు వేసి కలపాలి. అయిదు నిమిషాల తరువాత మటన్ ముక్కలు, టమాటా ముక్కలు, పసుపు, ఉప్పు, కారం, ధనియాల పొడి వేసి బాగా కలపాలి. ఇవి పది నిమిషాలు వేగిన తరువాత ఒకటిన్నర కప్పుల నీటిని పోసి మూతపెట్టి నాలుగు విజిల్స్ వచ్చే వరకు ఉడికించి దించాలి. తరువాత మూత తీసి కుక్కర్‌ను మరల స్టవ్‌పై పెట్టి అందులో ముందుగా వేయించి పెట్టుకున్న చామదుంపల ముక్కలు, గరం మసాలా పొడి వేసి నెమ్మదిగా కలపాలి. పది నిమిషాలు మగ్గించి ఉప్పు సరి చూసుకుని కొత్తిమీర తరుగు చల్లి స్టవ్ మీద నుంచి దించాలి. ఇలా తయారుచేసుకున్న చామదుంపల మటన్ కర్రీని చపాతీ, పుల్కా, వేడన్నం, బగారా రైస్‌తోపాటు సర్వ్ చేసుకోవచ్చు.
చామదుంపల సూప్
కావాల్సిన పదార్థాలు: చామదుంపలు- పావు కేజీ, బ్రోకలీ ముక్కలు- కప్పు, నానబెట్టిన సోయా బీన్స్- పావు కప్పు, వెన్న- రెండు చెంచాలు, అల్లం తరుగు- చెంచా, వెల్లుల్లి తరుగు- చెంచా, పచ్చి మిర్చి- రెండు, ఉల్లిపాయలు- రెండు, కరివేపాకు- కొద్దిగా, ఉప్పు- తగినంత, జాజికాయ పొడి- పావు చెంచా, మిరియాల పొడి- అర చెంచా, ఫ్రెష్ క్రీమ్- చెంచా, ఛీజ్ తురుం- కొద్దిగా, కొత్తిమీర తరుగు- కొద్దిగా
తయారీ విధానం: ముందుగా చామదుంపలను ఉడికించి తొక్కతీసి ముక్కలు కోసి పెట్టుకోవాలి. స్టవ్ మీద పాన్ పెట్టి వెన్న వేసి అది కరిగిన తరువాత అల్లం తరుగు, వెల్లుల్లి తరుగు, పచ్చి మిర్చి ముక్కలు, ఉల్లిపాయల ముక్కలు, కరివేపాకు వేసి కలిపి దోరగా వేగనివ్వాలి. తరువాత చామదుంపల ముక్కలు, బ్రోకలీ ముక్కలు, సోయా బీన్స్ వేసి రెండు గ్లాసుల నీళ్లు పోసి ఉడికించాలి. తరువాత ఉప్పు, మిరియాల పొడి, జాజికాయ పొడి, ఫ్రెష్ క్రీమ్ వేసి కలిపి స్టవ్ మీద నుంచి దించాలి. ఈ సూప్‌ని సర్వింగ్ బౌల్‌లోకి తీసుకుని పైన ఛీజ్ తురుం, కొత్తిమీర తరుగు వేసి వేడి వేడిగా సర్వ్ చేయాలి.
