Share News

బరోక్‌ పెరల్స్‌ జ్యువెలరీ

ABN , Publish Date - Oct 25 , 2026 | 06:42 AM

అసమానంగా వంకరటింకరగా మెరిసే బరోక్‌ ముత్యాలతో రూపొందించిన నగలు ట్రెండింగ్‌లోకి వచ్చేశాయి. సహజసిద్ధంగా ఏర్పడే విలక్షణమైన ఆకృతి ఈ బరోక్‌ ముత్యాల..

బరోక్‌ పెరల్స్‌ జ్యువెలరీ

అసమానంగా వంకరటింకరగా మెరిసే బరోక్‌ ముత్యాలతో రూపొందించిన నగలు ట్రెండింగ్‌లోకి వచ్చేశాయి. సహజసిద్ధంగా ఏర్పడే విలక్షణమైన ఆకృతి ఈ బరోక్‌ ముత్యాల ప్రత్యేకత.

అదే నేటి ఫ్యాషన్‌ ప్రపంచంలో వాటికి విపరీతమైన క్రేజ్‌ను తెచ్చిపెట్టింది. అనన్యా పాండే, కృతి సనన్‌ తదితర బాలీవుడ్‌ నటీమణుల నుంచి అంతర్జాతీయ మోడల్స్‌ వరకు అందరూ వీటిని అమితంగా ఇష్టపడుతున్నారు. ఇవి బడ్జెట్‌ ధరల్లోనే లభిస్తుండడంతో సామాన్య మహిళలు సైతం వీటిపై దృష్టి సారిస్తున్నారు.

ఏ రెండు బరోక్‌ ముత్యాలు ఒకే రకంగా ఉండవు. ప్రతీది విలక్షణమైన ఆకారంతో విభిన్నమైన వంపులతో రూపొందుతుంది. పోర్చుగీసు భాషలో బారోకో అంటే సరైన ఆకారం లేని ముత్యం అని అర్థం. దీని నుంచే వాటికి బరోక్‌ ముత్యాలనే పేరు స్థిరపడింది. ఇవి 16వ శతాబ్దం నాటికే వెలుగులోకి వచ్చాయి. పోర్చుగీసువారు వీటిని ఎక్కువగా ఆభరణాల్లో వినియోగించేవారు. అప్పటి స్వర్ణకారులు బరోక్‌ ముత్యాలను అద్భుతమైన కళా సృష్టిగా భావించేవారు. పలు ఆకారాల్లో ఉన్న ముత్యాలను ప్రత్యేకంగా కూర్చి పక్షులు, జంతువులు, పూలు, దేవతల రూపాలతో కూడిన లాకెట్లను తయారుచేసేవారు. అలాగే చిన్న చిన్న నెక్లె్‌సలు, ఉంగరాలను కూడా డిజైన్‌ చేసేవారు. 17, 18 శతాబ్దాల్లో ఈ కళాశైలి బాగా ప్రాచుర్యం పొందింది. వీటిని ఐరోపా రాణి ఎలిజబెత్‌ 1 ఇష్టంగా ధరించేవారు. ప్రపంచ ప్రసిద్ధి పొందిన ‘లా పెరెగ్రినా’ అనే అతిపెద్ద ముత్యం.. ఈ ‘బరోక్‌’ల వర్గానికే చెందుతుంది.

19వ శతాబ్దం నాటికి గుండ్రని ముత్యాలకు విపరీతమైన డిమాండ్‌ ఏర్పడడంతో బరోక్‌లకు ఆదరణ తగ్గింది. ప్రస్తుతం ప్రతి ఒక్కరూ తమకంటూ ఓ ప్రత్యేకత ఉండాలని భావిస్తుండడంతో ఇవి మళ్లీ తెరపైకి వచ్చాయి. బరోక్‌ ముత్యాలతో రూపొందించిన ప్రతీ నగ ఓ స్టేట్‌మెంట్‌ పీస్‌లా నిలుస్తుంది. అందుకే సెలబ్రిటీల దృష్టి వీటిపైకి మళ్లుతోంది.


