ఇంట్లోనే హెయిర్ స్పా!
ABN , Publish Date - Aug 06 , 2026 | 03:21 AM
ఆఫీసు పనులు, ఇంటి పనులతో సతమయ్యే మహిళలకు, స్వీయ శ్రద్ధకు సమయం చిక్కదు. దాంతో హెయిర్ కేర్ ప్రధానంగా నిర్లక్ష్యానికి గురవుతూ ఉంటుంది. సెలూన్లకు వెళ్లే తీరిక లేని వాళ్లు, ఇదిగో ఇలా..
బ్యూటీ
ఆఫీసు పనులు, ఇంటి పనులతో సతమయ్యే మహిళలకు, స్వీయ శ్రద్ధకు సమయం చిక్కదు. దాంతో హెయిర్ కేర్ ప్రధానంగా నిర్లక్ష్యానికి గురవుతూ ఉంటుంది. సెలూన్లకు వెళ్లే తీరిక లేని వాళ్లు, ఇదిగో ఇలా ఇంట్లోనే హెయిర్ స్పా చేసుకుని, వెంట్రుకల అందాన్నీ, ఆరోగ్యాన్నీ పెంచుకోవచ్చు.
పోషణ కొరవడిన శిరోజాలు నిర్జీవంగా, పొడిగా మారిపోయి, విరిగిపోతుంటాయి. ఈ పరిస్థితి తలెత్తకుండా ఉండాలంటే, సహజసిద్ధ దినుసులతో శిరోజాలకు పోషణను అందించాలి. అందుకోసం ఏం చేయాలంటే...
గోరువెచ్చని నూనెతో మర్దన
హెయిర్ స్పా, కుదుళ్లకు పోషణ అందించడంతో మొదలవుతుంది. అందుకోసం మొదట నచ్చిన నూనెను వెచ్చబరుచుకుని, వేళ్ల కొనలతో వెంట్రుకల కుదుళ్లకు పట్టించి, మృదువుగా మర్దన చేయాలి. అవసరమనుకుంటే స్కాల్ప్ మసాజ్ బ్రష్‌ను కూడా వాడుకోవచ్చు. ఇలా 10 నుంచి 15 నిమిషాల పాటు మర్దన చేసిన తర్వాత, ఇంకొంత నూనెను వెంట్రుకలకు పట్టించాలి. ఇలా చేయడం వల్ల కుదుళ్లన్నిటికీ పోషణ అందుతుంది. రక్తప్రసరణ మెరుగు పడుతుంది. ఇలా వారానికోసారి క్రమం తప్పకుండా చేయాలి.
స్టీమింగ్ అండ్ క్ల్లెన్సింగ్
వెంట్రుకలన్నిటికీ నూనె పట్టించి, మర్దన చేసి 45 నిమిషాల పాటు అలాగే వదిలేయాలి. ఇలా వదిలేయడం వల్ల నూనె మరింత మెరుగ్గా కుదుళ్లలోకి ఇంకుతుంది. తర్వాత వేడి నీళ్లలో టవల్ ముంచి, గట్టిగా పిండి, 5 నిమిషాల పాటు తలకు చుట్టేసుకోవాలి. ఇలా చేసినప్పుడు, టవల్ విడుదల చేసే ఆవిరితో వెంట్రుకల కుదుళ్లు తెరుచుకుని నూనె శోషణ మరింత బాగా జరుగుతుంది. ఇలా ఒకట్రెండు సార్లు చేసిన తర్వాత, మైల్డ్ షాంపూతో తలస్నానం చేసేయాలి.
హెయిర్ మాస్క్ హైడ్రేటింగ్ మాస్క్‌తో వెంట్రుకలకు సరిపడా తేమ అందుతుంది. కాబట్టి అరటిపండు, అవకాడొ, తేనె, పెరుగులతో హెయిర్ మాస్క్ తయారుచేసుకుని, వెంట్రుకలకు పట్టించి, 15 నిమిషాల తర్వాత ఎక్కువ నీళ్లతో శుభ్రంగా కడిగేయాలి. అవసరమనుకుంటే, లైట్ వెయిట్ హెయిర్ సీరమ్ వాడుకోవచ్చు. దీంతో చిక్కులు పడని, మెరుపులీనే జుట్టు సొంతమవుతుంది.
చివర్లో ఇలా...
హెయిర్ స్పా పూర్తయిన తర్వాత, జుట్టు తడిగా ఉన్నప్పుడే దువ్వెనతో దువ్వుకోకూడదు. అలాగని హెయిర్ డ్రయర్ కూడా వాడుకోకూడదు. వెంట్రుకలు సహజసిద్ధంగా గాలికి ఆరిపోయేలా చూసుకోవాలి. పూర్తిగా ఆరిన తర్వాత పెద్ద దంతాల దువ్వెనతో నెమ్మదిగా దువ్వుకోవాలి. బరువైన, బిగుతైన క్లిప్పులు, పిన్నులు వెంట్రుకలకు హాని కలిగిస్తాయి. కాబట్టి తలకు ఉపయోగించే క్లిప్పులు, హెయిర్ పిన్స్ నాణ్యమైనవి, సౌకర్యవంతమైనవే ఎంచుకోవాలి. అలాగే వాన, ఎండ, చల్లగాలుల నుంచి వెంట్రుకలకు రక్షణ కల్పించాలి. వాన లో తడిచిన వెంటనే తలస్నానం చేసేయాలి. మరీ వేడిగా, మరీ చల్లగా ఉన్న నీళ్లకు బదులుగా గోరువెచ్చని నీళ్లనే తలస్నానానికి ఉపయోగించాలి.
ఇవీ చదవండి:
'నేను ఎంకే స్టాలిన్ తనయుడిని'.. ఉదయనిధి స్టాలిన్ కీలక వ్యాఖ్యలు
తమిళనాడు బడ్జెట్: పుట్టిన బిడ్డకు గోల్డ్ రింగ్.. జెన్ జీకి రూ.2 వేల కోట్లు