చామ దుంపల టిక్కీ
కావాల్సిన పదార్థాలు: చామదుంపలు- పావు కేజీ, బియ్యప్పిండి- అయిదు చెంచాలు, కార్న్‌ఫ్లోర్- చెంచా, ఉల్లిపాయ- ఒకటి, పచ్చి మిర్చి- మూడు, కరివేపాకు- కొద్దిగా, జీలకర్ర- అర చెంచా, అల్లం వెల్లుల్లి పేస్టు- అర చెంచా, కారం- అర చెంచా, ఉప్పు- అర చెంచా, నూనె- డీప్ ఫ్రైకి తగినంత
తయారీ విధానం: ముందుగా చామదుంపలను శుభ్రంగా కడిగి గిన్నెలోకి తీసుకుని నీళ్లు పోసి మెత్తగా ఉడికించుకోవాలి. వాటికి తొక్కతీసి పప్పు గుత్తితో మెదిపి గుజ్జులా చేసుకోవాలి. అందులో బియ్యప్పిండి, కార్న్‌ఫ్లోర్, ఉల్లిపాయ ముక్కలు, పచ్చి మిర్చి ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్టు, జీలకర్ర, ఉప్పు, కారం, కరివేపాకు తరుగు వేసి ముద్దలా కలపాలి. చేతికి నూనె రాసుకుని కొద్ది కొద్దిగా పిండిని తీసుకుంటూ చిన్న టిక్కీల మాదిరి చేయాలి. స్టవ్ మీద కడాయి పెట్టి నూనె పోసి వేడిచేయాలి. తరువాత టిక్కీలు వేసి రెండు వైపులా దోరగా వేయించి పళ్లెంలోకి తీయాలి. పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్‌గా ఉండే ఈ చామదుంపల టిక్కీలను టమాటా సాస్ లేదా మింట్ చట్నీతో సర్వ్ చేయవచ్చు.
చామదుంపల కోడిగుడ్డు పులుసు
కావాల్సిన పదార్థాలు: చామదుంపలు- పావు కేజీ, కోడిగుడ్లు- అయిదు, పచ్చిమిర్చి- 5, చింతపండు- తగినంత, ఉల్లిపాయలు- రెండు, నూనె- అయిదు చెంచాలు, పసుపు- పావు చెంచా, జీలకర్ర- అర చెంచా, ఆవాలు- పావు చెంచా, మెంతులు- పావు చెంచా, ఎండు మిర్చి- రెండు, మెంతికూర- కొద్దిగా, ఉప్పు- చెంచా, కారం- చెంచా, పచ్చి మిర్చి- రెండు, ఆవాలు-జీలకర్ర-మెంతుల పొడి- అర చెంచా, బెల్లం పొడి- చెంచా, కొత్తిమీర- కొద్దిగా, కరివేపాకు- కొద్దిగా
తయారీ విధానం: చింతపండును నీళ్లలో నానబెట్టుకోవాలి. చామదుంపలకు తొక్కతీసి గుండ్రని ముక్కలుగా కోసి పెట్టుకోవాలి. కోడిగుడ్లు ఉడికించి పెంకు తీసి ఫోర్క్‌తో గాట్లు పెట్టుకొని ఉంచుకోవాలి. స్టవ్ మీద కడాయి పెట్టి నూనె వేసి వేడయ్యాక పసుపు, కోడిగుడ్లు వేసి దోరగా వేయించి పళ్లెంలోకి తీయాలి. తరువాత కడాయిలో ఆవాలు, జీలకర్ర, మెంతులు, ఎండు మిర్చి ముక్కలు, మెంతి కూర తరుగు, కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు వేసి దోరగా వేయించాలి. ఆపైన చామదుంపల ముక్కలు, అర చెంచా ఉప్పు, అర చెంచా కారం, పచ్చి మిర్చి ముక్కలు వేసి బాగా కలిపి మూతపెట్టి చిన్న మంట మీద మగ్గించాలి. తరువాత మూతతీసి గ్లాసు నీళ్లు పోసి పావు గంటసేపు ఉడికించాలి. ఆపైన ఉడికించిన కోడిగుడ్లు, అర చెంచా కారం, అర చెంచా ఉప్పు వేసి చింతపండు పులుసు పోసి బాగా కలపాలి. అవి అయిదు నిమిషాలు ఉడికిన తరువాత ఆవాలు-జీలకర్ర-మెంతుల పొడి, బెల్లం పొడి వేసి కలపాలి. చివరగా కొత్తిమీర తరుగు వేసి స్టవ్ మీద నుంచి దించాలి.
ఇవి కూడా చదవండి
విగ్ కారణంగానే కేతన్ హత్య.. తండ్రి ఏమన్నారంటే..
IND vs IRE: టాస్ గెలిచిన భారత్.. బ్యాటింగ్ ఎవరిదంటే..