మామూలు ముత్యాల్లాగే బరోక్‌లు కూడా ఆల్చిప్పల్లోనే తయారవుతాయి. ఆల్చిప్పల్లోకి ప్రవేశించిన ఇసుక రేణువులు లేదా ఇతర కణాల చుట్టూ నాక్రే పొరలు అసమానంగా, ఒకవైపు ఎక్కువగా మరోవైపు తక్కువగా పేరుకుపోతుండడంతో విచిత్రమైన ఆకారాల్లో బరోక్‌ ముత్యాలు ఏర్పడతాయి. ఇవి మంచినీటిలో, ఉప్పునీటిలో కూడా లభ్యమవుతాయి. వీటితో రూపొందించిన చోకర్లు, హారాలు, బ్రేస్‌లెట్లు, ఉంగరాలు విభిన్నమైన వింటేజ్‌, ఆర్టిస్టిక్‌ లుక్‌తో రాయల్‌ వైబ్‌ను సృష్టిస్తాయి.

బరోక్‌ ముత్యాలను నాలుగు రకాలుగా వర్గీకరించారు

కాయిన్‌ పెరల్స్‌: ఇవి నాణెంలా కనిపిస్తుంటాయి. వీటిని పెండెంట్లు, చోకర్లు, ఉంగరాల డిజైన్లలో ఉపయోగిస్తుంటారు.

టియర్‌ డ్రాప్‌ పెరల్స్‌: ఇవి నీటి చుక్క కిందికి పడుతున్నట్లు కనిపిస్తాయి. వీటిని హ్యాంగింగ్స్‌, ఇయర్‌ రింగ్స్‌ డిజైన్లలో వాడుతుంటారు.

కేశీ పెరల్స్‌: వీటిని ఇష్టపడని యువతులు ఉండరు. ఇవి సన్నగా పొడువుగా పొట్టిగా ఇలా ఓ నిర్దిష్టమైన ఆకారం లేకుండా ఉంటాయి. గరుకుగా ఉన్నప్పటికీ అద్భుతంగా మెరుస్తుంటాయి. వీటితో పెండెంట్‌ హారాలు, మల్టీ లేయర్డ్‌ చోకర్లు, పొట్టి హారాలు రూపొందిస్తుంటారు.

ట్విన్‌ పెరల్స్‌: రెండు ముత్యాలు కలిసి ఒక ముత్యంలా ఏర్పడుతుంటాయి. వీటితో స్టడ్స్‌, పెండెంట్స్‌, రింగ్స్‌ డిజైన్‌ చేస్తారు.

పెద్ద సైజు బరోక్‌ ముత్యాలతో రూపొందించిన చంకీ చోకర్స్‌, ట్విస్టెడ్‌ మల్టీ లేయర్డ్‌ హారాలు.. యువతులను ఆకట్టుకుంటున్నాయి. కెంపులు, పచ్చలతోపాటు వీటినీ జతచేసి డిజైన్‌ చేసిన బ్రేస్‌లెట్లు, ఇయర్‌ రింగ్స్‌, గాజులకు డిమాండ్‌ అధికం. ఇవి చీరలు, సంప్రదాయ దుస్తులమీదే కాకుండా జీన్స్‌, బ్లేజర్స్‌, మోడరన్‌ ఫ్రాక్‌ల మీద బాగా సూటవుతాయి.

ఈ వార్తలు కూడా చదవండి

జోర్డాన్‌లో చర్చిపై కాల్పులు.. ఏడుగురి మృతి, 40 మందికి గాయాలు

వనాటు దీవుల సమీపంలో 7.2 తీవ్రతతో భారీ భూకంపం..

Updated Date - Oct 25 , 2026 | 06:42 AM